పన్ను కట్టకుంటే ఆస్తి సీజ్
ABN , Publish Date - Mar 07 , 2026 | 01:08 AM
ఆస్తి పన్ను బకాయిల వసూలుపై జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్ దూకుడు పెంచారు.
బకాయిల వసూలుపై జీవీఎంసీ ప్రత్యేక దృష్టి
రెవెన్యూ అధికారులకు రోజువారీ లక్ష్యాలు
రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌కు రోజుకు రెండు
రెవెన్యూ అధికారులకు మూడు...
కమిషనర్ ఆదేశాలతో దూకుడు పెంచిన సిబ్బంది
విశాఖపట్నం, మార్చి 5 (ఆంధ్రజ్యోతి):
ఆస్తి పన్ను బకాయిల వసూలుపై జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్ దూకుడు పెంచారు. నోటీసులకు స్పందించని వారి ఆస్తులను సీజ్ చేయాలంటూ రెవెన్యూ అధికారులు, సిబ్బందికి రోజువారీ లక్ష్యాలు ఇచ్చారు.
2025-26 ఆర్థిక సంవత్సరం ఈనెల 31తో ముగుస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆస్తి పన్ను కింద రూ.436 కోట్లు, బకాయిలు (ఎరియర్స్) కింద రూ.134 కోట్లు వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.ఆస్తి పన్ను రూపేణా ఇప్పటివరకూ సుమారు రూ.380 కోట్ల వరకు వసూలైనట్టు అధికారులు పేర్కొంటున్నారు. బకాయిలు మాత్రం కేవలం రూ.35 కోట్లు మాత్రమే వచ్చాయి. దీంతో బకాయిల వసూలుపై గట్టిగా దృష్టి పెట్టాలని రెవెన్యూ అధికారులను కమిషనర్ ఆదేశించారు. అయితే ఇప్పటికే జప్తు నోటీసులు జారీచేసినా చాలామంది స్పందించడం లేదని అధికారులు ఇటీవల కమిషనర్‌తో జరిగిన సమీక్షలో వివరించారు. దీంతో ప్రతి రెవెన్యూ ఇన్‌స్పెక్టర్, రెవెన్యూ అధికారికి రోజువారీ జప్తు టార్గెట్‌లు విధించారు. ఒక్కో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ రోజుకు కనీసం రెండు ఆస్తులను సీజ్ చేసి, బకాయిలు వసూలు చేయాలని స్పష్టంచేశారు. జీవీఎంసీ పరిధిలో 40 మంది రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు (ఆర్‌ఐ) ఉండడంతో వారంతా రోజుకు బకాయి ఉన్న 80 ఆస్తులను సీజ్ చేస్తున్నారు. అలాగే రెవెన్యూ అధికారులు (ఆర్‌ఓ) రోజుకు మూడు ఆస్తులను సీజ్ చేయాలని ఆదేశించారు. జీవీఎంసీ పరిధిలో 15 మంది ఆర్‌ఓలు ఉండడంతో వారంతా రోజుకు 45 ఆస్తులను సీజ్ చేస్తున్నారు. మొత్తం రోజుకు 125 ఆస్తులను జీవీఎంసీ అధికారులు సీజ్ చేస్తుండగా, యజమానులు వాటికి సంబంఽధించిన పన్ను బకాయిలను చెల్లించి విడిపించుకుంటున్నారు. దీనివల్ల జీవీఎంసీకి ఆస్తి పన్ను బకాయిలు తగ్గుతున్నాయని అధికారులు చెబుతున్నారు.