Share News

అన్నదాతల సేవలో...

ABN , Publish Date - Jun 08 , 2026 | 12:46 AM

ఎట్టకేలకు సబ్బవరంలోని జిల్లా స్థాయి అగ్రి ల్యాబ్‌ అందుబాటులోకి రానుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత నిధులు మంజూరు చేయడంతో భవన నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. మరో రెండు నెలల్లో దీనిని రైతులకు అందుబాటులో తేవడానికి అధికారులు కృషి చేస్తున్నారు.

అన్నదాతల సేవలో...
సబ్బవరంలో జిల్లా స్థాయి అగ్రి ల్యాబ్‌ భవనం

త్వరలో అందుబాటులోకి అగ్రి ల్యాబ్‌

కూటమి ప్రభుత్వం వచ్చాక పెండింగ్‌ నిధులు మంజూరు

ఇటీవల పూర్తయిన భవన నిర్మాణం

సబ్బవరం, జూన్‌ 7 (ఆంధ్రజ్యోతి): ఎట్టకేలకు సబ్బవరంలోని జిల్లా స్థాయి అగ్రి ల్యాబ్‌ అందుబాటులోకి రానుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత నిధులు మంజూరు చేయడంతో భవన నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. మరో రెండు నెలల్లో దీనిని రైతులకు అందుబాటులో తేవడానికి అధికారులు కృషి చేస్తున్నారు.

పంటల సాగులో అన్నదాతకు మెరుగైన సేవలు అందించాలన్న కృత నిశ్చయంతో 2014-19 మధ్య తెలుగుదేశం ప్రభుత్వం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక సమీకృత వ్యవసాయ ప్రయోగశాలను, జిల్లా మొత్తానికి ఒక అగ్రి ల్యాబ్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీంతో సబ్బవరంలో జిల్లా స్థాయి అగ్రి ల్యాబ్‌ను ఏర్పాటు చేయడానికి సర్వే నంబరు 271లో ఐదు ఎకరాల భూమిని 2018లో అప్పటి టీడీపీ ప్రభుత్వం కేటాయించింది. భవన నిర్మాణానికి రూ.3.5 కోట్లు, మౌలిక సదుపాయాలు, లేబొరేటరీ పరికరాల కోసం రూ.2.5 కోట్లు కేటాయించింది. అన్ని వసతులతో 2019 ఖరీఫ్‌ నాటికి అందుబాటులోకి తీసుకురావాలనుకున్నప్పటికీ స్థల సమస్యతో జాప్యం జరిగింది. ఆ తరువాత 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడం, అప్పటికే అన్ని రకాల పరిపాలన అనుమతులతో పాటు నిధుల కేటాయింపులు జరిగిపోవడంతో 2020లో రూ.కోటి నిధులు మంజూరు చేసింది. అగ్రి ల్యాబ్‌ భవన నిర్మాణ పనులను రాష్ట్ర పోలీసు హౌసింగ్‌ కార్పొరేషన్‌కు అప్పగించింది. 2021 ఖరీఫ్‌ నాటికి అందుబాటులోకి తీసుకొస్తామని అప్పటి నేతలు, అధికారులు ప్రకటించారు. అయితే నత్తనడకన సాగిన పనులు 2022 నాటికి 90 శాతం మేర పూర్తయ్యాయి. ఇంకా రూ.40 లక్షలకు సంబంధించిన పనులు పెండింగ్‌లో ఉండిపోయాయి. గత ప్రభుత్వం ఆ నిధులు మంజూరు చేయకపోవడంతో 2023 నుంచి పనులు ముందుకు కదల్లేదు. విద్యుత్తు, ఫ్లోరింగ్‌, ప్లంబింగ్‌ పనులు, భవనం చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణ పనులు మిగిలిపోయాయి. ఈలోగా ఆవరణలో పిచ్చిమొక్కలు పెరిగిపోయాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక ఇటీవల నిధులు మంజూరు చేయడంతో ఫ్లోరింగ్‌, ఎలక్ర్టికల్‌, పెయింటింగ్‌ పనులు పూర్తయ్యాయి. కొన్ని గదుల్లో ఏసీలు అమర్చారు. ప్రహరీ గోడ నిర్మాణ పనులు ప్రారంభించారు. నెల రోజుల్లో పూర్తి చేసి ప్రభుత్వానికి అప్పగిస్తామని పోలీసు హౌసింగ్‌ కార్పొరేషన్‌ డీఈఈ కె.శేఖర్‌ తెలిపారు.

అగ్రి ల్యాబ్‌తో రైతులకు ఎంతో మేలు

జిల్లా స్థాయి అగ్రి ల్యాబ్‌ అందుబాటులోకి వస్తే రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. మట్టి నమూనాలు, ఎరువులు, విత్తనాల పరీక్షలను ఉచితంగానే నిర్వహిస్తారు. మట్టి నమూనా పరీక్షల ఆధారంగా పొలంలో ఏ పంట సాగు చేయాలి? ఏయే సూక్ష్మపోషకాలు(ఎరువులు) వేయాలి? అనేది తెలుస్తుంది. ప్రైవేటు దుకాణాల్లో రైతులు కొనుగోలు చేసే రసాయన ఎరువులు, విత్తనాల నమూనాలను సేకరించి ప్రయోగశాలలో పరీక్షిస్తారు. నిర్దేశించిన ప్రమాణాలు లేకపోతే సంబంధిత వ్యాపారులు, సంస్థలపై చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు.

----------------------

మరో రెండు నెలల్లో అందుబాటులోకి..

ఆశాదేవి, జిల్లా వ్యవసాయాధికారి (ఫొటో- 5ఎస్‌బిఎమ్‌6)

సబ్బవరంలో జిల్లా స్థాయి అగ్రి ల్యాబ్‌ను మరో రెండు నెలల్లో రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చేలా కృషి చేస్తున్నాం. ఇప్పటికే భవన నిర్మాణానికి సంబంధించిన అన్ని పనులు పూర్తయ్యాయి. ప్రహరీ గోడ నిర్మాణం పూర్తయిన వెంటనే ప్రయోగశాలకు అవసరమైన సాంకేతిక పరికరాల కోసం టెండర్లు పిలుస్తాం. సాంకేతిక, సాంకేతికేతర సిబ్బంది నియామకానికి కమిషనరేట్‌ నుంచి ఆదేశాలు రావాల్సి వుంది. ఈ ప్రక్రియ పూర్తయితే ప్రారంభోత్సవం జరుగుతుంది.

Updated Date - Jun 08 , 2026 | 12:46 AM