అంగరంగ వైభవంగా..
ABN , Publish Date - Mar 09 , 2026 | 01:24 AM
స్థానిక నూకాంబిక అమ్మవారి నూతన ఆలయంపై పసిడి కలశం, రాజగోపురంపై నవకలశాల ప్రతిష్ఠాపన మహోత్సవాలను ఆదివారం భక్తిశ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఎంపీ సీఎం రమేశ్ దంపతులు పాల్గొన్నారు. అంతకుముందు ఆలయానికి వచ్చిన వీరికి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
నూకాంబిక అమ్మవారి నూతన ఆలయం పునఃప్రారంభం
ప్రధాన ఆలయం, రాజగోపురంపై కలశాల ప్రతిష్ఠాపన
అమ్మవారి మూలవిరాట్‌కు ప్రత్యేక పూజలు
హాజరైన స్పీకర్ అయ్యన్న పాత్రుడు, ఎంపీ రమేష్ దంపతులు
నూతన ఆలయంలో అమ్మవారి దర్శనానికి తరలివచ్చిన భక్తులు
కొత్తూరు (అనకాపల్లి), మార్చి 8 (ఆంధ్రజ్యోతి): స్థానిక నూకాంబిక అమ్మవారి నూతన ఆలయంపై పసిడి కలశం, రాజగోపురంపై నవకలశాల ప్రతిష్ఠాపన మహోత్సవాలను ఆదివారం భక్తిశ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఎంపీ సీఎం రమేశ్ దంపతులు పాల్గొన్నారు. అంతకుముందు ఆలయానికి వచ్చిన వీరికి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం పునర్నిర్మించిన ప్రధాన ఆలయ మండపంలో నిర్వహించిన పసిడికలశాల నీరాజనం కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం అమ్మవారికి పసుపు, కుంకుమ, పట్టు వస్ర్తాలు సమర్పించి విశేష పూజలు నిర్వహించారు. గతంలో బాలాలయంలో ప్రాణప్రతిష్ఠ చేసిన శక్తియంత్రాన్ని ప్రధాన ఆలయంలోకి తీసుకువచ్చి ప్రతిష్ఠించారు. ప్రధాన ఆలయ గోపురంపై పసిడి కలశ ప్రష్ఠాపనలో పాల్గొని బూరెలు, పువ్వులతో అభిషేకాలు చేశారు. ఆలయానికి తూర్పువైపున కొత్తగా నిర్మించిన తొమ్మిది అంతస్థుల రాజగోపురంపైన తొమ్మిది కళశాలను ప్రతిష్ఠించి పూజలు చేశారు. ఈ కార్యక్రమాల్లో ఏపీయూఎఫ్‌ఐడీసీ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ దంపతులు, ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు దంపతులు, కార్పొరేషన్ల చైర్మన్లు బత్తుల తాతయ్యబాబు, మళ్ల సురేంద్ర, పీవీజీ కుమార్, డీసీఎంఎస్ చైర్మన్ కోట్ని బాలాజీ, మాజీ ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీశ్వరరావు, జనసేన పార్టీ నియోజకవర్గం ఇన్‌ఛార్జి భీమరశెట్టి రామకృష్ణ (రాంకీ) దంపతులు, జీవీఎంసీ మేయర్ పీలా శ్రీనివాసరావు, దేవస్థానం చైర్మన్ పీలా నాగశ్రీను (గొల్లబాబు), దేవాదాయ శాఖ ఆర్‌జేసీ వేండ్ర త్రినాథరావు, డీసీ సుజాత, ఏసీ సుధారాణి, ఈవో ఎ.శ్రీధర్, ధర్మకర్తలు పాల్గొన్నారు.
అమ్మవారి దర్శనానికి తరలివచ్చిన భక్తులు
పునర్నిర్మితమైన నూకాంబిక అమ్మవారి ఆలయంలో గత మూడు రోజుల నుంచి ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహిస్తున్నారు. ఆదివారం తెల్లవారుజాము నుంచి ఉదయం వరకు పలు కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం 10.58 గంటకు ప్రధాన ఆలయంలో అమ్మవారి మూలవిరాట్ దర్శనాన్ని భక్తులకు కల్పించారు. సుమారు మూడేళ్ల తరువాత అమ్మవారి మూలవిరాట్ దర్శనాలు ప్రారంభం కావడంతో వేలాది మంది భక్తులు తరలివచ్చారు. కాగా అమ్మవారి ఆలయం పునఃప్రారంభం సందర్భంగా మహిళల కోలాటాం, చిన్నారుల భరతనాట్యం ప్రదర్శించారు. తోడపెద్దు సేవలు, నేలవేషాలు నిర్వహించారు. ట్రాఫిక్ సమస్య లేకుండా డీఎస్పీ ఎం.శ్రావణి ఆధ్వర్యంలో సీఐలు ప్రేమ్‌కుమార్, అశోక్‌కుమార్, వెంకటనారాయణ, స్వామినాయుడు బందోబస్తును పర్యవేక్షించారు.