మెరుగ్గా తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవలు
ABN , Publish Date - Aug 13 , 2026 | 12:27 AM
జిల్లాలో తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాల సేవలు మరింత మెరుగ్గా అందుతాయని కలెక్టర్ టి.నిషాంతి అన్నారు.
కలెక్టర్ టి.నిషాంతి
జిల్లాకు రెండు విడతలుగా 23 వాహనాల కేటాయింపు
పాడేరు, ఆగస్టు 12(ఆంధ్రజ్యోతి): జిల్లాలో తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాల సేవలు మరింత మెరుగ్గా అందుతాయని కలెక్టర్ టి.నిషాంతి అన్నారు. జిల్లాకు తొలి విడతగా కేటాయించిన 13 తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలకు బుధవారం ఆమె ప్రారంభించి మాట్లాడారు. జిల్లాకు మొత్తం 23 వాహనాలు కేటాయించారని, తొలి విడతగా 13 వచ్చాయని, మిగిలిన 10 వాహనాలు త్వరలోనే అందుబాటులోకి వస్తాయన్నారు. జిల్లాలో రోజు సగటున 50 మంది తల్లీబిడ్డలను ఆయా వాహనాల్లో స్వస్థలాలకు చేర్చుతున్నారన్నారు. గతానికి భిన్నంగా ఇకపై మరింత ఆశాజనకంగా తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవలు అందుతాయన్నారు. ప్రధానంగా ఆస్పత్రుల్లో ప్రసవించిన తర్వాత బాలింత, శిశువులను స్వగ్రామాలకు క్షేమంగా తరలించేందుకు తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలు ఎంతగానో సేవలందిస్తున్నాయన్నారు. ముఖ్యంగా మారుమూల ప్రాంతాలున్న జిల్లా వాసులకు ఈ సేవలు ఎంతగానో ఉపయోగపడతాయని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, మాజీ ఎంపీపీలు బొర్రా విజయరాణి, ఎస్‌వీవీ.రమణమూర్తి, ఏడీఎంహెచ్‌వో బాలమురళీకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.