అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు
ABN , Publish Date - Apr 17 , 2026 | 01:08 AM
పెందుర్తి మండలం గుర్రంపాలెంలో గల ఏపీఐఐసీ ఇండస్ట్రియల్ లేఅవుట్‌కు ఆనుకుని ఉన్న కొండవాలులో కొంతమంది ఎటువంటి అనుమతులు తీసుకోకుండా గ్రావెల్ తవ్వుకుపోతున్నారు.
గుర్రంపాలెంలో మళ్లీ మొదలు
సుమారు 15 ఎకరాల్లో పక్షం రోజులుగా తవ్వకాలు
వందల లారీల గ్రావెల్ తరలింపు
రిజర్వాయర్ క్యాచ్‌మెంట్‌కు ముప్పు
విశాఖపట్నం, ఏప్రిల్ 16 (ఆంధ్రజ్యోతి):
పెందుర్తి మండలం గుర్రంపాలెంలో గల ఏపీఐఐసీ ఇండస్ట్రియల్ లేఅవుట్‌కు ఆనుకుని ఉన్న కొండవాలులో కొంతమంది ఎటువంటి అనుమతులు తీసుకోకుండా గ్రావెల్ తవ్వుకుపోతున్నారు. పక్షం రోజులుగా 10 నుంచి 15 ఎకరాల్లో తవ్వకాలు చేపట్టి, వందల లారీలు గ్రావెల్ తరలించారు. గ్రావెల్ మాఫియాకు కూటమి నేతల ఆశీస్సులు ఉండడంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.
గుర్రంపాలెంలోని సర్వే నంబరు 120లో ఎక్కువ భూమి ఏపీఐఐసీకి కేటాయించగా, ఇంకా కొండ, దానికి ఆనుకుని బంజరు ఉంది. కొండవాలులో రైతులు ఒక్కొక్కరు ఎకరా నుంచి రెండు, మూడు ఎకరాల్లో మొక్కలు వేశారు. కొన్నిచోట్ల మొక్కలు ఉండగా, ఎక్కువ భాగం ఖాళీగా ఉంది. అందులో కొందరు గ్రావెల్ తవ్వుతున్నారు. అర్ధరాత్రి తరువాత తవ్వకాలు ప్రారంభించి ఉదయం వరకు కొనసాగిస్తున్నారు. ఉదయం ఆరు గంటల తరువాత అక్కడ మిషన్లు కూడా కనిపించవు. ఆ గ్రావెల్‌ను సమీపంలోని ఏపీఐఐసీ లేఅవుట్‌లో పారిశ్రామికవేత్తలు కొనుగోలు చేసిన ప్లాట్లు లెవెల్ చేయడానికి తరలిస్తున్నారు. గనుల శాఖ నుంచి ఎటువంటి అనుమతులు తీసుకోకుండా వందల లారీల గ్రావెల్ తరలించుకుపోతున్నారు. గుర్రంపాలేనికి చెందిన కీలక వ్యక్తి ఒకరు, మరొకరు కలిసి ఈ దందాకు పాల్పడుతున్నారని గ్రామస్థులు చెబుతున్నారు.
ఇదిలావుండగా గుర్రంపాలెం పెదచెరువు రిజర్వాయర్ క్యాచ్‌మెంట్ ఏరియాలో అక్రమ గ్రావెల్ తవ్వకాలు చేస్తుండడంతో ఆయకట్టు రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. సుమారు 314.39 ఎకరాలకు రిజర్వాయర్ నుంచి నీటి సరఫరా అవుతుంది. ఎన్టీపీసీ నుంచి అప్పటి పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి రూ.2.25 కోట్లు తీసుకువచ్చి రిజర్వాయర్‌ను అభివృద్ధి చేశారు. 45.02 మిలియన్ ఘనపుటడుగుల నీటి సామర్థ్యం ఉన్న రిజర్వాయర్ కింద ఏడు గొలుసుకట్టు చెరువులు ఉన్నాయి. సుమారు పదివేల జనాభా ఈ రిజర్వాయర్‌పై ఆధారపడి ఉన్నారు. క్యాచ్‌మెంట్ ఏరియాలో కొండలను తవ్వేయడం వల్ల రిజర్వాయర్‌కు నీటి ప్రవాహం నిలిచిపోతుందని రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. తక్షణమే అక్రమ తవ్వకాల నిలిపివేతకు చర్యలు తీసుకోవాలని రైతులు విజ్ఞప్తి చేశారు.