పుట్టగొడుగుల్లా అక్రమ లేఅవుట్లు
ABN , Publish Date - Oct 07 , 2026 | 12:59 AM
ఉత్తరాంధ్రకు పెట్టుబడులు వెల్లువలా వస్తుండడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా ఆ విధంగానే విస్తరిస్తోంది. ముఖ్యంగా భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కావడంతో ఒక్కసారిగా విజయనగరం-విశాఖపట్నం జిల్లాల శివారుల్లో లేఅవుట్లు పుట్టగొడుగుల్లా వస్తున్నాయి. విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) నుంచి అనుమతులు తీసుకోకుండానే లేఅవుట్లు వేసి తక్కువ ధర పేరుతో అమ్మేస్తున్నారు. మార్కెటింగ్ సిబ్బందిని రైతుబజార్ల వద్ద ఉదయం ఆరు గంటల నుంచే మోహరించి కొనుగోలుదారులను బుట్టలో వేసుకుంటున్నారు.
పట్టించుకోని అధికారులు
మోసపోతున్న కొనుగోలుదారులు
ఏడాదిగా తనిఖీలే లేవు
అన్నీ పాత లెక్కలే
గత ఏడాది ఆగస్టు నాటికి జిల్లాలో 332 అనధికార లేఅవుట్లు
అన్నీ భీమిలి, ఆనందపురం, పెందుర్తి, పద్మనాభం మండలాల్లోనే...
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
ఉత్తరాంధ్రకు పెట్టుబడులు వెల్లువలా వస్తుండడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా ఆ విధంగానే విస్తరిస్తోంది. ముఖ్యంగా భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కావడంతో ఒక్కసారిగా విజయనగరం-విశాఖపట్నం జిల్లాల శివారుల్లో లేఅవుట్లు పుట్టగొడుగుల్లా వస్తున్నాయి. విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) నుంచి అనుమతులు తీసుకోకుండానే లేఅవుట్లు వేసి తక్కువ ధర పేరుతో అమ్మేస్తున్నారు. మార్కెటింగ్ సిబ్బందిని రైతుబజార్ల వద్ద ఉదయం ఆరు గంటల నుంచే మోహరించి కొనుగోలుదారులను బుట్టలో వేసుకుంటున్నారు. వంద గజాల స్థలం రూ.3 లక్షల రూపాయలే అని, జాతీయ రహదారికి దగ్గరగా ఉందని, భోగాపురం విమానాశ్రయానికి పది నిమిషాల్లో చేరుకోవచ్చునని రకరకాల ప్రచారం చేస్తూ నమ్మించి మోసం చేస్తున్నారు.
జీవీఎంసీ పరిధిలో లేని మండలాల్లో లేఅవుట్లకు వీఎంఆర్‌డీఏ అనుమతి ఇస్తుంది. అధికారికంగా లేఅవుట్ వేస్తే తొమ్మిది మీటర్ల వెడల్పున రహదారులు, వాటికి కాలువలు, సామాజిక ప్రయోజనాలకు పార్కులు, ఆస్పత్రి, పాఠశాల వంటి వాటికి స్థలాలు కేటాయించాలి. అలాగే విద్యుత్ సౌకర్యం కల్పించాలి. వీటన్నింటినీ లేఅవుట్ పర్మిషన్ (ఎల్‌పీ) నంబరు తీసుకున్న మూడేళ్లలో పూర్తిచేయాలి. ఇవన్నీ కోట్ల రూపాయల ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడంతో రాజకీయ నాయకులు, స్థానిక పెద్దలు, రియల్ ఎస్టేట్ సంస్థలు కలిసి అనుమతులు లేకుండానే వ్యవసాయ భూమిని ప్లాట్లుగా విభజించి తక్కువ రేటు పేరుతో అమ్మేస్తున్నారు. వాటి రిజిస్ట్రేషన్లు జరిగిపోతున్నాయి. వాటిలో గృహ నిర్మాణం జరిగినప్పుడే అసలు విషయం బయట పడుతోంది. ఆ లేఅవుట్‌కు అనుమతి లేదని, క్రమబద్ధీకరించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇలాంటి వాటికి ప్రభుత్వం ఏటా భూ క్రమబద్ధీకరణ పథకం (ఎల్‌ఆర్‌ఎస్) పెడుతోంది. దరఖాస్తులు ఆహ్వానించి, పత్రాలు పరిశీలించి, తగిన డెవలప్‌మెంట్ ఫీజులు కట్టించుకుని రెగ్యులరైజ్ చేస్తోంది. దీనికి కూడా పెద్దగా స్పందన ఉండడం లేదు. అనధికారి లేఅవుట్లను ఎల్‌ఆర్‌ఎస్‌లో పెట్టడం లేదు. వీటికి కూడా ఒక్కో ప్లాటుకు రెండు లక్ష రూపాయలకు పైగా ఫీజు కట్టాల్సి ఉండడంతో ఎవరూ ముందుకు రావడం లేదు.
పట్టించుకోని అధికారులు
అనధికార లేఅవుట్లు ఎక్కడైనా ఉన్నాయని తెలిస్తే వారితో క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేయించాల్సిన బాధ్యత వీఎంఆర్‌డీఏపై ఉంది. ఇందుకోసం తరచూ క్షేత్రస్థాయి పర్యటనలు చేయాలి. నోటీసులు ఇచ్చినా స్పందించకపోతే అక్కడి నిర్మాణాలను కూలగొట్టాలి. ఈ పనులేవీ గత కొంతకాలంగా చేయడం లేదు. అనధికార లేఅవుట్లు...గత ఏడాది ఆగస్టు వరకే విశాఖ జిల్లా భీమిలి, ఆనందపురం, పెందుర్తి, పద్మనాభం మండలాల్లో 332 ఉన్నట్టు చెబుతున్నారు. విజయనగరం జిల్లాలో 231 ఉన్నాయని టౌన్ ప్లానింగ్ విభాగం తెలిపింది. ఈ ఏడాది కాలంలో కొత్తగా మరో వేయి లేఅవుట్లు పుట్టుకొచ్చాయి. వాటి వివరాలు ఇంకా పుస్తకాల్లోకి తేలేదు.
డెవలపర్లను గుర్తించడం లేదు
కొన్ని లేఅవుట్లను పదేళ్ల క్రితం వేసి అమ్మేసుకున్నారు. వారి వివరాలు కూడా ఇప్పటివరకు తెలుసుకోలేకపోయారు. వారి పేర్లు తెలియదని రికార్డుల్లో నమోదుచేసి మౌనంగా ఉన్నారు. కొన్ని ప్రముఖ సంస్థలు కూడా అనధికారిక లేఅవుట్లు వేశాయి. వాటిపైనా ఎటువంటి చర్యలు లేవు. ప్లాట్లు కొన్నవారు ఇంటి నిర్మాణానికి వచ్చినప్పుడు చూసుకోవచ్చునని వీఎంఆర్‌డీఏ అధికారులు ధీమా ప్రదర్శిస్తున్నారు. అంతే తప్ప కొనుగోలుదారుల్లో అవగాహన కల్పించాలని, అనధికారిక లేఅవుట్లలో ప్లాట్లు కొంటే ఇబ్బందులు ఉంటాయని చెప్పే ప్రయత్నం కనిపించడం లేదు. ఈ విషయంలో అధికారులు చాలా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు.