Share News

ఇష్టారాజ్యంగా ఐఎఫ్‌ఆర్‌ పనులు

ABN , Publish Date - Feb 03 , 2026 | 01:27 AM

నగరంలో ఈనెల 15 నుంచి ఇంటర్నేషనల్‌ ఫ్లీట్‌ రివ్యూ (ఐఎఫ్‌ఆర్‌) జరగనున్న నేపథ్యంలో జీవీఎంసీ చేపడుతున్న నగర సుందరీకరణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇష్టారాజ్యంగా ఐఎఫ్‌ఆర్‌ పనులు

నగర సుందరీకరణకు రూ.15 కోట్లు కేటాయించిన జీవీఎంసీ

ఫుట్‌పాత్‌లు, సెంటర్‌ మీడియన్లు, డివైడర్లు శుభ్రం చేయకుండానే రంగులు

అడ్డా కూలీలతో కాంట్రాక్టర్ల పనులు

పర్యవేక్షణను గాలికి వదిలేసిన అధికారులు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

నగరంలో ఈనెల 15 నుంచి ఇంటర్నేషనల్‌ ఫ్లీట్‌ రివ్యూ (ఐఎఫ్‌ఆర్‌) జరగనున్న నేపథ్యంలో జీవీఎంసీ చేపడుతున్న నగర సుందరీకరణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఐఎఫ్‌ఆర్‌కు హాజరయ్యే అతిథులు ప్రయాణించే మార్గాల్లో కొత్తగా తారురోడ్లు, డివైడర్లు, ఫుట్‌పాత్‌లకు మరమ్మతులు, పెయింటింగ్‌ పనులకు రూ.15 కోట్లు వెచ్చిస్తున్నారు. ఈ పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా చేస్తున్నా అధికారులు ప్రశ్నించకపోవడం అనుమానాలకు తావిస్తోంది.

భారత నేవీ శక్తిసామర్థ్యాలను ప్రదర్శించడంతోపాటు ప్రపంచ దేశాలతో పరస్పర సహకారమే లక్ష్యంగా ఐఎఫ్‌ఆర్‌ను నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది ఈ కార్యక్రమాన్ని విశాఖలో నిర్వహించాలని భారత నేవీ, రక్షణ శాఖ ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఈ మేరకు బీచ్‌రోడ్డులో ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభించారు. నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు జీవీఎంసీ రూ.15 కోట్ల వ్యయంతో రోడ్ల నిర్మాణం, సుందరీకరణ పనులు చేపట్టింది. అయితే ఇంజనీరింగ్‌ విభాగంలోని అధికారులు, కొందరు కాంట్రాక్టర్లు మిలాఖత్‌ అయి పనుల్లో నాణ్యతకు తిలోదకాలిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఫుట్‌పాత్‌లు, సెంటర్‌ మీడియన్లు, డివైడర్లకు మరమ్మతులు పూర్తిచేయడం, రంగులు వేయడానికి జీవీఎంసీ అధికారులు టెండర్లు పిలిచారు. నిబంధనల ప్రకారం రంగులు వేసే ముందు ఫుట్‌పాత్‌లు, సెంటర్‌మీడియన్లు, డివైడర్లను నీటితో శుభ్రం చేసి దుమ్ము, ధూళిని పోగొట్టాలి. తర్వాత వాటిపై ప్రైమర్‌ వేసి గతంలో ఉన్న రంగులను చెరిపేయాలి. ఆ తర్వాత నిపుణులైన పెయింటర్లతో అధికారులు సూచించిన రంగులను వేయాలి.

కానీ నగరంలో జరుగుతున్న పెయింటింగ్‌ పనుల్లో ఆ పరిస్థితి కనిపించడంలేదు. ఇప్పటివరక దుమ్ము, ధూళితో నిండిన ఫుట్‌పాత్‌ల కెర్బ్‌లు, డివైడర్లు, సెంటర్‌ మీడియన్‌లను కనీసం నీటితో కడగకుండానే అధికారులు సూచించిన రంగులను వేసేస్తున్నారు. ఫుట్‌పాత్‌ కెర్బ్‌లకు ఉన్న మట్టిని తొలగించకుండా బ్రష్‌లతో రంగులు వేసుకుంటూ వెళ్లిపోతున్నారు. దీనివల్ల ప్రస్తుతానికి కాంతివంతంగానే కనిపించినా, చిన్న వర్షం కురిసినా డివైడర్లు, ఫుట్‌పాత్‌లపై పేరుకుపోయిన మట్టి కరిగిపోతుంది. దీనివల్ల మట్టిపైన వేసిన పెయింటింగ్‌ కొట్టుకుపోయి డివైడర్లు, సెంటర్‌ మీడియన్లు, ఫుట్‌పాత్‌ అసహ్యంగా కనిపిస్తాయి. పనులు జరుగుతున్నప్పుడు క్షేత్రస్థాయిలో అధికారులు పర్యవేక్షించి, నాణ్యతతోపాటు ఇతర ప్రమాణాలను పాటిస్తున్నారా? లేదా? పరిశీలించాలి. కానీ ఆపని చేయకపోవడంతో కాంట్రాక్టర్లు తమకు నచ్చిన రీతిలో రోజువారీ అడ్డాకూలీలను తీసుకువచ్చి మొక్కుబడిగా రంగులు వేయించేస్తున్నారు. కమిషనర్‌ కేతన్‌గార్గ్‌, మేయర్‌ పీలా శ్రీనివాసరావు ఇప్పటికైనా స్పందించి ఐఎఫ్‌ఆర్‌ పనుల్లో నాణ్యత పాటించేలా చర్యలు తీసుకోవాలని నగరవాసులు కోరుతున్నారు.

Updated Date - Feb 03 , 2026 | 01:27 AM