Share News

గుర్రంపాలెంలో గ్రావెల్‌ అక్రమ తవ్వకాలు

ABN , Publish Date - May 17 , 2026 | 12:40 AM

పెందుర్తి మండలం గుర్రంపాలెంలో గల ఏపీఐఐసీ లేఅవుట్‌ను ఆనుకుని రెవెన్యూ భూముల్లో అక్రమంగా గ్రావెల్‌, మెటల్‌ తవ్వకాలు జరిగినట్టు అధికారుల తనిఖీల్లో నిర్ధారణ అయ్యింది.

గుర్రంపాలెంలో గ్రావెల్‌ అక్రమ తవ్వకాలు

గనుల శాఖ అధికారుల తనిఖీల్లో నిర్ధారణ

అవి రెవెన్యూ భూములుగా గుర్తింపు

నిఘా పెట్టాలని ఆదేశం

పారిశ్రామిక లేఅవుట్‌లో అనుమతులు లేకుండా జరిపిన తవ్వకాలకు సంబంధించి ఏడు సంస్థలకు నోటీసులు

విశాఖపట్నం, మే 16 (ఆంధ్రజ్యోతి):

పెందుర్తి మండలం గుర్రంపాలెంలో గల ఏపీఐఐసీ లేఅవుట్‌ను ఆనుకుని రెవెన్యూ భూముల్లో అక్రమంగా గ్రావెల్‌, మెటల్‌ తవ్వకాలు జరిగినట్టు అధికారుల తనిఖీల్లో నిర్ధారణ అయ్యింది. పారిశ్రామిక లేఅవుట్‌లో స్థలాలు పొందిన సంస్థలకు అవసరమైన గ్రావెల్‌, మెటల్‌ సరఫరా చేసేందుకు స్థానికంగా ఉన్న కొందరు ముఠాగా ఏర్పడి రెవెన్యూ భూములు అనుమతులు లేకుండా తవ్వకాలు జరిపారు. అదేమిని ప్రశ్నించిన సిబ్బందిని బెదిరించారు. అదే ప్రాంతంలో గల కొండను కూడా తవ్వేశారు. ఈ వ్యవహారంపై ‘ఆంధ్రజ్యోతి’లో పలు కథనాలు ప్రచురితమయ్యాయి. ఈ నేపథ్యంలో గనుల శాఖ అధికారులు, ఆ శాఖ విజయనగరం ప్రాంతీయ విజిలెన్స్‌ అధికారులు వారం కిందట రెవెన్యూ, ఏపీఐఐసీ అధికారులతో కలిసి ఏపీఐఐసీ లేఅవుట్‌, దానికి ఆనుకుని రెవెన్యూ పరిధిలోని కొండను పరిశీలించారు. ప్రస్తుతం తవ్వకాలు జరిపిన కొండ ఏపీఐఐసీకి చెందినది కాదని సంబంధిత అధికారి ఒకరు స్పష్టంచేశారు. గతంలో తమ లేఅవుట్‌లో ఉన్న కొండ నుంచి మట్టిని తవ్వి ప్లాట్లు చదును చేశారని, ప్రసుత్తం మాత్రం రెవెన్యూశాఖకు చెందిన కొండపై తవ్వకాలు జరుపుతున్నారని చెప్పారు. గుర్రంపాలెంలో గ్రావెల్‌, మట్టి, మెటల్‌ తవ్వకాలకు ఎవరూ ఎటువంటి అనుమతులు తీసుకోలేదని గనుల శాఖ డీడీ నరసింహరెడ్డి ఈ సందర్భంగా స్పష్టంచేశారు. తవ్వకాలు జరిగే ప్రాంతంపై నిఘా పెట్టాలని పోలీస్‌, రెవెన్యూ యంత్రాంగాన్ని కోరినట్టు ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధికి తెలిపారు. ఇప్పటివరకూ ఎంత తవ్వారనేది త్వరలో కొలతలు వేసి నిర్ధారిస్తామని పేర్కొన్నారు.

ఏడు సంస్థలకు నోటీసులు

ఇదిలావుండగా గుర్రంపాలెం ఏపీఐఐసీ పారిశ్రామిక లేఅవుట్‌లో గతంలో అనుమతులు లేకుండా గ్రావెల్‌, మట్టి తవ్వకాలు జరిపిన ఏడు కంపెనీలకు గనుల శాఖ విజయనగరం ప్రాంతీయ విజిలెన్స్‌ అధికారులు నోటీసులు జారీచేశారు. ఇందులో ఎన్‌ఎస్‌ఆర్‌ ఇండస్ట్రీస్‌, ఏఎస్‌ స్టీల్‌ ట్రేడర్స్‌, ఎస్సార్‌ గ్రీన్‌ రీసోర్స్‌, మిక్స్‌న్‌ పెట్రో కెమికల్స్‌, శ్రీమాతా ట్రేడింగ్‌ కంపెనీ, భవానీ స్టీల్‌ ప్రొఫైల్స్‌తోపాటు మరో రెండు కంపెనీలు ఉన్నాయి. నోటీసులకు కొన్ని కంపెనీలు సమాధానం ఇచ్చాయని గనుల శాఖ డీడీ తెలిపారు. ఏపీఐఐసీ కేటాయించిన ప్లాటులో మట్టినే వినియోగించినట్టు తెలియజేశారన్నారు. అయితే సుమారు ఏడాదిన్నర క్రితమే విజయనగరం గనుల శాఖ ప్రాంతీయ విజిలెన్స్‌ అధికారులు లేఅవుట్‌లో ఏఏ ప్లాట్లలో ఎంత గ్రావెల్‌ ఫిల్లింగ్‌ అయిందీ కొలతలు వేశారని, ఆ ప్రకారమే నోటీసులు ఇవ్వడం జరిగిందన్నారు. త్వరలో జరిమానాకు డిమాండ్‌ నోటీసులు జారీచేస్తామని వెల్లడించారు.

Updated Date - May 17 , 2026 | 12:40 AM