Share News

నర్సీపట్నంలో వార్‌ వన్‌సైడే

ABN , Publish Date - Nov 04 , 2026 | 01:42 AM

నర్సీపట్నం మునిసిపల్‌ ఎన్నికల్లో కూటమి ప్రభంజనం సృష్టించింది. చైర్‌పర్సన్‌ పదవితోపాటు 40 వార్డుల్లో ఒక్కటి మినహా మిగిలిన అన్ని స్థానాల్లో ఘన విజయం సాధించింది. కూటమి చైర్‌పర్సన్‌ అభ్యర్థి చింతకాయల పద్మావతి భారీ మెజారిటీతో జయకేతనం ఎగురవేశారు. ఆమె పోలైన ఓట్లలో మూడింట రెండు వంతుల ఓట్లతో వైసీపీకి చెందిన ప్రత్యర్థి చింతకాయల అనితపై తిరుగులేని ఆధిక్యాన్ని సాధించారు. మునిసిపల్‌ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించడంతో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల శ్రేణులు పట్టణంలో సంబరాలు చేసుకున్నారు.

నర్సీపట్నంలో వార్‌ వన్‌సైడే

ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి నుంచి ధ్రువీకరణ పత్రాన్ని అందుకుంటున్న చైర్‌పర్సన్‌ విజేత చింతకాయల పద్మావతి. చిత్రంలో కుమారులు ఎంపీ విజయ్‌, మాజీ కౌన్సిలర్‌ రాజేశ్‌, కోడళ్లు సువర్ణ, దివ్యశ్రీ ఉన్నారు.

కూటమి ప్రభంజనం

చైర్‌పర్సన్‌గా చింతకాయల పద్మావతి జయకేతనం

వైసీపీ అభ్యర్థిపై 11,455 ఓట్ల మెజారిటీ

40 వార్డులకుగాను 37 వార్డుల్లో కూటమి హవా

ఒక్క వార్డుకే పరిమితమైన వైసీపీ

తెలుగుదేశం శ్రేణుల విజయోత్సవాలు

సతీమణి పద్మావతికి శుభాకాంక్షలు తెలిపిన స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు

నర్సీపట్నం, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి):

నర్సీపట్నం మునిసిపల్‌ ఎన్నికల్లో కూటమి ప్రభంజనం సృష్టించింది. చైర్‌పర్సన్‌ పదవితోపాటు 40 వార్డుల్లో ఒక్కటి మినహా మిగిలిన అన్ని స్థానాల్లో ఘన విజయం సాధించింది. కూటమి చైర్‌పర్సన్‌ అభ్యర్థి చింతకాయల పద్మావతి భారీ మెజారిటీతో జయకేతనం ఎగురవేశారు. ఆమె పోలైన ఓట్లలో మూడింట రెండు వంతుల ఓట్లతో వైసీపీకి చెందిన ప్రత్యర్థి చింతకాయల అనితపై తిరుగులేని ఆధిక్యాన్ని సాధించారు. మునిసిపల్‌ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించడంతో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల శ్రేణులు పట్టణంలో సంబరాలు చేసుకున్నారు.

నర్సీపట్నం మునిసిపాలిటీ చైర్‌పర్సన్‌ పదవిని బీసీ మహిళకు రిజర్వు చేయడంతో కూటమి నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు సతీమణి పద్మావతి, వైసీపీ నుంచి ఆమె తోడికోడలు చింతకాయల అనిత పోటీ పడ్డారు. నామినేషన్ల ప్రక్రియకు ముందే ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. టీడీపీ అఽభ్యర్థికి మద్దతుగా ఆమె కుమారుడు, రాజ్యసభ సభ్యుడు చింతకాయల విజయ్‌తోపాటు మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు వార్డుల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. గత రెండున్నరేళ్ల కూటమి పాలనలో మునిసిపాలిటీలో కోట్లాది రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులను, అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి, వారి నుంచి సానుకూలత పొందారు. కూటమిని గెలిపిస్తే.. రానున్న కాలంలో మునిసిపాలిటీని ఊహించని విధంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో మూడింట రెండు వంతుల మంది ఓటర్లు అండగా నిలిచి, ఓట్లు వేశారు.

పద్మావతికి భారీ మెజారిటీ

నర్సీపట్నం మునిసిపాలిటీలో మొత్తం 49,099 మంది ఓటర్లు వున్నారు. ఆదివారం జరిగిన పోలింగ్‌లో వీరిలో 35,765 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మంగళవారం పెదబొడ్డేపల్లి డాన్‌బాస్కో కళాశాలలో ఓట్ల లెక్కింపు నిర్వహించారు. కూటమి (తెలుగుదేశం పార్టీ) అభ్యర్థి చింతకాయల పద్మావతికి 23,028 ఓట్లు (64.39 శాతం) పోలయ్యాయి. వైసీపీ అభ్యర్థి చింతకాయల అనితకు 11,573 ఓట్లు (32.36 శాతం) మాత్రమే వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థి బైపురెడ్డి చిట్టి శివ సంధ్యారాణికి 191 ఓట్లు పడ్డాయి. నోటాకు 400 ఓట్లు పడగా, 573 ఓట్లు చెల్లలేదు. తెలుగుదేశం అభ్యర్థి చింతకాయల పద్మావతి 11,519 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు.

అన్ని రౌండ్లలో పద్మావతి ఆధిపత్యం

మునిసిపాలిటీలో 40 వార్డులు వుండగా ఒక్కో రౌండ్‌కు పది వార్డుల చొప్పున నాలుగు రౌండ్లలో ఓట్లను లెక్కించారు. చైర్‌పర్సన్‌ అభ్యర్థి చింతకాయల పద్మావతి ప్రతీ రౌండ్‌లోనూ ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. మొదటి రౌండ్‌లో పద్మావతికి 5,156 ఓట్లు పోల్‌ అవ్వగా, వైసీపీ అభ్యర్థి అనితకు 2,583 ఓట్లు మాత్రమే పడ్దాయి. రెండో రౌండ్‌లో పద్మావతికి 5,274 ఓట్లు, అనితకు 2,509 ఓట్లు, మూడో రౌండ్‌లో పద్మావతికి 5858 ఓట్లు, అనితకు 2,853 ఓట్లు, నాలుగో రౌండ్‌లో పద్మావతికి 6,285 ఓట్లు, అనితకు 3,344 ఓట్లు వచ్చాయి. చైర్‌పర్సన్‌ విజేత చింతకాయల పద్మావతికి, ఎన్నికల అధికారి, నర్సీపట్నం ఆర్డీవో వీవీ రమణ ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు.

టీడీపీ శ్రేణుల సంబరాలు

మునిసిపల్‌ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించడంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. తెలుగుదేశం జెండాలతో ర్యాలీ నిర్వహించి, బాణసంచా కాల్చారు. స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు తన సతీమణి పద్మావతికి శుభాకాంక్షలు తెలిపారు. నివాసంలో రాజ్యసభ సభ్యుడు చింతకాయల విజయ్‌, డాక్టర్‌ సువర్ణ, టీడీపీ పట్టణ అధ్యక్షుడు రాజేశ్‌, దివ్యశ్రీలు దంపతులు పద్మావతితో కేక్‌ కట్‌ చేయించి స్వీటు తినిపించారు

వార్డుల్లోనూ కూటమిదే హవా

మునిసిపాలిటీలో 40 వార్డులు వుండగా.. టీడీపీ 34, జనసేన 3 వార్డుల్లో విజయం సాధించాయి. మరో రెండు వార్డుల్లో టీడీపీ-జనసేన బలపరిచిన ఇండిపెండెంట్‌ అభ్యర్థులు విజయం సాధించారు. వైసీపీ ఒక్క వార్డుతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.నామినేషన్ల పరిశీలన సమయంలో 26, 27 వార్డుల్లో టీడీపీ అభ్యర్థుల నామినేషన్లు మాత్రమే మిగలడంతో వారిద్దరూ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఎన్నికల అధికారులు ప్రకటించారు. దీంతో మిగిలిన 38 వార్డులకు, చైర్‌పర్సన్‌ పదవికి పోలింగ్‌ జరిగింది. మొత్తం మీద తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు 1, 2, 3, 4, 5, 6, 9, 10, 12, 14, 15, 16, 17, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40 వార్డుల్లో, జనసేన అభ్యర్థులు 8, 13, 18 వార్డుల్లో విజయం సాధించారు. 11, 29 వార్డులలో ఇండిపెండెంట్లు ఎన్నికయ్యారు. వైసీపీ అభ్యర్థి ఏడో వార్డులో గెలిచారు. 11వ వార్డులో ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన (జనసేన రెబల్‌) అభ్యర్థికి టీడీపీతోపాటు జనసేన శ్రేణులు మద్దతు ఇచ్చాయి. 29వ వార్డును బీజేపీకి కేటాయించగా, అక్కడ పోటీ చేయడానికి ముందుకు వచ్చిన నేతకు ఆ పార్టీ బీ ఫారం ఇవ్వలేదు. దీంతో టీడీపీ, జనసేన మద్దతుతో ఆయన ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలుపొందారు.

చైర్‌పర్సన్‌ అభ్యర్థులకు వచ్చిన ఓట్లు

మొత్తం ఓటర్లు: 49,099

పోలైన ఓట్లు: 35,765

చింతకాయల పద్మావతి (కూటమి- టీడీపీ): 23,028

చింతకాయల అనిత (వైసీపీ): 11,573

బైపురెడ్డి చిట్టి శివ సంధ్యారాణి (స్వతంత్ర): 191

నోటా: 400

చెల్లని ఓట్లు: 573

మెజారిటీ : 11,519 (కూటమి- టీడీపీ)

Updated Date - Nov 04 , 2026 | 01:44 AM