మసాజ్ ముసుగులో చీకటి బాగోతం
ABN , Publish Date - May 11 , 2026 | 01:06 AM
కాస్మోపాలిటన్ సిటీగా రూపాంతరం చెందుతున్న విశాఖలో మసాజ్ సెంటర్లు (స్పా), వెల్‌నెస్ సెంటర్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి.
నగరంలోని పలు సెంటర్‌లలో అసాంఘిక కార్యకలాపాలు
నిబంధనలకు విరుద్ధంగా క్రాస్ మసాజ్
కొన్నిచోట్ల వ్యభిచారం
నగరంలో 300కిపైగా సెంటర్లు
అనేకచోట్ల నిబంధనల ఉల్లంఘన
ఇటీవల పోలీసుల దాడుల్లో బయటపడిన బండారం
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
కాస్మోపాలిటన్ సిటీగా రూపాంతరం చెందుతున్న విశాఖలో మసాజ్ సెంటర్లు (స్పా), వెల్‌నెస్ సెంటర్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. అందులో కొన్ని చీకటి కార్యకలాపాలకు కేంద్రంగా మారాయి. ఇటీవల వీఐపీ రోడ్డులోని ఆర్కిడ్ వెల్‌నెస్ సెంటర్‌పై టాస్క్‌ఫోర్స్, త్రీటౌన్ పోలీసులు దాడి చేసి వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు తేలడంతో ఇద్దరు మేనేజర్లను అరెస్టు చేశారు. ద్వారకా నగర్‌లోని బెల్ల థాయ్ స్పా, ఫుట్ రిలీఫ్ సెంటర్‌లో వ్యభిచారం జరుగుతున్నట్టు శనివారం పోలీసులు జరిపిన దాడుల్లో బయటపడింది.
నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో 300కిపైగా మసాజ్ సెంటర్‌లు ఉన్నాయి. శారీరకంగా అలసటకు గురైనవారు, నరాలు, కండరాల సమస్యలతో బాధపడేవారు, సౌందర్యం పెంచుకోవాలనుకునే వారికి అవసరమైన సేవలందించేందుకు బ్యూటీపార్లర్‌లు, స్పా, మసాజ్ సెంటర్‌లు, రిలాక్స్ సెంటర్లు, వెల్‌నెస్ సెంటర్స్, హెల్త్‌క్లబ్‌లు ఏర్పాటుచేసుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇస్తోంది. ‘బ్యూటీషియన్ అండ్ కాస్మెటిక్’ యాక్ట్ ప్రకారం ఇలాంటి వాటిలో క్రాస్ జెండర్ (మగవారికి ఆడవాళ్లు, ఆడవారికి మగవారు) మసాజ్ చేయడం, వ్యభిచారం వంటి వాటిని అనుమతించరు. మసాజ్ సెంటర్/స్పాలో పురుషులకు, మహిళలకు వేర్వేరు సెక్షన్లు ఏర్పాటుచేయాలని చట్టంలో పేర్కొన్నారు. కస్టమర్లుగా వచ్చే పురుషులు, మహిళలకు వేర్వేరుగా టాయ్‌లెట్లు, బాత్‌రూమ్‌లు ఉండాలి. స్పా/మసాజ్ సెంటర్లలో ఒక గది నుంచి మరొక గదిలోకి వెళ్లడానికి వీల్లేకుండా రహస్య మార్గాలు ఉండకూడదు. పది మంది కంటే ఎక్కువమంది ఉద్యోగులు ఉన్నట్టయితే వారందరికీ గుర్తింపుకార్డులు ఇవ్వడం, మహిళా సిబ్బంది భద్రత కోసం ప్రత్యేక పర్యవేక్షణ విభాగం వంటివి అందుబాటులో ఉంచాలి. మసాజ్ సెంటర్/స్పాలో ఫిజియో థెరపిస్ట్ లేదా ఆక్యుప్రెజర్ లేదా అక్యుపేషనల్ థెరపీలో డిగ్రీ, డిప్లొమో లేదంటే సర్టిఫికెట్ కోర్సు చేసిన వాళ్లను మాత్రమే నియమించుకోవాలి. ఉదయం తొమ్మిది రాత్రి తొమ్మిది గంటల వరకూ మాత్రమే తెరిచి ఉంచాలి. అలాగే సెంటర్‌కు వచ్చే వినియోగదారులకు అందించే సేవలను వీడియో రికార్డు చేసేలా అన్నిచోట్ల సీసీ కెమెరాలను ఏర్పాటుచేయడంతోపాటు కనీసం మూడు నెలలు ఫుటేజీ స్టోరేజీ ఉండేలా హార్డ్ డిస్క్‌ను ఏర్పాటుచేసుకోవాలి. కానీ నగరంలోని మసాజ్‌సెంటర్/స్పాలను పరిశీలిస్తే కొన్నింటిని మినహాయిస్తే అత్యధిక సెంటర్లు ఈ నిబంధనలు పాటించవు.
మసాజ్ ముసుగులో వ్యభిచారం
నగరంలోని అత్యధిక సెంటర్‌లలో క్రాస్ జెండర్ మసాజ్‌లు, వ్యభిచారం వంటివి విచ్చలవిడిగా జరిగిపోతున్నాయి. థాయ్‌లాండ్, కేరళ, గోవా వంటి ప్రాంతాల నుంచి యువతులను నగరానికి రప్పించి వారితో వ్యభిచారం చేయిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై సీపీ శంఖబ్రతబాగ్చికి సమాచారం అందడంతో కొంతకాలం కిందటి వరకు వారంలో ఏదో ఒకరోజు ఆకస్మిక తనిఖీలు నిర్వహించేవారు. ఒక స్టేషన్ పరిధిలో వేరొక స్టేషన్ అధికారులకు తనిఖీ బాధ్యతలు అప్పగించేవారు. కంచరపాలెం స్టేషన్ పరిధిలో ఒక స్పా సెంటర్‌లో టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేసేందుకు వెళితే అక్కడ ఒక ఎస్‌ఐ పట్టుబడడం అప్పట్లో పెద్దఎత్తున చర్చకు దారితీసింది. ఈ ఉదంతం స్పా సెంటర్ల నిర్వాహకులతో పోలీసులకు సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలకు బలాన్ని చేకూర్చినట్టయింది. ఇటీవల కాలంలో స్పా సెంటర్లపై దాడులు తగ్గడంతో నిర్వాహకులు మళ్లీ చీకటి కార్యకలాపాలను ముమ్మరం చేశారు. స్పాసెంటర్లలో జరిగే అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసే దిశగా పోలీస్ కమిషనర్ చర్యలు తీసుకోవాలని నగరవాసులు కోరుతున్నారు.