Share News

తీపి కబురు అందుతుందనుకుంటే...

ABN , Publish Date - Jan 11 , 2026 | 12:37 AM

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జిల్లాలోని తాండవ, ఏటికొప్పాక, తుమ్మపాల షుగర్‌ ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. దీంతో జిల్లాలో చెరకు సాగు కూడా తగ్గిపోయింది.

తీపి కబురు అందుతుందనుకుంటే...
అనకాపల్లిలో మూతపడిన తుమ్మపాల వీవీ రమణ సహకార షుగర్‌ ఫ్యాక్టరీ

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మూడు చెరకు ఫ్యాక్టరీలు మూసివేత

ఆ ఫ్యాక్టరీలను తెరిపిస్తామని, గోవాడలో ఇథనాల్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేస్తామని ఎన్నికల సమయంలో కూటమి నేతల హామీ

కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర దాటినా మార్పు శూన్యం

గోవాడ ఫ్యాక్టరీలో క్రషింగ్‌ నిలిచిపోవడంతో భవిష్యత్తు అగమ్యగోచరం

చక్కెర కర్మాగారాలకు పూర్వ వైభవం వస్తుందనే ఆశతో రైతుల ఎదురు చూపులు

(అనకాపల్లి- ఆంధ్రజ్యోతి)

‘కూటమి ప్రభుత్వం వచ్చాక షుగర్‌ ఫ్యాక్టరీలకు పూర్వ వైభవం వస్తుందని ఆశించాం. గత వైసీపీ ప్రభుత్వంలో మూతపడిన ఫ్యాక్టరీలను కూడా తెరిపించడమే కాకుండా ప్రత్యామ్నాయంగా ఇథనాల్‌ తయారీ ద్వారా వాటికి ఆర్థిక పరిపుష్ఠిని ఇస్తుందని భావించాం. కానీ జిల్లాలో మిగిలి ఉన్న ఒకే ఒక్క గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీలో కూడా చెరకు క్రషింగ్‌ నిలిచిపోయి దాని భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారైంది’ అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జిల్లాలోని తాండవ, ఏటికొప్పాక, తుమ్మపాల షుగర్‌ ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. దీంతో జిల్లాలో చెరకు సాగు కూడా తగ్గిపోయింది. అయితే ఎన్నికల సమయంలో జిల్లాలోని షుగర్‌ ఫ్యాక్టరీలకు పూర్వ వైభవం తెస్తామని, చెరకు రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు. జిల్లాలో మూతపడిన సహకార షుగర్‌ ఫ్యాక్టరీలను తెరిపించడమే కాకుండా గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీలో ఇథనాల్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేస్తామని వారు ప్రకటించారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర దాటిపోతున్నా ఆ హామీలు అమలుకు నోచుకోక పోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. తాజాగా గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీలో క్రషింగ్‌ నిలిపి వేయడంతో గోరుచుట్టుపై రోకలిపోటు అన్న చందంగా తమ పరిస్థితి తయారైందని వాపోతున్నారు. ప్రస్తుతం గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీలో క్రషింగ్‌ నిలిపి వేయడంతో చెరకును రైతులు క్రషింగ్‌ కోసం విజయనగరం జిల్లా రాజాంకు సమీపంలోని సంకిలి షుగర్‌ ఫ్యాక్టరీకి తరలిస్తున్నారు.

ఇథనాల్‌ ప్లాంట్‌ ప్రతిపాదన ఏమైనట్లు?..

పెట్రోల్‌లో ఇథనాల్‌ వినియోగాన్ని కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేయడంతో ఇథనాల్‌కు దేశ వ్యాప్తంగా గిరాకీ పెరిగింది. షుగర్‌ ఫ్యాక్టరీల్లో కేవలం పంచదార ఉత్పత్తి వల్ల నష్టం తప్ప అటు ఫ్యాక్టరీకి, ఇటు రైతులకు ఎలాంటి లాభాలు ఉండడం లేదు. ఈ నేపథ్యంలో ఇథనాల్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేస్తే ఆర్థికంగా అభివృద్ధి ఉంటుందనే ఉద్దేశంతో గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీని అధ్యయనం చేసిన నిపుణుల కమిటి సైతం నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీలో ఇథనాల్‌ ప్లాంట్‌ ఏర్పాటు ప్రతిపాదన గత వైసీపీ ప్రభుత్వ హయాం నుంచి ఉన్నా అమలుకు నోచుకోలేదు. ఇథనాల్‌ ప్లాంట్‌ ఏర్పాటు అనేది దివాలా తీస్తున్న షుగర్‌ ఫ్యాక్టరీలకు ఊపిరి పోస్తాయని, ఇందుకు అవసరమైన రుణాలతో పాటు ఇతర రాయితీలు అందజేస్తామని కేంద్ర ప్రభుత్వం ఆరేళ్ల కిందటే ప్రకటించింది. గత వైసీపీ ప్రభుత్వం తొలుత గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీలో 30 కిలోలీటర్ల సామర్థ్యం కలిగిన ఇథనాల్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. ఇందుకు తొలి దశ కింద రూ.26 కోట్లు కేటాయించింది. అయితే ఆ నిధులను ఇతర అవసరాలకు మళ్లించడంతో అప్పట్లో ఆ ప్రతిపాదన మరుగులన పడింది. కాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అధికారులు గత ఏడాది గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీలో ఏకంగా 60 కిలోలీటర్ల సామర్థ్యం గల ఇథనాల్‌ ప్లాంట్‌ ఏర్పాటు కోసం రూ.102 కోట్లు అవసరమని సమగ్ర నివేదిక రూపొందించి ప్రభుత్వానికి పంపారు. ఇది జరిగి దాదాపు ఏడాది కావస్తున్నా ఇంతవరకు గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీలో ఇథనాల్‌ ప్లాంట్‌ ఏర్పాటు ప్రతిపాదనకు కదలిక రాలేదు. దీంతో పాటు జిల్లాలో మూత పడిన తుమ్మపాల, తాండవ, ఏటికొప్పాక షుగర్‌ ఫ్యాక్టరీలను తెరిపించి, ఇథనాల్‌ ప్లాంట్‌ల ఏర్పాటు ప్రతిపాదన విషయంలోనూ ప్రభుత్వం కనీసం మంత్రివర్గ సమావేశాల్లో చర్చించకపోవడంతో జిల్లాలో మూతపడిన షుగర్‌ ఫ్యాక్టరీలకు పూర్వవైభవం వస్తుందా? అనే ప్రశ్నలు ఉత్పన్నవుతున్నాయి. ఇప్పటికైనా పాలక పెద్దలు చొరవ తీసుకొని మూత పడిన షుగర్‌ ఫ్యాక్టరీలను తెరిపించి రైతులను ఆదుకోవాలని పలు రైతు సంఘాల నేతలు కోరుతున్నారు.

Updated Date - Jan 11 , 2026 | 12:37 AM