అవకాశం ఇస్తే నగరాన్ని మరింత అభివృద్ధి చేస్తా
ABN , Publish Date - Oct 19 , 2026 | 01:34 AM
మేయర్గా తనకు ఒక్క అవకాశం ఇస్తే నగరాన్ని మరింత అభివృద్ధి చేసి చూపిస్తానని కూటమి అభ్యర్థిగా పోటీచేస్తున్న ముక్కా శ్రావణి అన్నారు.
నగరంలో సమస్యలు, ప్రజల అవసరాలపై పూర్తి అవగాహన ఉంది
నగర వాసులకు ఆరోగ్యకరమైన జీవన పరిస్థితులు కల్పించేందుకు తన వంతు కృషిచేస్తా
కూటమి మేయర్ అభ్యర్థిని ముక్కా శ్రావణి
విశాఖపట్నం, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి):
మేయర్గా తనకు ఒక్క అవకాశం ఇస్తే నగరాన్ని మరింత అభివృద్ధి చేసి చూపిస్తానని కూటమి అభ్యర్థిగా పోటీచేస్తున్న ముక్కా శ్రావణి అన్నారు. ఆదివారం ఆమె తన నామినేషన్ పత్రాలను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో కలిసి జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి దయానిధికి అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. గతంలో కార్పొరేటర్గా పనిచేసిన అనుభవం ఉండడంతో నగరంలో సమస్యలు, ప్రజల అవసరాలపై తనకు పూర్తి అవగాహన ఉందన్నారు. నగర వాసులకు ఆరోగ్యకరమైన జీవన పరిస్థితులు కల్పించేందుకు తన వంతు కృషిచేస్తానన్నారు. ఎంపీ శ్రీభరత్ మాట్లాడుతూ విద్యావంతులు, యువతకు మేయర్గా అవకాశం కల్పించడం ద్వారా నగరాన్ని మరింత అభివృద్ధి చేయాలని సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఆలోచించి బీసీ సామాజిక వర్గానికి చెందిన మాజీ కార్పొరేటర్ ముక్కా శ్రావణిని ఎంపిక చేశారన్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ నగరంలో మేయర్ సీటును జనరల్ మహిళకు కేటాయించడంతో అర్హులైన వారి కోసం వెతికామని, చాలామంది ఉన్నప్పటికీ అందులో ముక్కా శ్రావణి పట్ల మొగ్గుచూపామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, గణబాబు, వంశీకృష్ణశ్రీనివాస్, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, తదితరులు పాల్గొన్నారు.