చూస్తే గుండె చెరువు!
ABN , Publish Date - Apr 12 , 2026 | 12:15 AM
ఒకప్పుడు పట్టణ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరందించిన పట్టణంలోని పంచాయతీ చెరువు ప్రస్తుతం మురుగునీటితో అధ్వానంగా తయారైంది. పట్టణ నడిబొడ్డున ఉన్న ఈ చెరువు గట్టు ఆక్రమణకు గురవుతున్నా పట్టించుకునేవారే కరువయ్యారు.
మురుగునీరు, పిచ్చి మొక్కలతో అధ్వానంగా పంచాయతీ చెరువు
పలు ప్రాంతాల్లోని మురుగునీరంతా ఇక్కడికే..
ఆక్రమణకు గురవుతున్న గట్టు
పట్టించుకోని అధికారులు
పాయకరావుపేట, ఏప్రిల్ 11 (ఆంధ్రజ్యోతి): ఒకప్పుడు పట్టణ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరందించిన పట్టణంలోని పంచాయతీ చెరువు ప్రస్తుతం మురుగునీటితో అధ్వానంగా తయారైంది. పట్టణ నడిబొడ్డున ఉన్న ఈ చెరువు గట్టు ఆక్రమణకు గురవుతున్నా పట్టించుకునేవారే కరువయ్యారు.
స్థానిక మెయిన్‌రోడ్డులో పాత పంచాయతీ కార్యాలయం వెనుక ఉన్న ఈ చెరువుకు రెండున్నర దశాబ్దాల క్రితం వరకు పట్టణంలోని భూమి కాలువ నుంచి ఏటా వర్షాకాలంలో నీరు చేరేది. చెరువును ఆనుకుని ఉన్న సుమారు 20 ఎకరాలకు సాగునీరందడంతో పాటు పట్టణ ప్రజలకు తాగునీరందేది. అనంతర కాలంలో పట్టణ ప్రజలకు పంచాయతీ కొళాయిల ద్వారా రక్షిత మంచినీరు సరఫరా అవుతుండడంతో ఈ చెరువు చేపల చెరువుగా మారి పంచాయతీకి ఆదాయాన్ని సమకూర్చి పెట్టేది. అయితే అభివృద్ధి చెందుతున్న పాయకరావుపేట పట్టణానికి ఆ మేరకు డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో స్థానిక ముస్లింవీధి, శెట్టిబలిజవీధి తదితర ప్రాంతాల మురుగునీరు చెరువులో కలుస్తోంది. అప్పటి నుంచి ఈ చెరువు మురుగునీరు, చెత్తాచెదారం, వ్యర్థాలతో దారుణంగా తయారైంది. చెరువు మొత్తం పిచ్చి మొక్కలతో ఉనికి కోల్పోయింది. దీనికి తోడు పంచాయతీ చెరువును ఆనుకుని వున్న వ్యవసాయ భూములు ఇళ్ల స్థలాలుగా మారిపోగా, భూమి పంట కాలువ నుంచి చెరువుకు నీరు వచ్చే కాలువ కనుమరుగైంది. చెరువు గట్టు క్రమంగా ఆక్రమణల పాలవుతోంది. ఈ చెరువును పునరుద్ధ్దరించి చుట్టూ గట్టును పార్కుగా అభివృద్ధి చేసేందుకు గతంలో పంచాయతీ పాలకవర్గం తీర్మానించినా ఇప్పటి వరకు ఆ దిశగా ఒక్క అడుగు కూడా పడలేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చెరువును అభివృద్ధి చేసి గట్టుపై ఆక్రమణలను తొలగించి పార్కుగా అభివృద్ధి చేయాలని పట్టణవాసులు కోరుతున్నారు.