ప్రతిపాదనలను తేల్చకపోతే ఏఎంసీ పాలకవర్గం రాజీనామా
ABN , Publish Date - Jul 07 , 2026 | 01:30 AM
’‘నర్సీపట్నం వ్యవసాయ మార్కెట్ యార్డుకు సంబంధించిన అభివృద్ధి పనుల ప్రతిపాదనలు ఆరు నెలల నుంచి రాష్ట్రస్థాయి అధికారుల వద్ద పెండింగ్‌లో వున్నాయి.
మార్కెటింగ్ శాఖ రాష్ట్రస్థాయి అధికారుల తీరుపై స్పీకర్ అయ్యన్న ఆగ్రహం
నర్సీపట్నం, జూలై 6 (ఆంధ్రజ్యోతి):
’‘నర్సీపట్నం వ్యవసాయ మార్కెట్ యార్డుకు సంబంధించిన అభివృద్ధి పనుల ప్రతిపాదనలు ఆరు నెలల నుంచి రాష్ట్రస్థాయి అధికారుల వద్ద పెండింగ్‌లో వున్నాయి. అనుమతులు ఇవ్వకుండా అధికారులు తాత్సారం చేస్తున్నారు. కొత్తగా మళ్లీ ప్రతిపాదనలు పంపమని అంటున్నారు. గతంలో పంపిన ప్రతిపాదనలపై ఈ నెలాఖరులోగా ఏదో ఒకటి తేల్చకపోతే వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం మొత్తం రాజీనామా చేస్తుందని సంబంధిత మంత్రికి చెప్పాను’’ అని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. సోమవారం వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలవర్గ సమావేశానికి స్పీకర్ హాజరయ్యారు. గత ఏడాది కాలంలో సాధించిన ప్రగతి, భవిష్యత్తులో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై ఆయన సమీక్ష చేశారు. అనంతరం అయ్యన్నపాత్రుడు మీడియాతో మాట్లాడుతూ, ఏఎంసీ పాలకవర్గం ఏర్పడి ఏడాది అవుతున్నదని, ఇప్పటి వరకు ఐదుసార్లు సమావేశాలు జరిగాయని, ఒక్క సమావేశానికి కూడా హాజరు కాని డైరెక్టర్లను పదవుల నుంచి తొలగించాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వం నర్సీపట్నం వ్యవసాయ మార్కెట్ యార్డును బార్‌గా మార్చేసి, నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత రూపురేఖలు పూర్తిగా మార్చామని చెప్పారు. ఆదాయంలో పాయకరావుపేట ఏఎంసీ మొదటి స్థానం, నర్సీపట్నం ఏఎంసీ ద్వితీయ స్థానంలో వున్నాయని తెలిపారు. నర్సీపట్నం ఏఎంసీ పరిధిలోని అన్ని చెక్ పోస్టుల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించామని, వ్యాపారులందరి నుంచి సెస్ వసూలు చేసి ఆదాయం పెంచడానికి కృషి చేస్తున్నామని అన్నారు. కోటవురట్ల రోడ్డులో మార్కెట్ ముందు పది షాపులు నిర్మించడానికి, రైతు బజారు అభివృద్ధి, భూసార పరీక్షా కేంద్రం ఏర్పాటు, తదితర వాటి కోసం ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి పంపామని, ఇవన్నీ పెండింగ్‌లో వున్నాయని, వీటిపై ఈ నెలాఖరులోగా ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే పాలకవర్గం రాజీనామా చేస్తుందని సంబంధిత శాఖా మంత్రికి చెప్పానని స్పీకర్ తెలిపారు. సమావేశంలో ఏఎంసీ చైర్మన్ గవిరెడ్డి వెంకటరమణ, వైస్‌చైర్మన్ చిటికెల కన్నయ్యనాయుడు, డైరెక్టర్లు, మార్కెటింగ్ శాఖ అధికారులు పాల్గొన్నారు.