Share News

వేలం వేస్తే కోట్లు.. కానీ పట్టించుకోరు

ABN , Publish Date - Apr 26 , 2026 | 11:21 PM

అటవీ శాఖాధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వానికి కోట్లాది రూపాయలకు గండి పడుతోంది. నాలుగు దశాబ్దాల క్రితం నాటిన యూకలిప్టస్‌ చెట్లు ముదిరిపోయి నేలకొరిగిపోతున్నా పట్టించుకోవడం లేదు.

వేలం వేస్తే కోట్లు.. కానీ పట్టించుకోరు
ముదిరిపోయిన యూకలిప్టస్‌ చెట్లు

నాలుగు దశాబ్దాల క్రితం నర్సరీలో యూకలిప్టస్‌ మొక్కలను నాటిన అటవీ శాఖ

ఇప్పటి వరకు నరికివేత, వేలంపై దృష్టి పెట్టని అధికారులు

ముదిరిపోయి నేలకొరుగుతున్న వృక్షాలు

కొందరు చాటుగా తరలించి సొమ్ము చేసుకుంటున్నా చర్యలు శూన్యం

ప్రభుత్వానికి రూ.కోట్లలో ఆదాయం వచ్చే అవకాశం ఉన్నా ఉదాసీనత

కొయ్యూరు, ఏప్రిల్‌ 26(ఆంధ్రజ్యోతి): అటవీ శాఖాధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వానికి కోట్లాది రూపాయలకు గండి పడుతోంది. నాలుగు దశాబ్దాల క్రితం నాటిన యూకలిప్టస్‌ చెట్లు ముదిరిపోయి నేలకొరిగిపోతున్నా పట్టించుకోవడం లేదు. కొందరు ఆ చెట్లను తరలించి సొమ్ము చేసుకుంటున్నా కనీస చర్యలు చేపట్టడం లేదు. ఆ చెట్లను వేలం వేస్తే కోట్లాది రూపాయల ఆదాయం వచ్చే అవకాశం ఉన్నా పట్టనట్టే వ్యవహరిస్తున్నారు.

మండలంలోని చీడిపాలెం పంచాయతీలో గల ఐటీడీఏ కాలనీకి సమీపంలో అటవీశాఖ ఆధ్వర్యంలో నర్సరీ ఏర్పాటు చేసేందుకు వీలుగా ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని 1985లో అప్పటి ప్రభుత్వం కేటాయించింది. ఆ భూమిలో అధిక సంఖ్యలో యూకలిప్టస్‌ మొక్కలు నాటారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చే ఈ చెట్ల సంరక్షణను రైతులకు అప్పగించారు. అలా 40 సంవత్సరాల క్రితం నాటిన మొక్కలు ప్రస్తుతం ఏపుగా పెరిగి భారీ వృక్షాలుగా మారాయి. వాస్తవానికి చెట్లు నాటిన ఐదేళ్ల తరువాత వేలం ద్వారా విక్రయించవచ్చు. పైగా బహిరంగ మార్కెట్‌లో యూకిలిప్టస్‌ కలపకు మంచి డిమాండ్‌ కూడా ఉంది. అయితే ఇప్పటి వరకు ఆ చెట్ల నరికివేతపై గానీ, విక్రయించడంపై గానీ అటవీశాఖ దృష్టి పెట్టలేదు. దీంతో ప్రస్తుతం ఆ చెట్లు ముదిరిపోయి వేర్ల పటుత్వం కోల్పోయి చిన్నపాటి ఈదురు గాలులు వీచినా విరిగిపోవడం, కూకటివేర్లతో కూలిపోవడం వంటివి జరుగుతున్నాయి. గతంలో ఈ నర్సరీలో సుమారు 250 యూకిలిప్టస్‌ చెట్లు ఉండగా, వందకు పైగా చెట్లు నేలమట్టం కాగా, మిగిలిన వృక్షాలు పడిపోయే స్థితిలో ఉన్నాయి.

కలప డిపో ఏర్పాటు చేసినా చొరవ శూన్యం

ఈ నర్సరీలో రెండేళ్ల క్రితం అటవీశాఖ కలప డిపోను ఏర్పాటు చేసింది. అయినప్పటికీ పడిపోయిన చెట్లను డిపోలో భద్రపరచడం గాని, వేలం వేయడంపై గానీ అధికారులు చొరవ చూపడం లేదు. దీంతో ఎండకు ఎండి, వానకు తడిసి కలప నాణ్యతను కోల్పోతోంది. దీనికి తోడు పడిపోయిన యూకలిప్టస్‌ చెట్లను కొందరు దొంగచాటుగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ చెట్లను బహిరంగ వేలం వేసినా లేదా నేరుగా వ్యాపారులకు విక్రయించినా ప్రభుత్వ ఖజానాకు కోటి రూపాయల ఆదాయం వస్తుంది. కానీ అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. ఈ విషయమై ఇన్‌చార్జి రేంజర్‌ ప్రసన్నకుమారి వివరణ కోరగా, యూకలిప్టస్‌ చెట్లను విక్రయించేందుకు అనుమతి కోసం డీఎఫ్‌వో, సీసీఎఫ్‌లకు లేఖ రాస్తామని ఆమె తెలిపారు.

Updated Date - Apr 26 , 2026 | 11:21 PM