Share News

కొండంత సంబరం

ABN , Publish Date - Jul 28 , 2026 | 01:00 AM

శ్రీ వరహా లక్ష్మీనృసింహస్వామి కొలువైన సింహగిరి ప్రదక్షిణ మంగళవారం ప్రారంభం కానున్నది.

కొండంత సంబరం

నేడే సింహగిరి ప్రదక్షిణ

స్వామి వారి ప్రచార రథాన్ని ప్రారంభించనున్న ఆలయ అనువంశిక ధర్మకర్త, గోవా గవర్నర్‌ పి.అశోక్‌గజపతిరాజు

పక్కాగా ఏర్పాట్లు

విధుల్లో వేలాది మంది సిబ్బంది

తొలిపావంచా వద్ద 50 క్యూలైన్లు

కొబ్బరికాయ కొట్టేందుకు 120 స్టాండ్లు

భక్తులకు ఇబ్బంది లేకుండా ట్రాఫిక్‌ మళ్లింపు

లుంబిని పార్క్‌, జోడుగుళ్లపాలెం బీచ్‌లలో షవర్ల ఏర్పాటు

విశాఖపట్నం, జూలై 27 (ఆంధ్రజ్యోతి)

శ్రీ వరహా లక్ష్మీనృసింహస్వామి కొలువైన సింహగిరి ప్రదక్షిణ మంగళవారం ప్రారంభం కానున్నది. తొలిపావంచా వద్ద స్వామివారి పుష్పతేరు (ప్రచార రథం)ను దేవస్థానం అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్‌గజపతిరాజు లాంఛనంగా ప్రారంభిస్తారు. అనంతరం భక్తులు గోవింద నామస్మరణతో గిరి ప్రదక్షిణకు ఉపక్రమిస్తారు. ఏటా ఆషాఢ మాసంలో శుక్లపక్ష చతుర్దశినాడు భక్తులు సింహగిరి చుట్టూ ప్రదక్షిణ చేస్తుంటారు. తొలిపావంచా వద్ద బయలుదేరి అడివివరం, ముడసర్లోవ, హనుమంతువాక, విశాలాక్షి నగర్‌, ఎం.వి.పి.డబుల్‌ రోడ్డు, వెంకోజీపాలెం, సీతమ్మధార, మాధవధార, పాతగోశాల మీదుగా (మొత్తం 32 కిలోమీటర్లు) సింహాచలం చేరుకుంటారు.

గిరి ప్రదక్షిణకు ఈ ఏడాది జిల్లా యంత్రాంగం భారీ ఏర్పాట్లుచేసింది. ఏటా భక్తుల సంఖ్య పెరుగుతున్నందున అందుకు తగ్గట్టుగా చర్యలు చేపట్టింది. భారీ వాహనాలు, బస్సులు, ఆటోలు ప్రదక్షిణ మార్గాల్లోకి రాకుండా దారిమళ్లించింది. జాతీయ రహదారిపై కూడా భక్తులు ఎలా పడితే అలా నడవకుండా ఒక పక్కన నడక మార్గాలు ఏర్పాటుచేసింది. భక్తులకు మార్గమధ్యంలో అవసరమైన తాగునీరు, టీ, కాఫీలు, అల్పాహారం వంటివి పంపిణీ చేసేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకువచ్చాయి. వారికి రహదారి పక్కన తగిన స్థలాలు కేటాయించారు. దారి పొడవున ప్రతి 500 మీటర్లకు ఒకటి చొప్పున 596 తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటుచేశారు. వాటి నిర్వహణకు, నీటి సరఫరాకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. అలాగే తాగునీటికి 115 కేంద్రాలు పెట్టారు. భక్తుల కోసం 28 సహాయక కేంద్రాలు, ఏడు కంట్రోల్‌ రూమ్‌లు పెట్టారు. 22 అంబులెన్స్‌లు, 31 వైద్య సహాయక బృందాలను అందుబాటులో ఉంచారు.

తొలిపావంచా వద్దకు వెళ్లడానికి 50 క్యూలైన్లు, కొబ్బరికాయలు కొట్టడానికి 120 ఐరన్‌ స్టాండ్లు పెట్టారు. గిరి ప్రదక్షిణ పూర్తయ్యాక స్వామి వారిని దర్శించుకునే వారి కోసం ఆర్టీసీ 50 బస్సులను కొండపైకి నడుపుతుంది. పిల్లలు, వృద్ధులు ఎవరైనా తప్పిపోతే మైకుల్లో చెప్పడానికి 40 పబ్లిక్‌ అడ్రసింగ్‌ సిస్టమ్‌లు పెట్టారు. పిల్లలు, పెద్దలను ముందుగానే గుర్తించి వారి చేతికి రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిటీ ట్యాగ్‌లు వేస్తారు. వారు తప్పిపోయినట్టయితే ఎక్కడున్నారో ట్యాగ్‌ల ద్వారా గుర్తించగలుగుతారు.

గిరి ప్రదక్షిణ విధులకు దేవస్థానం, జీవీఎంసీ, రెవెన్యూ నుంచి 100 మంది అధికారులు, 500 మంది సిబ్బంది, 200 మంది సచివాలయ సిబ్బంది, 270 మంది సెక్యూరిటీ గార్డులు, 1,750 మంది వలంటీర్లు, రెండు వేల మంది పారిశుద్ధ్య సిబ్బందిని కేటాయించారు. వీరు కాకుండా పోలీస్‌ శాఖ నుంచి సుమారు ఐదు వేల మంది అందుబాటులో ఉంటారు.

కొండపైన...

బుధవారం తెల్లవారుజామున మూడు గంటల నుంచి కొండపై ఆలయ ప్రదక్షిణకు అనుమతిస్తారు. రాజగోపురం బయటే ఈ ప్రదక్షిణ పూర్తిచేసుకోవాలి. మంగళవారం సుమారు 50 వేల మంది, బుధవారం 80 వేల మంది భక్తులు స్వామిని దర్శనం చేసుకుంటారని అంచనా వేసి అందుకు తగిన ఏర్పాట్లు చేశారు.

తీరంలో షవర్‌ స్నానం

గిరి ప్రదక్షిణలో పాల్గొనే భక్తులు పలువురు సముద్ర స్నానాలు చేస్తుంటారు. అయితే సముద్ర వాతావరణం ప్రస్తుతం బాగా లేనందున లోపలకు దిగి స్నానాలు చేయకూడదని అధికారులు ప్రకటించారు. జోడుగుళ్లపాలెం, లుంబిని పార్కు వద్ద తీరంలోనే షవర్లతో స్నానం చేయడానికి జీవీఎంసీ వసతులు కల్పించింది. పొరపాటున ఎవరైనా సముద్రంలో దిగితే వారిని కాపాడడానికి 90 మంది గజ ఈతగాళ్లను పెట్టింది. వీరు మూడు షిఫ్టుల్లో పనిచేస్తారు.


సింహగిరి ప్రదక్షిణం.. భూ ప్రదక్షిణతో సమాన ఫలం

భక్తుల విశ్వాసం

కోర్కెలు నెరవేరుతాయని నమ్మకం

సింహాచలం, జూలై 27 (ఆంధ్రజ్యోతి):

భారతీయ సంస్కృతికి మూలం వేదాలు. ప్రకృతిని పరమాత్మ స్వరూపంగా వేదం చెబుతుంది. అందుకే అనాదిగా భారతీయులు చెట్లను, పుట్టలను, నదులను, సముద్రాలను, పర్వతాలను పూజిస్తుంటారు. పర్వతాలకు భూధరాలని పేరు. అంటే భూమి ధరించేవని అర్థం. వేదాల ప్రకారం విష్ణుః పర్వతానాం అధిపతిః. అందుకే పర్వతాలు పూజించబడుతున్నాయి.

భూమి సమతుల్యతను కాపాడేవి పర్వతాలు. సాధారణంగా స్వయంభువుడుగా భగవానుడు వెలసిన క్షేత్రాలన్నీ అధికశాతం పర్వతాలపైనే ఉంటాయి. అదే పర్వతాలపై పురాణాల కాలంలో మునులు, యోగులు తపస్సులు చేసి జ్ఞానసముపార్జన చేశారు. అటువంటి అనేక దైవీ భావనలు ఉండడం చేతనే పర్వతాలను పూజించడం, వాటి చుట్టూ ప్రదక్షిణలు చేయడం వేదకాలం నుంచే జరుగుతున్నట్టు విజ్ఞులు చెబుతారు.

వరాహ లక్ష్మీనృసింహస్వామి ద్వయావతారుడుగా వెలసిన దివ్యధామం సింహగిరి. అందుకే సింహగిరి చుట్టూ ప్రదక్షిణ చేయడం భూ ప్రదక్షిణతో సమాన ఫలితాన్ని ఇస్తుందని చెబుతారు. సింహగిరి చుట్టూ ప్రదక్షిణలు చేసిన వారికి విద్యాభివృద్ధి, ఉద్యోగప్రాప్తి, వివాహ అనుకూలత వంటివి ఈడేరుతాయని పెద్దలు చెబుతుంటారు. కోర్కెలు లేకుండా సింహగిరి ప్రదక్షిణ చేసినవారు ఇహపర సౌఖ్యాలు పొందుతారని పండితుల మాట. భౌతికంగా సింహగిరి చుట్టుకొలత 32 కిలోమీటర్లు. సింహాచల క్షేత్ర మహాత్మ్యం ప్రకారం హిరణ్యకశ్యపుని సంహరించే సమయంలో విష్ణువు 32 రూపాలు ధరించాడని, అదేవిధంగా నృసింహస్వామి మూలమంత్రంలో 32 బీజాక్షరాలు ఉన్నాయని అందుకే 32 కిలోమీటర్ల వ్యాసార్థం కలిగిన సింహగిరి చుట్టూ ప్రదక్షిణ చేస్తే భూ ప్రదక్షిణ చేసినంత ఫలాన్ని ఇస్తుందని అంటారు.

గురుపౌర్ణమిగా నాడే సింహగిరి ప్రదక్షిణ ఎందుకు చేయాలంటే...వేదవ్యాసుడు వేదాలను విభజించి మానవాళికి గురువుగా పూజించబడుతున్నాడు. భగవానుడి తత్వాన్ని విశ్వానికి తెలిపిన వ్యాసుడు జయంతికి ప్రత్యేకత ఉంది. గురువు అంటే పెద్దది, విశ్వం అని అర్థాలు ఉన్నాయి. ఏటా వైశాఖమాస శుక్లపక్ష తదియ, పౌర్ణమి, జేష్ట, ఆషాఢ పౌర్ణమిలలో నాలుగు విడతలుగా చందనాన్ని పైపూతగా సమర్పించడంతో సింహాద్రినాథుడు గురు(పెద్ద)రూపం సంతరించుకుంటాడు. అందుకే వ్యాసపూర్ణిమనాడు గిరి ప్రదక్షిణ చేస్తారని సింహాద్రి అప్పన్న ఆలయ స్థానాచార్యులు తెలిపారు.

భక్తులకు సూచనలు

చక్కెర వ్యాధిగ్రస్తులు కాళ్లకు చెప్పులు లేకుండా నడవరాదు.

గుండె జబ్బు ఉన్నవారు గిరి ప్రదక్షిణ చేయరాదు.

బీపీ ఉన్నవారు నిర్దేశిత మందులు వేసుకొని నడవాలి. అత్యవసర పరిస్థితుల్లో దగ్గరలో ఉన్న వైద్య శిబిరంలో బీపీ తనిఖీ చేయించుకోవాలి.

నీరసంగా ఉన్నప్పుడు ఓఆర్‌ఎస్‌ తీసుకోవాలి. తగినంత విశ్రాంతి తీసుకోవాలి.

గంటకు ఒకసారి తగినంత మోతాదులో మంచినీరు తీసుకోవాలి.

అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్‌ సేవలను వినియోగించుకోవాలి.

శరీరానికి బాగా గాలి తగిలేలా వదులుగా ఉన్న దుస్తులను ధరించాలి.

ఆయాసం వస్తే వెంటనే ఆగి, తగినంత విశ్రాంతి తీసుకోవాలి. అవసరమైతే వెంటనే వైద్య సాయం పొందాలి.

జాతీయ రహదారిపై నడిచే సమయంలో అప్రమత్తంగా ఉండాలి. వాహనాల రాకపోకలను గమనించాలి.


3,200 మందితో బందోబస్తు

హనుమంతవాక జంక్షన్‌ నుంచి ఇసుకతోట జంక్షన్‌ వరకూ నో వెహికల్‌ జోన్‌ ప్రకటన

అత్యవసరమైతేనే వాహనాలకు అనుమతి

నగర పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రతబాగ్చి

విశాఖపట్నం, జూలై 27 (ఆంధ్రజ్యోతి):

సింహగిరి ప్రదక్షిణ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం ఉదయం వరకు హనుమంతవాక జంక్షన్‌ నుంచి ఇసుకతోట వైపు అత్యవసరమైన వాహనాలను మాత్రమే అనుమతిస్తామని నగర పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రత బాగ్చి తెలిపారు. గిరి ప్రదక్షిణ ఏర్పాట్లు, సన్నద్ధతకు సంబంధించిన వివరాలను ఆయన సోమవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. గిరిప్రదక్షిణకు ఐదు లక్షల మందికిపైగా భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నామన్నారు. గత ఏడాది అనుభవాలను పరిగణనలోకి తీసుకుని ఈ ఏడాది ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈసారి తొలిపావంచా పరిసరాల్లోకి ఆర్టీసీ బస్సులు రాకుండా చర్యలు తీసుకున్నామన్నారు. గిరి ప్రదక్షిణ జరిగే మార్గంలో భక్తుల భద్రతకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నామన్నారు. హనుమంతవాక జంక్షన్‌ నుంచి ఇసుకతోట జంక్షన్‌ వరకు భక్తులు రోడ్డు దాటాల్సి ఉంటుందని, అదే సమయంలో వాహనాల రాకపోకలు సాగడంతో ట్రాఫిక్‌ ఇబ్బందులతోపాటు తొక్కిసలాట జరిగే పరిస్థితులు ఏర్పడుతున్నాయన్నారు. కొందరు భక్తులు వాహనాలు వెళ్లేంత వరకూ ఆగకుండా మధ్యలో నుంచే రోడ్డు దాటుతుండడంతో ప్రమాదాలకు ఆస్కారం ఏర్పడుతుందన్నారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని హనుమంతవాక జంక్షన్‌ నుంచి ఇసుకతోట జంక్షన్‌ వరకు నో వెహికల్‌ జోన్‌గా ప్రకటించామన్నారు. ఆ మార్గంలో అంబులెన్స్‌లు, ఆస్పత్రి అవసరాలకు వెళ్లేవారు, ఇతర అత్యవసర పనులపై వెళ్లేవారు వాటికి సంబంధించిన ఆధారాలను పోలీసులకు చూపిస్తే వారి వాహనాలను మాత్రమే అనుమతిస్తామన్నారు.

గిరి ప్రదక్షిణకు 2,500 మంది సివిల్‌ పోలీసులు, 700 మంది ఏఆర్‌ సిబ్బందితోపాటు 500 నుంచి 700 మంది వరకు వివిధ స్వచ్ఛంద సంస్థల వలంటీర్లను బందోబస్తు, సహాయ కార్యక్రమాలకు వినియోగిస్తున్నామన్నారు. సింహాచలం కొండపై నో ఫ్లయింగ్‌ జోన్‌ మినహా మిగిలిన ప్రాంతమంతటినీ డ్రోన్‌లతో పర్యవేక్షిస్తామన్నారు. భక్తులకు అవసరమైన సేవలు అందించేందుకు వీలుగా తొలిపావంచా, బీచ్‌రోడ్డులో స్నానాలు చేసే ప్రాంతం సహా ఏడుచోట్ల కమాండ్‌ కంట్రోల్‌రూమ్‌లు ఏర్పాటుచేస్తున్నామన్నారు. వీటితోపాటు పోలీస్‌ కమిషనరేట్‌లోని కమాండ్‌ కంట్రోల్‌రూమ్‌ నుంచి పరిస్థితిని తమ సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తారన్నారు. పోలీస్‌ శాఖపరంగా ఎవరికైనా సహాయం కావాలన్నా, ఏదైనా సమాచారం లేదా సూచనలు ఇవ్వాలనుకుంటే సమీపంలోని కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌కు వెళ్లి చెప్పడం లేదంటే నేరుగా 799509579 నంబర్‌కు ఫోన్‌ చేయడం ద్వారా తన దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ సమావేశంలో క్రైమ్‌ డీసీపీ లతామాధురి, ఏడీసీపీ రమ్య పాల్గొన్నారు.

Updated Date - Jul 28 , 2026 | 01:00 AM