Share News

కూల్చేయాల్సిన భవనంలో..

ABN , Publish Date - Jul 27 , 2026 | 12:37 AM

మండలంలోని కొత్తకోటలో ఎస్సీ హాస్టల్‌, రావికమతంలో బీసీ, ఎస్సీ హాస్టళ్లు వున్నాయి. రావికమతంలోని రెండు హాస్టళ్ల భవనాలు, వసతులు మెరుగ్గానే వున్నప్పటికీ.. కొత్తకోట హాస్టల్‌ పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా వుంది.

కూల్చేయాల్సిన భవనంలో..
శ్లాబ్‌ పెచ్చులు ఊడిపోయి బయటకు కనిపిస్తున్న ఇనుప ఊచలు

కొత్తకోట ఎస్సీ హాస్టల్‌లో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్న విద్యార్థులు

మరమ్మతులు చేసినా ఉపయోగం లేదన్న ఇంజనీరింగ్‌ అధికారులు

రావికమతం, జూలై 26 (ఆంధ్రజ్యోతి): మండలంలోని కొత్తకోటలో ఎస్సీ హాస్టల్‌, రావికమతంలో బీసీ, ఎస్సీ హాస్టళ్లు వున్నాయి. రావికమతంలోని రెండు హాస్టళ్ల భవనాలు, వసతులు మెరుగ్గానే వున్నప్పటికీ.. కొత్తకోట హాస్టల్‌ పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా వుంది. వందమందికిపైగా విద్యార్థులు వున్న ఈ హాస్టల్‌ భవనం నిర్మించి సుమారు నాలుగున్నర దశాబ్దాలు కావడంతో శిథిలావస్థకు చేరింది. శ్లాబ్‌ పెచ్చులు ఊడిపోయి ఇనుప ఊచలు బయటకు కనిపిస్తున్నాయి. వర్షం కురిస్తే శ్లాబ్‌ నుంచి నీరు కారుతున్నది. భవనం గోడుల బీటలు వారాయి. సన్‌షేడ్‌ పెచ్చులు ఊడిపోయి పూర్తిగా కిందపడిపోయాయి. కిటికీలకు రెక్కలు లేకపోవడంతో పగలు ఈగలు, రాత్రి దోమలు లోపలికి వచ్చి విద్యార్థులకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. గత ఏడాది మెంథా తుఫాన్‌ సమయంలో భారీ వర్షాలు పడగా, ముందు జాగ్రత్త చర్యగా అధికారులు విద్యార్థులను ఖాళీ చేయించారు. సాధారణంగా ఏటా వేసవిలో వసతిగృహాల్లో మరమ్మతు, నిర్వహణ పనులు చేస్తుంటారు. కానీ కొత్తకోట హాస్టల్‌ భవనాలకు మరమ్మతు పనుల కోసం ప్రతిపాదనలు పంపగా, భవనాలను పరిశీలించిన ఇంజనీరింగ్‌ అధికారులు.. మరమ్మతులు చేసినా ఉపయోగం లేదని, దీనిని తొలగించి కొత్త భవనం నిర్మించాలని సూచించారు. దీంతో హాస్టల్‌ భవనాన్ని ఖాళీ చేసి, ప్రైవేటు భవనాన్ని అద్దెకు తీసుకోవడానికి అధికారులు ప్రయత్నించగా... స్థానికంగా ఎవరూ భవనాన్ని అద్దెకు ఇవ్వడానికి ముందుకు రాలేదని తెలిసింది. మరుగుదొడ్లు శుభ్రం చేయకపోవడంతో అధ్వానంగా వున్నాయి. హాస్టల్‌లో బెడ్లు లేకపోవడంతో విద్యార్థులు గచ్చుపైనే నిద్రించాల్సి వస్తున్నది. వసతిగృహం దుస్థితిపై వార్డెన్‌ జె.రామసత్యనారాయణను ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా.. ఉన్నతాధికారుల ఆదేశాలతో నూతన భవన నిర్మాణానికి ఇంజనీరింగ్‌ అధికారులు రూ.4.5 కోట్ల అంచనా వ్యయంతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారని చెప్పారు. కొత్త భవనం నిర్మించే వరకు హాస్టల్‌ నిర్వహణ కోసం కొత్తకోట జడ్పీ ఉనత్న పాఠశాలలో అందుబాటులో వున్న మూడు గదులను తాత్కాలికంగా కేటాయించాలని సాంఘిక సంక్షేమ శాఖ డీడీ ద్వారా జిల్లా విద్యా శాఖ అధికారికి వినతిపత్రం ఇచ్చినట్టు ఆయన వెల్లడించారు. డీఈఓ నుంచి అనుమతి లభించిన వెంటనే విద్యార్థులను అక్కడకు తరలిస్తామని చెప్పారు.

Updated Date - Jul 27 , 2026 | 12:37 AM