మొక్కే కదాని వదిలేస్తే..!
ABN , Publish Date - Jun 01 , 2026 | 11:40 PM
జాతీయ రహదారి 516-ఈ పొడవునా ఇరువైపులా నాటిన మొక్కలు సంరక్షణ లేక మూడొంతులు చనిపోయాయు. బతికిన వాటికి రక్షణ కంచె లేక పశువుల బారిన పడి మోడులుగా దర్శనమిస్తున్నాయి.
జాతీయ రహదారికి ఇరువైపులా ఎండిపోయిన మొక్కలు
హైవే నిర్మాణ సమయంలో చెట్ల తొలగింపు
వాటి స్థానంలో పలు రకాల మొక్కలు నాటిన కాంట్రాక్టరు
సంరక్షణ లేక మూడొంతులు చనిపోగా, మిగిలినవి మోడువారిన వైనం
కొయ్యూరు, జూన్ 1 (ఆంధ్రజ్యోతి): జాతీయ రహదారి 516-ఈ పొడవునా ఇరువైపులా నాటిన మొక్కలు సంరక్షణ లేక మూడొంతులు చనిపోయాయు. బతికిన వాటికి రక్షణ కంచె లేక పశువుల బారిన పడి మోడులుగా దర్శనమిస్తున్నాయి.
జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా గతంలో రోడ్డుకు ఇరువైపులా ఉన్న వేలాది చెట్లను తొలగించారు. రహదారి విస్తరించిన తరువాత తొలగించిన చెట్ల స్థానంలో నిర్మాణ పనులు చేపట్టిన కాంట్రాక్టరు 2024 సెప్టెంబరులో మొక్కలు నాటించారు. ఇలా నాటించిన మొక్కలు అప్పట్లో వర్షాలు బాగా పడడంతో బతికాయి. వీటిని పశువుల బారి నుంచి రక్షించేలా మొక్క చుట్టూ నాలుగు కర్రలు పాతి వాటికి సిమెంట్ బస్తాల సంచులను తగిలించారు. అయితే రక్షణకు ఏర్పాటు చేసిన సిమెంట్ గోనెలు కాలక్రమేణా చిరిగిపోయాయి. కర్రలు విరిగిపోయాయి. దీంతో మొక్కలకు పశువుల నుంచి రక్షణ కరువైంది. పశువులు, మేకలు ఈ మొక్కల చిగుళ్లను సగానికి పైగా తినేయడంతో కొన్ని మోడువారాయి. దీనికి తోడు వేసవి తోడైంది. మోడులు చిగురించేలా ఎప్పటికప్పుడు నీటి తడుపులు పెట్టే చర్యలు లేకపోవడంతో వేసిన మొక్కలన్నీ మూడొంతులకు పైగా చనిపోయాయి. ఇలా మండలంలో కాకరపాడు నుంచి వైఎన్ పాకలు కూడలి దాటే వరకు వేసిన మొక్కల్లో 70 శాతం మేర మొక్కలు చనిపోగా, మిగిలిన 30 శాతం మొక్కలు చనిపోయేందుకు సిద్ధంగా ఉన్నాయి. దీంతో గతంలో పచ్చదనంతో కళకళలాడిన ఈ రహదారి విస్తరణ పేరుతో చెట్లు తొలగించడం, వాటి స్థానంలో వేసిన మొక్కలు మరో ఐదారు సంవత్సరాల్లో పెరిగి పూర్వ వైభవం సంతరించుకుంటుందని స్థానికులు భావించినా ప్రస్తుతం ఆ పరిస్థితులు కనిపించడం లేదు. సంబంధిత కాంట్రాక్టరు కనీసం సంవత్సరం పాటైనా మొక్కలు సంరక్షణ చేసేలా చర్యలు చేపట్టకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి మొక్కలను సంరక్షించడంతో పాటు వాటి చుట్టూ కంచె ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.