బొర్రా వెళ్లాలంటే బెంబేలు
ABN , Publish Date - Feb 18 , 2026 | 11:39 PM
మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన బొర్రా గుహలకు వెళ్లే రోడ్డంతా అధ్వానంగా తయారైంది.
ఏడు కిలోమీటర్ల మేర రోడ్డంతా గోతులు
కోనాపురం పంచాయతీ ప్రజలతో పాటు పర్యాటకుల అవస్థలు
అనంతగిరి, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన బొర్రా గుహలకు వెళ్లే రోడ్డంతా అధ్వానంగా తయారైంది. ములియగుడ నుంచి బగ్మారవలస, దొరగూడ, గేటువలస, బొర్రా వరకు రోడ్డంతా ఎక్కడికక్కడ గోతులతో దారుణంగా ఉంది. దీంతో కోనాపురం, బొర్రా పంచాయతీల్లోని సుమారు 20 గ్రామాల గిరిజనులతో పాటు పర్యాటకులు ఇబ్బందులు పడుతున్నారు.
బొర్రా గుహలను తిలకించేందుకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు దేశవిదేశీ పర్యాటకులు కూడా అధిక సంఖ్యలో వస్తుంటారు. ఎక్కువ మంది వాహనాల్లోనే వస్తారు. అయితే దొరగూడ సమీపంలోని మలుపు వద్ద ఏర్పడిన గొయ్యి వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. సుమారు ఐదేళ్లుగా బొర్రా రోడ్డుకు మరమ్మతులు, నిర్వహణ లేకపోవడం వల్ల పలుచోట్ల రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయింది. మరికొన్నిచోట్ల భారీగా గోతులు ఏర్పడ్డాయి. అయినా ఆర్‌అండ్‌బీ శాఖ అధికారులు పట్టించుకోకపోవడంతో పలు గ్రామాల ప్రజలతో పాటు పర్యాటకులు ఇబ్బందులు పడుతున్నారు.
ప్రమాదాల మార్గం
ములియగుడ నుంచి బొర్రా గుహలు వరకు సుమారు ఏడు కిలోమీటర్లు ప్రయాణం ఉంటుంది. బగ్మారవలస, దొరగుడ, హోటళ్లు సమీపంలోని రోడ్డుపై గోతులు ఏర్పడ్డాయి. రైల్వేగేటు సమీపంలో రక్షణగోడ కూలిపోవడంతో వాహనాలు అదుపుతప్పితే సుమారు 80 అడుగుల లోయలోకి దూసుపోయే ప్రమాదం ఉంది. గతంలో ఇక్కడ రెండు ప్రమాదాలు జరిగాయి. వ్యాన్ బోల్తా పడిన ఘటనలో డ్రైవర్ మృతి చెందాడు. దానికి ముందు లారీ బోల్తాపడిన ఘటనలో డ్రైవర్‌కు కాలు విరిగిపోయింది. బొర్రా, కోనాపురం పంచాయతీల పరిధిలో గల బొర్రా, పెద్దూరు, ఎగువమామిడి, జీరుగెడ్డ, నీనిమామిడి, పూలుగుడ, కొయిటిగూడ, కరాయిగుడ, చప్పాడి, కోనాపురం, అతిమాల, కితలింగి, బొండ్యగూడ, లిడ్డంగి, సారాగూడ తదితర గ్రామాల ప్రజలు ములియగుడ, బొర్రా గేటువలస మీదుగా ఆయా గ్రామాలకు రాకపోకలు సాగిస్తుంటారు. అయితే ప్రస్తుతం అధ్వానంగా ఉన్న రోడ్డు వలన సమస్యలను ఎదుర్కొంటున్నారు. ములియగుడ- బొర్రా వరకు ఉన్న రోడ్డు ఆర్‌అండ్‌బీ శాఖ పరిధిలోకి వస్తుంది. అయితే నిర్వహణ లోపం వల్ల రోడ్డంతా అధ్వానంగా తయారైంది. కనీసం మరమ్మతులపై దృష్టి సారించకపోవడంతో ఈ మార్గం ప్రమాదాలకు నిలయంగా మారింది. ఇప్పటికైనా ఆర్‌అండ్‌బీ అధికారులు బొర్రా రోడ్డు మరమ్మతులకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.