మూడు రోజులుగా అంధకారంలో..
ABN , Publish Date - May 26 , 2026 | 12:51 AM
మండలంలో ఈ నెల 23వ తేదీ సాయంత్రం పెనుగాలులు సృష్టించిన బీభత్సం నుంచి పలు గ్రామాలు ఇంకా బయటపడలేదు.
నక్కపల్లి మండలంలో పెనుగాలుల ధాటికి కూలిన విద్యుత్ స్తంభాలు
కరెంటు సరఫరా నిలిచిపోవడంతో ప్రజల ఇక్కట్లు
మందకొడిగా పునరుద్ధరణ పనులు
నక్కపల్లి, మే 25 (ఆంధ్రజ్యోతి):
మండలంలో ఈ నెల 23వ తేదీ సాయంత్రం పెనుగాలులు సృష్టించిన బీభత్సం నుంచి పలు గ్రామాలు ఇంకా బయటపడలేదు. మూడు రోజులు అవుతున్నప్పటికీ కొన్ని గ్రామాలకు విద్యుత్ సరఫరా పునరుద్ధరణ కాలేదు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండలంలోని రేబాక, రమణయ్యపేట, తిరుపతిపాలెం, దోసలపాడు, ముకుందరాజుపేట, జి.జగన్నాథపురం, డొంకాడ, చినదొడ్డిగల్లు, కాగిత, తదితర గ్రామాల్లో శనివారం సాయంత్రం వీచిన ఈదురుగాలుల ధాటికి 50 వరకు విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. కొన్నిచోట్ల విద్యుత్ వైర్లపై చెట్లు, కొమ్మలు పడిపోవడంతో వైర్లు తెగిపోయాయి. దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈపీడీసీఎల్ సిబ్బంది ఆదివారం ఉదయం రంగంలోకి దిగి విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులు చేపట్టారు. అయినప్పటికీ సోమవారం సాయంత్రం వరకు మెరక గ్రామాలకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించలేదు. రేబాక గ్రామంలో మోటార్లు పనిచేయకపోవడంతో తాగునీరు సరఫరా నిలిచిపోయింది. పంచాయతీ అధికారులు పంప్‌హౌస్ వద్ద జనరేటర్ ఏర్పాటు చేసి, తాగునీటి సరఫరాకు చర్యలు చేపట్టారు. మిగిలిన గ్రామాల్లో ఈ వెసులుబాటు కూడా లేకపోవడంతో ఊరు చివరన ఉన్న బావుల నుంచి నీటిని తెచ్చుకుంటున్నారు. కాగా ఈదురుగాలులకు మెరక గ్రామాల్లో అరటి, బొప్పాయి, మామిడి, జీడిమామిడి తోటలకు తీవ్రనష్టం వాటిల్లిందని, కానీ ఇంతవరకు అధికారులెవరూ పరిశీలించడానికి రాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.