Share News

ఆదమరిస్తే ఆటో.. ఇటో!

ABN , Publish Date - Feb 15 , 2026 | 12:15 AM

మండలంలోని చాలా మంది ఆటో డ్రైవర్లు నిబంధనలను పాటించడం లేదు. పరిమితికి మించి విద్యార్థులను పాఠశాలలకు తరలిస్తున్నారు. విద్యార్థులు ఒంటి చేత్తో ఆటోలో ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు.

ఆదమరిస్తే ఆటో.. ఇటో!
ఎలమంచిలిలో ప్రైవేటు స్కూల్‌ విద్యార్థులను పరిమితికి మించి ఆటోలో తీసుకు వెళుతున్న దృశ్యం (ఫైల్‌)

పరిమితికి మించి విద్యార్థులతో వెళుతున్న స్కూల్‌ ఆటోలు

బాలలు వేలాడుతూ వెళుతున్న పరిస్థితి

ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని భీతిల్లుతున్న తల్లిదండ్రులు

ఎలమంచిలి, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): మండలంలోని చాలా మంది ఆటో డ్రైవర్లు నిబంధనలను పాటించడం లేదు. పరిమితికి మించి విద్యార్థులను పాఠశాలలకు తరలిస్తున్నారు. విద్యార్థులు ఒంటి చేత్తో ఆటోలో ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు. దీంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మండలంలో అధిక శాతం ఆటోల్లో డ్రైవర్‌కు రెండు వైపులా విద్యార్థులు కూర్చోవడంతో పాటు వెనుక వైపు వేలాడుతూ వెళుతున్న దృశ్యాలే కనిపిస్తున్నాయి. వాస్తవానికి ఆటోలో ఎనిమిది మంది విద్యార్థులనే తీసుకు వెళ్లాలి. కానీ ప్రస్తుతం 15 మంది వరకు విద్యార్థులను డ్రైవర్లు తీసుకు వెళుతున్నారు. ఎలమంచిలి పట్టణంలో 16కు పైగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. స్థానిక విద్యార్థులతో పాటు సమీపంలోని రాంబిల్లి, ఎస్‌.రాయవరం మండలాల్లోని పలు గ్రామాల విద్యార్థులు ఈ పాఠశాలల్లో చదువుతున్నారు. వీరిలో ఎక్కువ మంది ఆటోల్లోనే వస్తుంటారు. అయితే కొందరు ఆటో డ్రైవర్లు పరిమితికి మించి విద్యార్థులను ఎక్కించుకుని ప్రమాదకరంగా రాకపోకలు సాగిస్తున్నారు. కొన్ని ఆటోల్లో పిల్లలు వేలాడుతూ వెళుతున్నారు. ఏ మాత్రం ఆదమరుపుగా ఉన్నా పెనుప్రమాదం తప్పదని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఆటో డ్రైవర్లకు పోలీసులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా ఫలితం లేకుండాపోతోంది. పెనుప్రమాదాలు జరగక ముందే పోలీస్‌ ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

Updated Date - Feb 15 , 2026 | 12:15 AM