Share News

రెండో విడతలోనూ.. హోరాహోరీ

ABN , Publish Date - Nov 30 , 2026 | 01:36 AM

జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ పోరు హోరాహోరీగా సాగింది. అనంతగిరి, జి.మాడుగుల, ముంచంగిపుట్టు, పెదబయలు మండలాల్లోని 87 పంచాయతీలో ఆదివారం జరిగిన ఎన్నికల్లో కూటమి 35, వైసీపీ 37 సర్పంచ్‌ పదవులను దక్కించుకున్నాయి. అలాగే 15 మంది స్వతంత్రులు విజయం సాధించారు. కూటమి పార్టీలు ఈసారి బాగా పుంజుకున్నాయి.

రెండో విడతలోనూ..  హోరాహోరీ
పెదబయలు మండలంలోని సీతగుంట కౌంటింగ్‌ కేంద్రం వద్ద కౌంటింగ్‌ చేస్తున్న ఎన్నికల సిబ్బంది

- బాగా పుంజుకున్న కూటమి పార్టీలు

- వైసీపీకి ఎదురుగాలి

- మొత్తం 87 పంచాయతీల్లో కూటమికి 35, వైసీపీ 37, ఇతరులు 15

(పాడేరు- ఆంధ్రజ్యోతి)

జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ పోరు హోరాహోరీగా సాగింది. అనంతగిరి, జి.మాడుగుల, ముంచంగిపుట్టు, పెదబయలు మండలాల్లోని 87 పంచాయతీలో ఆదివారం జరిగిన ఎన్నికల్లో కూటమి 35, వైసీపీ 37 సర్పంచ్‌ పదవులను దక్కించుకున్నాయి. అలాగే 15 మంది స్వతంత్రులు విజయం సాధించారు. కూటమి పార్టీలు ఈసారి బాగా పుంజుకున్నాయి.

తొలి విడత పంచాయతీ ఎన్నికలతో పోలిస్తే రెండో విడతలో కూటమి పార్టీలు అనూహ్యంగా దూసుకుపోయాయి. ఆశించిన స్థాయిలో సర్పంచులు గెలుపొందడం ఏజెన్సీ ఓటర్లలో మార్పునకు సంకేతంగా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. దీంతో మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో పరిస్థితులపై ఆయా రాజకీయ పార్టీలు అంచనాలు రూపొందించుకుంటున్నాయి.

- జి.మాడుగులలో హోరాహోరీ... మండలంలోని పంచాయతీ ఎన్నికల్లో కూటమి, వైసీపీ హోరాహోరీగా తలపడ్డాయి. మొత్తం 17 పంచాయతీలకు గాను టీడీపీ 7, వైసీపీ 8, ఇతరులు 2 సర్పంచ్‌ పదవులను దక్కించుకున్నారు.

- ముంచంగిపుట్టులో పుంజుకున్న టీడీపీ... ఏజెన్సీ మారుమూల ముంచంగిపుట్టు మండలంలో టీడీపీ పుంజుకుంది. తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అది స్పష్టంగా కనిపించింది. గత ఎన్నికల్లో మొత్తం 23 పంచాయతీకు గాను టీడీపీ కేవలం 4 మాత్రమే గెలుచుకోగా, వైసీపీ 19 సర్పంచులు దక్కించుకుంది. ఈ ఎన్నికల్లో టీడీపీ 7, బీజేపీ 2తో కలిసి కూటమి 9 సర ్పంచులు కైవసం చేసుకోగా, వైసీపీ 12 చోట్ల విజయం సాధించింది. అయితే గతంతో పోల్చితే కూటమి రెట్టింపు సర్పంచులు దక్కాయని ఆ పార్టీల నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

- అనంతగిరిలో కూటమికి 12 సర్పంచులు.. ఈ మండలంలో మొత్తం 24 పంచాయతీల్లో కూటమి 12 సర్పంచులు దక్కించుకోగా, వైసీపీ 9, స్వతంత్రులు 3 చోట్ల గెలుపొందారు. ఈ మండలంలో పరిషత్‌ ఎన్నికల్లో జడ్పీటీసీ, ఎంపీపీ పదవులను దక్కించుకున్న వైసీపీ పంచాయతీ ఎన్నికల్లో చితికిల పడడం గమనార్హం.

- పెదబయలులో పోటా పోటీ... పెదబయలు మండలంలో కూటమి, వైసీపీ పోటా పోటీగా సర్పంచులను దక్కించుకున్నాయి. మండలంలో మొత్తం 23 పంచాయతీలకు టీడీపీ 7, జనసేన 1, వైసీపీ 8, ఇతరులు 8 సర్పంచులు గెలుచుకున్నారు. అయితే ఇక్కడ స్వతంత్రులు సైతం 8 సర్పంచులు దక్కించుకోవడం విశేషం.

Updated Date - Nov 30 , 2026 | 01:36 AM