విశాఖలో 16 స్టార్ హోటళ్లు
ABN , Publish Date - Sep 10 , 2026 | 01:39 AM
రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్‌ఐపీబీ) ద్వారా విశాఖపట్నంలో రూ.5,589 కోట్లతో 16 స్టార్ హోటల్ ప్రాజెక్టులు గ్రౌండింగ్ అయ్యాయని, వాటి ద్వారా 980 కొత్త రూమ్‌లు అందుబాటులోకి వస్తాయని, పది వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని పర్యాటక శాఖా మంత్రి కందుల దుర్గేశ్ తెలిపారు.
రూ.5,589 కోట్ల పెట్టుబడులు
10,000 మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు
నవంబరు నుంచి రెగ్యులర్‌గా క్రూయిజర్
త్వరలోనే కారవాన్ సేవలు
సీ ప్లేన్ కూడా...
పర్యాటక శాఖా మంత్రి కందుల దుర్గేశ్
విశాఖపట్నం, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి):
రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్‌ఐపీబీ) ద్వారా విశాఖపట్నంలో రూ.5,589 కోట్లతో 16 స్టార్ హోటల్ ప్రాజెక్టులు గ్రౌండింగ్ అయ్యాయని, వాటి ద్వారా 980 కొత్త రూమ్‌లు అందుబాటులోకి వస్తాయని, పది వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని పర్యాటక శాఖా మంత్రి కందుల దుర్గేశ్ తెలిపారు. ఇండియన్ టూర్ ఆపరేటర్స్ అసోసియేషన్ జాతీయ సదస్సులో పాల్గొనడానికి విశాఖపట్నం వచ్చిన ఆయన బుధవారం నోవాటెట్ హోటల్‌లో విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం ఏడాదికి మూడు, నాలుగుసార్లు మాత్రమే వస్తున్న కార్డిలియో క్రూయిజర్ నవంబరు నుంచి రెగ్యులర్‌గా వస్తుందని, అందుకు తగిన ఏర్పాట్లు చేశామన్నారు. విశాఖలో కారవాన్ టూరిజం ప్రారంభించడానికి ఇంకా కొంత సమయం పడుతుందన్నారు. ప్యాకేజీల విషయంలో గిట్టుబాటు కావడం లేదని నిర్వాహకులు చెబుతున్నారని, దీనిపై చర్చలు జరుగుతున్నాయన్నారు. సీ ప్లేన్ టూరిజం త్వరలోనే అందుబాటులోకి వస్తుందని, లంబసింగి, అరకులోయ వంటి ప్రాంతాలకు ఇవి నడుస్తాయన్నారు. వాటికి ఉడాన్ పథకం కింద ఆర్థిక సాయం చేస్తామని మంత్రి వివరించారు. హోమ్ స్టేలకు ఆదరణ పెరుగుతున్నదని, పొందూరు, ఏటికొప్పాక వంటి ప్రాంతాల్లో పర్యాటకులు ఒక రాత్రి ఉండేలా, అక్కడ అన్ని స్వయంగా తెలుసుకునేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. రుషికొండలో వైసీపీ నిర్మించిన భవనం లీజు అంశమై కేబినెట్ సబ్ కమిటీ నివేదిక సమర్పించిందన్నారు. భవనం పక్కనే ఉన్న తొమ్మిది ఎకరాలను కూడా ఇవ్వాలని సంస్థలు కోరతున్నాయని, అయితే అందులో 7.5 ఎకరాలు సీఆర్‌జెడ్ పరిధిలో ఉందని, ఎటువంటి నిర్మాణాలు చేయకూడదన్నారు. మిగిలిన 1.5 ఎకరాల భూమితో పాటు భవనం లీజుకు ఇచ్చే విషయమై ఈ నెలాఖరుకు నిర్ణయం తీసుకుంటారన్నారు. అరకు, పాడేరు, లంబసింగి వంటి ప్రాంతాల్లో పర్యాటక పెట్టుబడులకు ఇబ్బందులు వస్తున్నాయని, అక్కడ 1/70 చట్టం ఉందని గుర్తుచేశారు. అందుకని ఐటీడీఏ ద్వారా పర్యాటక శాఖ భూములను లీజుకు తీసుకొని వాటిని అభివృద్ధి చేయడానికి పీపీపీలో ఇచ్చే ఆలోచన చేస్తున్నామన్నారు. వీటిపై హక్కులు ప్రభుత్వానికే ఉంటాయన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులతో చేపట్టిన ‘ప్రసాద్’ పనులను సమీక్షిస్తున్నామని, సింహాచలంలో దుబారా చేయడంపై చర్యలు తీసుకున్నామన్నారు. వృథాగా ఉన్న ఈ-వ్యాన్లను అవసరమైతే భవానీ ద్వీపానికి తరలిస్తామని డిప్యూటీ సీఈఓ తెలిపారు. తీరప్రాంతాల్లో వెల్‌నెస్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని, విశాఖలో బాబా రాందేవ్ వెల్‌నెస్ సెంటర్ ఏర్పాటుకు ఆసక్తిగా ఉన్నారన్నారు.