Share News

చినుకు పడితే విలయమే

ABN , Publish Date - Jun 22 , 2026 | 01:13 AM

ఏకధాటిగా అరగంట వర్షంకురిసే సరికి నగరంలోని గెడ్డలన్నీ పొంగిపోయాయి.

చినుకు పడితే విలయమే

నగరంలో అక్రమణలతో బక్కచిక్కిన గెడ్డలు

తూతూమంత్రంగా పూడికతీత పనులు

మోస్తరు వర్షానికే పొంగుతున్న వైనం

అరగంట వర్షానికే రోడ్లను ముంచెత్తిన మురుగునీరు

మేల్కొనకుంటే హైదరాబాద్‌ తరహా పరిస్థితే

తీవ్ర ఆందోళనలో నగర వాసులు

(విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి)

ఏకధాటిగా అరగంట వర్షంకురిసే సరికి నగరంలోని గెడ్డలన్నీ పొంగిపోయాయి. వాటి సామర్థ్యం సరిపోక వర్షంనీరు రోడ్ల పైనుంచి ప్రవహించడంతో పల్లపుప్రాంతాల్లోని ఇళ్లు నీటమునిగిపోయాయి.చావులమదుం, ఆరిలోవ తదితర ప్రాంతాల్లో రోడ్లపై నుంచి వాహన రాకపోకలకు అవకాశం లేని పరిస్థితి ఏర్పడింది. అరగంట కురిసిన వర్షానికే నగరంలో పరిస్థితి ఇలామారిపోతే భారీవర్షాలు పడితే పరిస్థితి ఏమిటనేదానిపై సర్వత్రా ఆందోళన నెలకొంది.

శరవేగంగా అభివృద్ధిచెందుతున్న విశాఖలో ప్రభుత్వభూములతోపాటు గెడ్డల ఆక్రమణలు పెరిగిపోయాయి. అవకాశం దొరికితే గెడ్డలను ఆక్రమించి ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. దీంతో ఒకప్పుడు విశాలంగా కనిపించిన గెడ్డలన్నీ ప్రస్తుతం చిన్న కాలువల్లా మారిపోయాయి. సాధారణ రోజుల్లో గెడ్డలు కుచించుకుపోవడం వల్ల ఇబ్బందులు తెలయకున్నా, మోస్తరు వర్షం కురిస్తే సమస్య కళ్లముందు సాక్షాత్కారమవుతోంది.

నగర పరిధిలోని ఇళ్లు, వాణిజ్య సముదాయాలు, దుకాణాల్లోని రోజువారీ వాడుక నీటిని బయటకు పంపించేందుకు అంతర్గతంగా 4,067 కిలోమీటర్ల పొడవున డ్రైనేజీలు నిర్మించారు. ఇవికాకుండా డ్రైనేజీల నుంచి కలిసేనీటితోపాటు వర్షం పడినపుడు వరద నీటిని బయటకు పంపించేందుకు 47 మేజర్‌గెడ్డలు దాదాపు 176.86 కిలోమీటర్ల పొడవున ఉన్నాయి. వీటిలో ప్రవహించే మురుగునీరు సమీపంలోని ట్రీట్‌మెంట్‌ప్లాంట్లకు చేరి శుద్ధిచేసిన తర్వాత సముద్రంలో కలిస్తే... మరికొన్నిగెడ్డలు నేరుగా సముద్రంలో కలిపోతున్నాయి. ఒకప్పుడు విశాలంగా ఉండే గెడ్డలన్నీ నేడు బక్కచిక్కిపోయాయి. గెడ్డల పరిరక్షణపై జీవీఎంసీ, రెవెన్యూ అధికారులకు చిత్తశుద్ధి లోపించడంతో ఎవరికివారే తమస్థలాలు/ఇళ్ల ముందున్న గెడ్డలను ఆక్రమించి నిర్మాణాలు చేసుకున్నారు. దీనివల్ల మోస్తర వర్షం కురిస్తే గెడ్డలన్నీ పొంగిపోతున్నాయి. శనివారం రాత్రి అరగంట వర్షానికే నగరం జలమయమైంది. శివాజీపాలెం, పీతలవానిపాలెం, ఆరిలోవ, చినగదిలి, ఎంవీపీకాలనీ, లాసన్స్‌బేకాలనీ, బీచ్‌రోడ్డు తదితర ప్రాంతాల్లో గెడ్డలన్నీ పొంగి రోడ్ల పైనుంచి వర్షం నీరు ప్రవహించింది. గెడ్డల్లో పేరుకుపోయిన ప్లాస్టిక్‌, ఇతర వ్యర్థాలు రోడ్లు, పల్లపుప్రాంతాల్లోని ఇళ్లలోకి చేరిపోయాయి. పారిశుధ్య సమస్య తలెత్తడంతో జీవీఎంసీ సిబ్బంది ఆదివారం సెలవైనా, రోజంతా కష్టపడాల్సి వచ్చింది. ఒక్కోసారి వరదనీటికి పురాతనభవనాల గోడలు నాని కూలిపోతున్నాయి.

అధికారుల పర్యవేక్షణేదీ?

నగరంలో గెడ్డలను పరిరక్షించే బాధ్యత జీవీఎంసీతోపాటు రెవెన్యూశాఖ అధికారులపై ఉంటుంది. ఎవరైనా గెడ్డలకు సమీపంలో నిర్మాణాలు చేపడితే ఇరువైపులా పది మీటర్లు బఫర్‌జోన్‌ను మినహాయించి నిర్మాణాలు చేపట్టాలి. కానీ నగరంలో బఫర్‌జోన్‌లను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడమే కాకుండా ఏకంగా గెడ్డలను కప్పేసి మరీ నిర్మిస్తున్నా జీవీఎంసీ అధికారులు కన్నెత్తి చూడడం లేదు. వన్‌టౌన్‌లో ప్రధానమైన ఎర్రిగెడ్డలో పూడికతీత పనులు బాగానే జరుగుతున్నా, ఆక్రమణల కారణంగా వెడల్పు తగ్గిపోయింది. ఐదు కిలోమీటర్ల పొడవున్న ఈ గెడ్డ పోర్టు వద్ద సముద్రంలో కలుస్తుంది. పోర్టు వద్ద కనీసం రెండు మీటర్ల పైనే పూడిక పేరుకుపోయింది. దీనివల్ల వర్షం నీరు వెనక్కివస్తోంది. ఫలితంగా లోతట్టుప్రాంతాల్లోకి నీరు చేరుతోంది. అలాగే హెచ్‌బీ కాలనీ నుంచి వెంకోజీపాలెం, ఎంవీపీకాలనీ మీదుగా లాసన్స్‌బేపార్కు వద్ద సముద్రంలో కలిసే గెడ్డ పరిస్థితి మరింత దయనీయంగా మారింది. దీనిని ఆక్రమించేసి భవనాలు నిర్మించడంతో కొన్నిచోట్ల వెడల్పు ఐదారు అడుగులకు పరిమితమయిపోయింది. జగదాంబ నుంచి పోర్టు వద్ద కలిసే గంగులగెడ్డపైనా కట్టడాలు వెలిశాయి. ఇప్పటికైనా జీవీఎంసీ అధికారులు గెడ్డలకు సంబంధించిన రికార్డులను పరిశీలించి, ఆక్రమణలపై ఉక్కుపాదం మోపి తొలగించకపోతే స్మార్ట్‌సిటీగా రూపుదిద్దుకుంటున్న విశాఖ భారీవర్షాలు కురిస్తే హైదరాబాద్‌ను తలపిస్తుందని నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

జీవీఎంసీ పరిధిలో

వరద నీటి జోన్లు 15

మొత్తం గెడ్డలు -47

పొడవు 176.86 కిలోమీటర్లు

అంతర్గత డ్రైన ్ల పొడవు 4,067 కిలోమీటర్లు

----------------------------------------------

Updated Date - Jun 22 , 2026 | 01:13 AM