లారీ డ్రైవర్‌పై దాడి కేసులో రవాణా అధికారి కారు డ్రైవర్ అరెస్టు
ABN , Publish Date - Aug 27 , 2026 | 12:55 AM
మధ్యప్రదేశ్‌కు చెందిన లారీ డ్రైవర్ సాహూపై దాడి కేసులో విశాఖపట్నం అసిస్టెంట్ మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్ పార్వతి కారు డ్రైవర్ శ్రీనివాస్‌ను బుధవారం సాయంత్రం మల్కాపురం పోలీసులు అరెస్టు చేశారు.
అసిస్టెంట్ మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్‌ను కూడా
విచారిస్తున్న మల్కాపురం పోలీసులు
ఈ కేసుపై పూర్తి నివేదిక సమర్పించాల్సిందిగా నగర పోలీస్ కమిషనర్‌కు హైకోర్టు ఆదేశం
మల్కాపురం (విశాఖపట్నం), ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): మధ్యప్రదేశ్‌కు చెందిన లారీ డ్రైవర్ సాహూపై దాడి కేసులో విశాఖపట్నం అసిస్టెంట్ మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్ పార్వతి కారు డ్రైవర్ శ్రీనివాస్‌ను బుధవారం సాయంత్రం మల్కాపురం పోలీసులు అరెస్టు చేశారు. అసిస్టెంట్ మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్‌ను కూడా స్టేషన్‌కు పిలిచి విచారిస్తున్నారు. లారీ డ్రైవర్‌పై రవాణా శాఖ అధికారి సమక్షంలో ఆమె కారు డ్రైవర్ దాడి చేశారని, ప్రస్తుతం బాధితుడు కనిపించడం లేదని విజయవాడ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధి శేషగిరి రెండు రోజుల క్రితం మల్కాపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతోపాటు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో తొలుత మల్కాపురం పోలీసులు మధ్యప్రదేశ్ నుంచి లారీ డ్రైవర్ సాహూను రప్పించారు. తాను రాయిపూర్ నుంచి మాంగనీస్ లోడుతో వస్తుండగా మారుతి సర్కిల్ వద్ద మహిళ అధికారి పార్వతి, ఆమె డ్రైవర్ శ్రీనివాస్‌లు వాహనం ఆపి...లోడ్ ఎక్కువగా ఉన్నందున ఐదు వేల రూపాయలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారని ఆరోపించాడు. అందుకు తాను నిరాకరించడంతో శ్రీనివాస్ తన క్యాబిన్‌లోకి దూసుకొచ్చి పిడుగుద్దులు కురిపించడంతో రక్తం కారిందని చెప్పాడు. అతడిని ఎందుకు కొడుతున్నావని ఆ సమయంలో అక్కడే ఉన్న పార్వతి అడుగుతున్నప్పటికీ శ్రీనివాస్ వినిపించుకోకుండా మరింత రెచ్చిపోయాడని తెలిపాడు. తాను స్థానికంగా ఒక ఆస్పత్రిలో వైద్యం చేయించుకున్న అనంతరం అక్కడ నుంచి శ్రవణ్ షిపింగ్ కార్పొరేషన్‌కు తీసుకొచ్చిన సరుకును అన్‌లోడ్ చేసి, ఇక్కడి నుంచి మరో లోడుతో తిరిగి రాయపుర్ వెళ్లిపోయినట్టు చెప్పాడు. అక్కడి నుంచి తన సొంత ప్రాంతమైన మధ్యప్రదేశ్‌కు వెళ్లానన్నాడు. ఈ దాడికి సంబంధించి డ్రైవర్ శ్రీనివాస్‌ను మల్కాపురం పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసును మల్కాపురం సీఐ నరసింగరావు పర్యవేక్షణలో ఎస్‌ఐ అప్పలనాయుడు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలావుండగా లారీ డ్రైవర్‌పై దాడి, అదృశ్యానికి సంబంధించి దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు బుధవారం విచారణ జరిపింది. డ్రైవర్‌ను 24 గంటలలోగా కోర్టు ముందు హాజరుపరచాలని ఆదేశించింది. అలాగే ఈనెల 31వ తేదీలోగా ఈ కేసుకు సంబంధించి పూర్తి నివేదిక ఇవ్వాలని నగర పోలీస్ కమిషనర్‌ను హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో సాహూను హైకోర్టులో హాజరుపరిచేందుకు మల్కాపురం పోలీసులు బుధవారం సాయంత్రం విజయవాడ తీసుకువెళ్లారు.