రుషికొండలో అక్రమ నిర్మాణాలు
ABN , Publish Date - Mar 27 , 2026 | 01:08 AM
భీమిలి బీచ్‌రోడ్డులో గీతం విశ్వవిద్యాలయం సమీపాన రుషికొండ బీచ్‌కు వెళ్లేదారిలో అక్రమ నిర్మాణాలు పెరిగిపోతున్నాయి.
సీఆర్‌జెడ్ నిబంధనలకు విరుద్ధంగా...
గతంలో తొలగించిన చోటే మళ్లీ పనులు
రెసిడెన్షియల్‌కు అనుమతి
తీసుకుని కమర్షియల్‌కు వినియోగం
కొన్నింటికైతే అసలు ప్లాన్ కూడా తీసుకోని వైనం
చోద్యం చూస్తున్న టౌన్‌ప్లానింగ్ అధికారులు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
భీమిలి బీచ్‌రోడ్డులో గీతం విశ్వవిద్యాలయం సమీపాన రుషికొండ బీచ్‌కు వెళ్లేదారిలో అక్రమ నిర్మాణాలు పెరిగిపోతున్నాయి. సీఆర్‌జెడ్ నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన నిర్మాణాలను కోర్టు ఆదేశాల మేరకు కొన్నాళ్ల కిందట జీవీఎంసీ అధికారులు తొలగించారు. ఇప్పుడు అదేచోట తిరిగి యథావిధిగా నిర్మిస్తున్నా టౌన్‌ప్లానింగ్ అధికారులు చోద్యం చూస్తున్నారు.
గీతం విశ్వవిద్యాలయం నుంచి రుషికొండ బీచ్‌కు వెళ్లే మార్గంలో సీఆర్‌జెడ్ నిబంధనలకు విరుద్ధంగా పక్కా నిర్మాణాలు చేపట్టి దుకాణాలు ఏర్పాటుచేశారంటూ గతంలో కొందరు జీవీఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌ను విచారించిన హైకోర్టు సీఆర్‌జెడ్ నిబంధనలకు విరుద్ధంగా రుషికొండ వద్ద ఏర్పాటుచేసిన దుకాణాలను తొలగించాలని జీవీఎంసీ అధికారులను ఆదేశించింది. దీంతో కొన్నాళ్ల కిందట ఆ దుకాణాలను తొలగించారు. అయితే ఇప్పుడు అదేచోట తిరిగి పక్కా నిర్మాణాలు చేపట్టి హోటళ్లు, ఇతర దుకాణాలు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. దీనిపై జీవీఎంసీ అధికారులకు కొందరు తిరిగి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. నిరుపేదలు బతుకుతెరువు కోసం రోడ్డుపక్కన తోపుడుబండి పెట్టుకుంటే క్షణాల్లో తీసిపారేస్తున్న టౌన్‌ప్లానింగ్ అధికారులు సీఆర్‌జెడ్ నిబంధనలకు విరుద్ధంగా, జీవీఎంసీ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా జరుగుతున్న నిర్మాణాలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. రుషికొండ బీచ్ వద్దనే మరికొందరు అపార్టుమెంట్ కోసం ప్లాన్ తీసుకుని అందులో హోటల్ నడుపుతున్నా అధికారులు చూడనట్టు వదిలేశారంటూ ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. సీఆర్‌జెడ్ నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన నిర్మాణాలు తొలగించాలని, నివాసానికి అనుమతులు తీసుకుని వ్యాపారాలు నిర్వహిస్తున్న భవన నిర్వాహకులపైన జీవీఎంసీ కమిషనర్ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.