Share News

ఇటొస్తే జారిపడడం ఖాయం

ABN , Publish Date - Jul 06 , 2026 | 11:00 PM

సీలేరు, జూలై 6(ఆంధ్రజ్యోతి): జీకే వీధి మండలం ధారకొండ- గుమ్మిరేవుల మార్గంలోని మాదిమళ్లు వంతెన అప్రోచ్‌ రోడ్డు తాజాగా కురుస్తున్న వర్షాలకు బురదమయమైంది. దీంతో ఈ మార్గంలో ప్రయాణించే ద్విచక్ర వాహనచోదకులు ప్రమాదాలకు గురవుతున్నారు.

ఇటొస్తే జారిపడడం ఖాయం
మాదిమళ్లు వంతెన అప్రోచ్‌ రోడ్డు బురదమయంగా ఉండడంతో జారిపడిన ద్విచక్ర వాహనం

బురదమయంగా మాదిమళ్లు వంతెన అప్రోచ్‌ రోడ్డు

50 గ్రామాల ప్రజలకు తప్పని ఇబ్బందులు

సీలేరు, జూలై 6(ఆంధ్రజ్యోతి): జీకే వీధి మండలం ధారకొండ- గుమ్మిరేవుల మార్గంలోని మాదిమళ్లు వంతెన అప్రోచ్‌ రోడ్డు తాజాగా కురుస్తున్న వర్షాలకు బురదమయమైంది. దీంతో ఈ మార్గంలో ప్రయాణించే ద్విచక్ర వాహనచోదకులు ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ మార్గంలో రాకపోకలు సాగించే సుమారు 50 గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సోమవారం ప్లాస్టిక్‌ టార్పాలిన్లు విక్రయించే వ్యాపారి ద్విచక్ర వాహనంపై ధారకొండ నుంచి గుమ్మిరేవుల వైపు వెళుతుండగా బురదమయంగా ఉన్న మాదిమళ్లు వంతెన అప్రోచ్‌ రోడ్డులో జారిపడి గాయాలపాలయ్యాడు. సమీపంలో పొలం పనులు చేసుకుంటున్న రైతులు చూసి వెంటనే వచ్చి అతనిని లేవదీశారు. అలానే ఆదివారం కూడా ధారకొండ వారపు సంతకు గుమ్మిరేవుల, పోలవరం జిల్లా పాతకోట, గుర్తేడు, మారేడిమిల్లి తదితర ప్రాంతాల నుంచి ద్విచక్ర వాహనాలపై వచ్చిన పలువురు ద్విచక్ర వాహనచోదకులు ఇక్కడ జారిపడ్డారని మాదిమళ్లు గ్రామస్థులు తెలిపారు. వంతెన నిర్మించి అప్రోచ్‌ రోడ్డును పక్కాగా నిర్మించకుండా మట్టి వేసి వదిలేయడం వల్ల వర్షాలకు బురదమయమవుతోందని చెబుతున్నారు. గత వారం రోజులుగా ఈ అప్రోచ్‌ రోడ్డు బురదగా ఉండడంతో నర్సీపట్నం- గుమ్మిరేవుల ఆర్టీసీ బస్సును ధారకొండ వరకు మాత్రమే నడుపుతున్నారని, ఉన్న ఒక్క బస్సు కూడా రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అప్రోచ్‌ రోడ్డును పక్కాగా నిర్మించాలని వారు కోరుతున్నారు.

పలు చోట్ల జల్లులు

పాడేరు, జూలై 6(ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో సోమవారం ఏజెన్సీలో పలు చోట్ల జల్లులు పడ్డాయి. ఒడిశాకు సరిహద్దులో ఉన్న ముంచంగిపుట్టు, పెదబయలు, జి.మాడుగుల, జీకేవీధి మండలాల్లో ముసురు వాతావరణం నెలకొంది. కొయ్యూరులో 29.6, అనంతగిరిలో 26.9, చింతపల్లిలో 25.0, పాడేరులో 23.8, పెదబయలులో 23.3, ముంచంగిపుట్టులో 22.9 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

అరకులోయలో..

అరకులోయ: మండల పరిధిలో సోమవారం సాధారణ వాతావరణం నెలకొంది. గత ఐదు రోజులుగా వర్షాలతో ఇబ్బంది పడిన జనం కాస్త ఉపశమనం పొందారు. వాతావరణం అనుకూలించడంతో రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు.

Updated Date - Jul 06 , 2026 | 11:00 PM