Share News

గిరిజనుల ప్రగతి పథకాల అమలు భేష్‌

ABN , Publish Date - Jul 04 , 2026 | 10:55 PM

గిరిజనుల జీవన శైలిలో మార్పు, ఆర్థిక ప్రగతికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రత్యేక కార్యక్రమాలు, పథకాలు సంతృప్తికరంగా ఉన్నాయని పశ్చిమ బెంగాల్‌ గిరిజన సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి చోటెన్‌ ధెందుప్‌ లామా అన్నారు.

గిరిజనుల ప్రగతి పథకాల అమలు భేష్‌
మ్యాక్‌ బోర్డు ఆఫ్‌ డైరెక్టర్లతో మాట్లాడుతున్న పశ్చిమ బెంగాల్‌ టీడబ్ల్యూ ముఖ్యకార్యదర్శి చోటెన్‌ ధెందుప్‌ లామా

పశ్చిమ బెంగాల్‌ టీడబ్ల్యూ ముఖ్యకార్యదర్శి చోటెన్‌ ధెందుప్‌ లామా

గిరిజన రైతులు వ్యవసాయం ద్వారా మంచి ఆదాయం పొందుతున్నారని కితాబు

పీఎం నరేంద్ర మోదీ ఆదేశాలతో అల్లూరి జిల్లాలో పర్యటన

చింతపల్లి, జూలై 4 (ఆంధ్రజ్యోతి): గిరిజనుల జీవన శైలిలో మార్పు, ఆర్థిక ప్రగతికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రత్యేక కార్యక్రమాలు, పథకాలు సంతృప్తికరంగా ఉన్నాయని పశ్చిమ బెంగాల్‌ గిరిజన సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి చోటెన్‌ ధెందుప్‌ లామా అన్నారు. పశ్చిమ బెంగాల్‌లో నూతనంగా అధికార పగ్గాలు చేపట్టిన బీజేపీ ప్రభుత్వం ప్రజల సంక్షేమం, అభివృద్ధిపై దృష్టిసారించింది. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తుందని, జాతీయ స్థాయిలో ఉత్తమ ఐటీడీఏగా పాడేరు ఎంపికైందని, ఆ రాష్ట్రాన్ని అధికారులు సందర్శించి రావాలని ప్రధాని నరేంద్ర మోదీ పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వానికి సూచించారు. ఈ మేరకు ఆ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి నేతృత్వంలో అధికార బృందం శనివారం చింతపల్లి మండలంలో పర్యటించింది. తొలుత ఐటీడీఏ సహకారంతో మ్యాక్స్‌ నిర్వహిస్తున్న ఎకో పల్పింగ్‌ యూనిట్‌ని సందర్శించారు. కాఫీ రైతులకు అంతర్జాతీయ ధరలు అందించేందుకు మ్యాక్స్‌ చేపడుతున్న కార్యక్రమాలను ముఖ్యకార్యదర్శికి ఐటీడీఏ ఏపీవో ఎం. వెంకటేశ్వర్లు, కాఫీ ఏడీ అయింతి వివరించారు. రాజుపాకలులో 500మంది గిరిజన రైతులు పండించిన వ్యవసాయ ఉత్పత్తులకు విలువలు జోడించి మార్కెటింగ్‌ చేస్తున్న లంబసింగి ఆర్గానిక్‌ రైతు ఉత్పత్తిదారుల సంఘాన్ని పరిశీలించారు. గిరిజన రైతులు ఎఫ్‌పీవోని ఏవిధంగా నిర్వహిస్తున్నారు? రైతులు పండించిన పంటల నుంచి ఎటువంటి విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేస్తున్నారు? మార్కెటింగ్‌ విధానాన్ని సీఈవో రాజేశ్‌ వివరించారు. అక్కడ నుంచి తాజంగి జలాశయానికి చేరుకున్న బృందం పర్యాటక అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. తాజంగి జలాశయంలో ఐటీడీఏ, కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన బోటింగ్‌, సాహస క్రీడలను పరిశీలించారు. వీటి ద్వారా గిరిజన యువతకు కలుగుతున్న ఉపాధి అవకాశాలు, పర్యాటకుల సందర్శనలను ముఖ్యకార్యదర్శి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్‌ గిరిజన సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి చోటెన్‌ ధెందుప్‌ లామా మాట్లాడుతూ గిరిజనులు ఆర్థికంగా బలపడేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, ప్రత్యేక కార్యక్రమాలు ఆదర్శనీయంగా ఉన్నాయన్నారు. గిరిజనులు కేవలం వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నప్పటికి మంచి ఆదాయం పొందుతున్నారన్నారు. గిరిజన ప్రాంతంలో పర్యాటక అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు, గిరిజనులు సమన్వయంతో ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారని సంతోషం వ్యక్తంచేశారు. ఈపర్యటనలో పశ్చిమ బెంగాల్‌ గృహ, పర్వత వ్యవహారాల శాఖ ప్రత్యేక కార్యదర్శి నితిన్‌ సింఘానియ, ఝార్‌గ్రామ్‌ జిల్లా కలెక్టర్‌ అకాంక్ష భాస్కర్‌, అదనపు సీఈవో ప్రియదర్శిని బట్టాచార్య, గిరిజన సంక్షేమ శాఖ ఉప కార్యదర్శి అమ్రిత్‌ బుర్మోన్‌ రాయ్‌, సబ్‌డివిజన్‌ మేజిస్ట్రేట్‌ అనిందిత రాయ్‌ చౌదరి, బినిపుర్‌ బ్లాక్‌ డెవలప్‌మెంట్‌ అధికార్లు బిద్యుట్‌ కుమార్‌ మజీ, మోనిమోయ్‌ పాల్‌, మ్యాక్స్‌ అధ్యక్షుడు జనకాని సింహాచలం పాల్గొన్నారు.

Updated Date - Jul 04 , 2026 | 10:55 PM