Share News

సమగ్ర శిక్షలో పోస్టులకు పైరవీలు

ABN , Publish Date - Feb 05 , 2026 | 01:23 AM

పాఠశాల విద్యా శాఖ పరిధిలో గల సమగ్రశిక్ష విభాగంలో సెక్టోరియల్‌ పోస్టుల కోసం పలువురు ఉపాధ్యాయులు పైరవీలు చేస్తున్నారు.

సమగ్ర శిక్షలో  పోస్టులకు పైరవీలు

అర్హత లేని టీచర్‌కు సీఎంవో అవకాశం?

ప్రజా ప్రతినిధి సిఫారసు మేరకు అధికారుల ప్రతిపాదనలు

ఉపాధ్యాయ సంఘాల అభ్యంతరం

విశాఖపట్నం, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి):

పాఠశాల విద్యా శాఖ పరిధిలో గల సమగ్రశిక్ష విభాగంలో సెక్టోరియల్‌ పోస్టుల కోసం పలువురు ఉపాధ్యాయులు పైరవీలు చేస్తున్నారు. కమ్యూనిటీ మొబలైజేషన్‌ ఆఫీసర్‌ (సీఎంవో), అసిస్టెంట్‌ ప్రోగ్రామింగ్‌ ఆఫీసర్‌ (ఏపీవో), బాలికా అభివృద్ధి అధికారి (జీసీడీవో), సహిత విద్యా సమన్వయకర్త (ఐఈ కో-ఆర్డినేటర్‌) పోస్టులకు గత ఏడాది నవంబరులో నోటిఫికేషన్‌ జారీచేశారు. సీఎంవో, ఏపీవో పోస్టుల్లో ఫారెన్‌ సర్వీస్‌ కింద, జీసీడీవో, ఐఈ కో-ఆర్డినేటర్‌ పోస్టుల్లో డిప్యూటేషన్‌పై నియమిస్తారు. ఈ నాలుగు రకాల పోస్టుల్లో నియమితులు కావాలంటే టీచర్లు జిల్లాలోని 11 మండలాల పరిధిలోనే పనిచేసి ఉండాలి. స్కూల్‌ అసిస్టెంట్‌గా ఐదేళ్లు లేదా సెకండరీగ్రేడ్‌ టీచర్‌గా ఎనిమిదేళ్లు సర్వీస్‌ పూర్తిచేసి 55 ఏళ్ల కంటే తక్కువ వయస్సు కలిగిన టీచర్లు మాత్రమే అర్హులు. దీని ప్రకారం సీఎంవో, ఏపీవో పోస్టులకు 13 మంది చొప్పున, జీసీడీవో పోస్టుకు తొమ్మిది మంది, ఐఈ కో-ఆర్డినేటర్‌ పోస్టుకు నలుగురు దరఖాస్తు చేశారు. నిబంధనల ప్రకారం వచ్చిన దరఖాస్తులను మినహా మిగిలిన వాటిని తిరస్కరించాలి. అయితే సీఎంవో పోస్టుకు స్కూల్‌ అసిస్టెంట్‌గా రెండేళ్ల సర్వీస్‌ ఉన్న టీచర్‌ దరఖాస్తును ఉన్నతాధికారులకు పంపారని పలువురు ఉపాధ్యాయులు పాఠశాల విద్యా శాఖకు ఫిర్యాదు చేశారు. కొన్ని ఉపాధ్యాయ సంఘాలు కలెక్టర్‌కు ఫిర్యాదు చేసి విచారణ చేయాలని కోరారు. సీఎంవో పోస్టుకు తనకు తెలిసిన ఉపాధ్యాయుడికి ఇవ్వాలని ప్రజా ప్రతినిధి ఒకరు ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చారని ఆరోపిస్తున్నాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా సదరు ప్రజా ప్రతినిధి విద్యా శాఖ విషయాల్లో జోక్యం చేసుకుంటున్నారని విమర్శిస్తున్నాయి. కొందరు అధికారులు కూడా ఆయనకు అనుకూలంగా ఉంటున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. సీఎంవోగా అర్హత లేని టీచర్‌ పేరును ఉన్నతాధికారులకు పంపడంపై సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు కో-ఆర్డినేటర్‌ చంద్రశేఖరరావు వద్ద ప్రస్తావించగా వచ్చిన దరఖాస్తులన్నింటినీ రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్‌కు పంపామన్నారు. పోస్టుల నియామకంపై తుది నిర్ణయం ఆయనదేనన్నారు.

Updated Date - Feb 05 , 2026 | 01:23 AM