గీత దాటితే దొరికినట్టే..!
ABN , Publish Date - May 17 , 2026 | 11:19 PM
ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించే వాహనాలను నిఘా నేత్రాలు పట్టేస్తున్నాయి. ప్రధాన కూడళ్లలో వాహనాలు నిర్లక్ష్యంగా నడుపుతున్నవారిని ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నేషన్ (ఏఎన్‌పీఆర్) కెమెరాలు గుర్తిస్తున్నాయి. నంబరు ప్లేట్ ఆధారంగా కేసులు నమోదవుతున్నాయి.
అడుగడుగునా నిఘా నేత్రాలు
ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిస్తున్న వారిపై గురి
కూడళ్లలో ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నేషన్ కెమెరాలు
జిల్లాలో గత ఏడాది 77,059..
ఈ ఏడాది నాలుగు నెలలకే 46,653 ట్రాఫిక్ కేసులు నమోదు
నర్సీపట్నం, మే 17 (ఆంధ్రజ్యోతి): ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించే వాహనాలను నిఘా నేత్రాలు పట్టేస్తున్నాయి. ప్రధాన కూడళ్లలో వాహనాలు నిర్లక్ష్యంగా నడుపుతున్నవారిని ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నేషన్ (ఏఎన్‌పీఆర్) కెమెరాలు గుర్తిస్తున్నాయి. నంబరు ప్లేట్ ఆధారంగా కేసులు నమోదవుతున్నాయి. ట్రాఫిక్ సిగ్నల్స్‌ను అతిక్రమించిన వారిని, త్రిబుల్ రైడింగ్, సెల్‌ఫోన్, ర్యాష్ డ్రైవింగ్ వాహనాలను నంబరు ప్లేటు ఆధారంగా గుర్తిస్తున్నారు. సెల్‌ఫోన్ డ్రైవింగ్‌లు ఎక్కువగా వస్తున్నాయి. నలుగురు వ్యక్తులు బైకుపై వెళుతున్న దృశ్యాలు కూడా కెమెరాలో రికార్డు అయ్యాయి.
జిల్లాలో నమోదైన కేసులు ఇవీ..
జిల్లాలో గత సంవత్సరం జనవరి నుంచి డిసెంబరు వరకు అన్ని రకాల ట్రాఫిక్ చలానా కేసులు 77,059 నమోదు కాగా, పోలీసులు వాహనదారులకు రూ.3,58,47,992 జరిమానా విధించారు. ఇందులో 42,500 చలానాలకు రూ.1,52,29,296లు 55 శాతం మాత్రమే వాహనదారులు చెల్లించారు. ఇంకా 45 శాతం జరిమానా నగదు వసూలు కావలసి ఉంది. అలాగే ఈ సంవత్సరం జనవరి నుంచి ఏప్రిల్ నెలాఖరు వరకు నాలుగు నెలలకు 46,653 ట్రాఫిక్ కేసులకు రూ.2,14,87,310 జరిమానా రాశారు. 24,525 చలానాలకు రూ.72,52,080లు 52 శాతం వసూలు అయింది. ఇంకా 48 శాతం మంది వాహనదారులు జరిమానాలు చెల్లించాల్సి ఉంది.
ప్రధాన కూడళ్లలో ఏఎన్‌పీఆర్ కెమెరాలు
పోలీసులు ప్రధాన కూడళ్లలో ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నేషన్ (ఏఎన్‌పీఆర్) కెమెరాలు ఏర్పాటు చేశారు. నర్సీపట్నంలో పెదబొడ్డేపల్లి, అబీద్ సెంటర్, ఏరియా ఆస్పత్రి సమీపంలో ఈ కెమెరాలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీసు స్టేషన్ల పరిధిలో ఈ కెమెరాలు అమర్చారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధలు ఉల్లంఘిస్తే కెమెరాలో రికార్డు అవుతుంది. నంబరు ప్లేటు ఆధారంగా కేసులు నమోదు నమోదవుతున్నాయి. అనకాపల్లి ఎస్పీ కార్యాలయం నుంచి ప్రతి రోజూ ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించిన వాహనాల సమాచారం పంపుతారు. నర్సీపట్నంలో రోజుకు 20 నుంచి 30 వాహనాలకు సంబంధించిన సమాచారం పంపుతున్నారు.