Share News

ఐఎఫ్‌ఆర్‌కు విస్తృత ఏర్పాట్లు

ABN , Publish Date - Feb 12 , 2026 | 01:26 AM

ఐఎఫ్‌ఆర్‌కు విస్తృత ఏర్పాట్లు

ఐఎఫ్‌ఆర్‌కు  విస్తృత ఏర్పాట్లు

19న సాయంత్రం సిటీ పరేడ్‌

ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి

నేవీ విన్యాసాలు, కార్నివాల్‌, డ్రోన్‌ షో...

18న ఫుల్‌ డ్రెస్‌ రిహార్సల్స్‌

వుడా పార్కు, సెంట్రల్‌ పార్కులో సిటీ పరేడ్‌ లైవ్‌

వాహనాల పార్కింగ్‌కు

ఏపీఐఐసీ మైదానం, ఏయూ ఎగ్జిబిషన్‌, ఫుట్‌బాల్‌ గ్రౌండ్స్‌ కేటాయింపు

కలెక్టర్‌ హరేంధిరప్రసాద్‌

విశాఖపట్నం, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి):

నగరంలో జరగనున్న ఐఎఫ్‌ఆర్‌ (ఇంటర్నేషనల్‌ ఫ్లీట్‌ రివ్యూ) విజయవంతానికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేంధిరప్రసాద్‌ తెలిపారు. బుధవారం తన ఛాంబర్‌లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఐఎఫ్‌ఆర్‌లో భాగంగా ఈనెల 19వ తేదీ సాయంత్రం ఐదు నుంచి ఏడు గంటల వరకు బీచ్‌రోడ్‌లో సిటీ పరేడ్‌ జరగనున్నదన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ముఖ్య అతిథిగా పాల్గొనే సిటీ పరేడ్‌కు లక్షన్నర నుంచి రెండు లక్షల మంది సందర్శకులు వస్తారని అంచనా వేస్తున్నామన్నారు. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. సముద్రంలో నేవీ విన్యాసాలు, తీరంలో డ్రోన్‌ షో ఉంటాయన్నారు. ఇంకా పలు దేశాలకు చెందిన నేవీ బృందాలు, దేశంలో పలు ప్రాంతాలకు చెందిన కళాకారులతో సాంస్కృతిక ప్రదర్శన (పార్కు హోటల్‌ నుంచి కోస్టల్‌ బ్యాటరీ వరకూ) ఉంటుందన్నారు. రాష్ట్ర చరిత్ర, సంస్కృతి, అభివృద్ధి తెలియజేసేలా రెండు శకటాలు పరేడ్‌లో పాల్గొంటాయన్నారు. పరేడ్‌కు వచ్చే ప్రమఖులు, నౌకాదళ అధికారులు, సిబ్బందికి నౌకాదళం, సందర్శకుల కోసం రోడ్లు, భవనాల శాఖ సీటింగ్‌ ఏర్పాట్లు చేస్తున్నాయన్నారు. 19వ తేదీన సిటీ పరేడ్‌ను లైవ్‌లో తిలకించేందుకు వుడా పార్కు, ఆర్టీసీ కాంప్లెక్స్‌ సమీపాన గల సెంట్రల్‌పార్కులో బిగ్‌ స్ర్కీన్లు ఏర్పాటుచేస్తామని కలెక్టర్‌ తెలిపారు. కాగా 18వ తేదీన బీచ్‌లో ఫుల్‌ డ్రెస్‌ రిహార్సల్స్‌ ఉంటాయన్నారు. పరేడ్‌లో మాదిరిగా సాంస్కృతిక ప్రదర్శనలు, డ్రోన్‌ షో, సముద్రంలో నేవీ విన్యాసాలు ప్రదర్శిస్తారన్నారు. అందువల్ల నగర ప్రజలు కొందరు 18వ తేదీన నిర్వహించే రీహార్సల్స్‌కు హాజరుకావాలని కోరారు. నేవీ అధికారులు, సిబ్బంది వాహనాలను విశ్వప్రియ ఫంక్షన్‌హాలు వెనుక ఏపీఐఐసీ మైదానం, ఏయూ ఎగ్జిబిషన్‌ మైదానం, ప్రభుత్వ అధికారులు, సందర్శకుల వాహనాలు ఏయూ ఫుట్‌బాల్‌ మైదానం, ఇతర ప్రాంతాల్లో నిలపవలసి ఉంటుందన్నారు.

డిసెంబరు నాటికి కాగ్నిజెంట్‌ తొలిదశ నిర్మాణాలు పూర్తి

ఆనందపురంలో గూగుల్‌ డేటా సెంటర్‌ నెలకొల్పడానికి అవసరమైన భూముల సేకరణ దాదాపుగా పూర్తయిందని, పరిహారం పంపిణీ తుది దశకు వచ్చిందని కలెక్టర్‌ వెల్లడించారు. మధురవాడ ఐటీ హిల్స్‌ వద్ద కేటాయించిన భూమిలో కాగ్నిజెంట్‌ కంపెనీ త్వరలో నిర్మాణాలు ప్రారంభించనున్నదన్నారు. డిసెంబరుకల్లా రెండు వేల మంది పనిచేసేందుకు వీలుగా తొలిదశలో శాశ్వత నిర్మాణాలు చేపడతామని కంపెనీ ప్రతినిధులు నివేదించారన్నారు. అప్పటివరకూ తాత్కాలిక క్యాంపస్‌లో కార్యకలాపాలు కొనసాగిస్తుందన్నారు. భోగాపురం ఎయిర్‌పోర్టుకు కనెక్టవిటీ రోడ్లు త్వరితగతిన పూర్తి చేసేలా ఎప్పటికప్పుడు వీఎంఆర్‌డీఏ, జీవీఎంసీ అధికారులతో సమీక్షిస్తున్నామని కలెక్టర్‌ తెలిపారు.

Updated Date - Feb 12 , 2026 | 01:26 AM