హైవే నిర్మాణంలో నాణ్యతకు తిలోదకాలు
ABN , Publish Date - Mar 22 , 2026 | 11:40 PM
జాతీయ రహదారిని నిర్మించిన ఆరు నెలలకే లంబసింగి- చింతపల్లి మార్గంలో పలు చోట్ల పగుళ్లు, గోతులు ఏర్పడ్డాయి.
నిర్మించిన ఆరు నెలలకే లంబసింగి-చింతపల్లి మార్గంలో పలు చోట్ల గుంతలు, పగుళ్లు
వాహనచోదకులకు తప్పని ఇబ్బందులు
చింతపల్లి, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): జాతీయ రహదారిని నిర్మించిన ఆరు నెలలకే లంబసింగి- చింతపల్లి మార్గంలో పలు చోట్ల పగుళ్లు, గోతులు ఏర్పడ్డాయి. దీంతో ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. గ్రీన్ నేషనల్ హైవేస్ కారిడార్ ప్రాజెక్టులో భాగంగా రాజమహేంద్రవరం పంద్యాలపాలెం ఎన్‌హెచ్-16 నుంచి కొయ్యూరు, చింతపల్లి, లంబసింగి, పాడేరు, అరకు మీదుగా విజయనగరం ఎన్‌హెచ్-26 వరకు 406 కిలోమీటర్లు 516-ఈ జాతీయ రహదారి నిర్మాణం చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ రహదారి నిర్మాణానికి రూ.రెండు వేల కోట్లు అంచనా వ్యయం కాగా, తొలి విడతగా రూ.1,670 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఈ రహదారిని ఆరు ప్యాకేజీలుగా విభజించి నిర్మాణాలు చేపడుతున్నారు. లంబసింగి- చాపరాతిపాలెం ప్యాకేజీలో దాదాపు 90 శాతం రహదారి నిర్మాణాలు పూర్తి చేశారు. అయితే లంబసింగి-చింతపల్లి మార్గంలో రెండు లేయర్లు తారు రోడ్డు నిర్మించి, రోడ్ స్టడ్స్ ఏర్పాటు చేశారు. కాగా ఈ మార్గంలో పలు చోట్ల రోడ్డుపై పగుళ్లు ఏర్పడ్డాయి. రెండో లేయర్ వర్షాలకు కొట్టుకుపోయి గుంతలు ఏర్పడ్డాయి. చింతపల్లి మండల కేంద్రంలో ఏపీఆర్ కళాశాల నుంచి హనుమాన్ జంక్షన్ వరకు ఐదు చోట్ల తారు లేయర్ కొట్టుకుపోయి గుంతలు ఏర్పడ్డాయి. లంబసింగి ప్రారంభం, పెద్దగెడ్డ, లోతుగెడ్డ జంక్షన్ ప్రాంతంలోనూ జాతీయ రహదారిపై పగుళ్లు ఏర్పడ్డాయి. దీంతో జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న వాహన చోదకులు ఇబ్బంది పడుతున్నారు. జాతీయ రహదారిపై పగుళ్లు, గుంతలు ఏర్పడి నెల రోజులు కావస్తున్నప్పటికీ సంబంధితశాఖ అధికారులు ఎటువంటి మరమ్మతులు చేపట్టడం లేదు. సాధారణంగా జాతీయ రహదారిని పక్కా నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ నిర్మాణాలు చేపడతారు. అయితే చింతపల్లి- లంబసింగి జాతీయ రహదారిపై ఆరు నెలలకే పగుళ్లు, గుంతలు ఏర్పడడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. స్థానికులు ఈ సమస్యను ఎవరి చెప్పాలో తెలియని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. జాతీయ రహదారి ఇంజనీరింగ్ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండడం లేదు. ఎన్‌హెచ్ అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వలనే రహదారిలో నాణ్యతా లోపాలు బయటపడుతున్నాయని ఈ ప్రాంతవాసులు చెబుతున్నారు. ఇప్పటికైనా కలెక్టర్, జాతీయ రహదారి ఉన్నతాధికారులు ఈ సమస్యపై స్పందించి రహదారిపై ఏర్పడిన పగుళ్లు, గుంతలను పూడ్చడంతోపాటు జాతీయ రహదారి నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.