Share News

ఒక సమస్యపై రెండోసారి ఫిర్యాదు వస్తే ఉపేక్షించను

ABN , Publish Date - Apr 14 , 2026 | 01:14 AM

జీవీఎంసీ పరిధిలో నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌)లో ఒకసారి వచ్చిన ఫిర్యాదు మరోసారి వస్తే ఉపేక్షించేది లేదని అధికారులను కమిషనర్‌ కేతన్‌గార్గ్‌ హెచ్చరించారు.

ఒక సమస్యపై రెండోసారి ఫిర్యాదు వస్తే ఉపేక్షించను

అధికారులకు జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌గార్గ్‌ హెచ్చరిక

ఇకపై ప్రతివారం సమీక్ష

అర్జీదారుడు సంతృప్తి చెందేలా పరిష్కారం చూపాలని ఆదేశం

విశాఖపట్నం, ఏప్రిల్‌ 13 (ఆంధ్రజ్యోతి):

జీవీఎంసీ పరిధిలో నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌)లో ఒకసారి వచ్చిన ఫిర్యాదు మరోసారి వస్తే ఉపేక్షించేది లేదని అధికారులను కమిషనర్‌ కేతన్‌గార్గ్‌ హెచ్చరించారు. ఫిర్యాదుల పరిష్కారానికి అధికారులు తీసుకున్న చర్యలపై ఇకపై ప్రతివారం సమీక్షిస్తానని స్పష్టంచేశారు. ప్రధాన కార్యాలయంలో సోమవారం విభాగాధిపతులు, అదనపు కమిషనర్లతో ఆయన సమీక్ష నిర్వహించారు. పీజీఆర్‌ఎస్‌లో ఒకసారి వచ్చిన ఫిర్యాదులు మళ్లీ వస్తుండడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. పీజీఆర్‌ఎస్‌తోపాటు సర్వీస్‌ మేనేజ్‌మెంట్‌, పురసేవ యాప్‌ ద్వారా వచ్చే ఫిర్యాదులను పరిశీలించి, సంబంధిత జోన్‌ కమిషనర్‌తోపాటు విభాగాధిపతులకు వ్యక్తిగతంగా తెలియజేసే బాధ్యతను ప్రత్యేకంగా ఎనిమిది మంది సిబ్బందికి అప్పగించారు. వారంతా పీజీఆర్‌ఎస్‌లో వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించేందుకు సంబంధిత జెడ్సీ, విభాగాధిపతితో ఫోన్‌ ద్వారా మాట్లాడాలని ఆదేశించారు. అలాగే ఒకే సమస్యపై రెండోసారి ఏదైనా ఫిర్యాదు వస్తే నేరుగా తన దృష్టికి తీసుకురావాలన్నారు. అంతకంటే ముందు ఫిర్యాదుదారుడితో జోనల్‌ కమిషనర్‌, హెచ్‌ఓడీ స్థాయి అధికారి స్వయంగా మాట్లాడి రెండోసారి ఫిర్యాదు చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందనేది తెలుసుకుని నివేదిక రూపంలో తనకు సమాచారం ఇవ్వాలని స్పష్టంచేశారు. పరిష్కరించేసినట్టు మొక్కుబడిగా ఫిర్యాదుదారుడికి సమాధానం ఇచ్చేస్తే సరిపోదని, సంతృప్తిచెందేలా పరిష్కారం చూపాలన్నారు. అంతకుముందు నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో 102 మంది నుంచి అర్జీలను కమిషనర్‌ స్వీకరించారు. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉండిపోయిన తమ ఈఎండీ, ఎఫ్‌ఎస్‌డీలను విడుదల చేయాలని జీవీఎంసీ కాంట్రాక్టర్లు వినతిపత్రం అందజేశారు. జైలురోడ్డులో తొలగించిన ఫుడ్‌కోర్టును తిరిగి తెరిపించాలని కమిషనర్‌కు కొందరు వినతిపత్రం అందజేయగా, పనులు జరుగుతున్నాయని, అర్హులైన వారిని సర్వే ద్వారా గుర్తించి రెండు, మూడు నెలల్లో ప్రారంభిస్తామని సమాధానం ఇచ్చారు.


స్మార్ట్‌ సిటీ కార్పొరేషన్‌కు జీవీఎంసీ ఆస్తుల నిర్వహణ బాధ్యత?

ఆదాయం పెంచే మార్గాలు అన్వేషించాలని కమిషనర్‌ విజ్ఞప్తి

స్మార్ట్‌ సిటీ సీఈఓ హోదాలో స్వయంగా ఆమోదం

ఆలోచనలు పంచుకునేందుకు ఆసక్తి గల సంస్థలకు ఆహ్వానం

బిడ్‌ దాఖలుకు తుదిగడువు రేపు

ఆస్తులు ప్రైవేటుకు కట్టబెట్టే కుట్ర జరుగుతోందంటూ కలెక్టర్‌కు జనసేన మాజీ కార్పొరేటర్‌ ఫిర్యాదు

విశాఖపట్నం, ఏప్రిల్‌ 13 (ఆంధ్రజ్యోతి):

ఆదాయం పెంపు పేరిట జీవీఎంసీకి చెందిన భూములు, భవనాల నిర్వహణ బాధ్యతను గ్రేటర్‌ విశాఖ స్మార్ట్‌ సిటీ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ అప్పగించేందుకు రంగం సిద్ధమవుతోందనే ప్రచారం జరుగుతోంది. జీవీఎంసీకి చెందిన స్థలాలు, భూములు, భవనాలను ఏ విధంగా వినియోగించుకుంటే ఆదాయం పెరుగుతుందో సూచన చేసేందుకు ఆసక్తి గల సంస్థలు/ఏజెన్సీల నుంచి రిక్వెస్ట్‌ ఫర్‌ ప్రపోజల్‌ (ఆర్‌ఎఫ్‌పీ)ను గ్రేటర్‌ విశాఖ స్మార్ట్‌ సిటీ కార్పొరేషన్‌ ఆహ్వానించడ ం దీనికి బలాన్ని చేకూర్చుతోంది. జీవీఎంసీకి చెందిన ఆస్తుల నిర్వహణను చూసుకునేందుకు ప్రత్యేకంగా టౌన్‌ప్లానింగ్‌ విభాగం పర్యవేక్షణలో పనిచేసే ఎస్టేట్‌, రెవెన్యూ విభాగాలు ఉన్నాయి. ఆయా విభాగాల్లో అనుభవం కలిగిన ఉన్నతాధికారులు, ఉద్యోగులు ఉన్నారు. అయితే ఆయా స్థలాలు, భూములు, భవనాల ద్వారా జీవీఎంసీకి మరింత ఆదాయం వచ్చే మార్గాలను అన్వేషించాలని కోరుతూ జీవీఎస్‌సీసీఎల్‌ (గ్రేటర్‌ విశాఖ స్మార్ట్‌ సిటీ కార్పొరేషన్‌ లిమిటెడ్‌)కు జీవీఎంసీ కమిషనర్‌ లేఖ రాశారు. జీవీఎంసీ కమిషనరే జీవీఎస్‌సీసీఎల్‌కు సీఈవోగా ఉంటారు. కమిషనర్‌గా తాను పంపిన ప్రతిపాదనను సీఈఓ హోదాలో ఆమోదించారు. ఈ మేరకు స్మార్ట్‌ సిటీ కార్పొరేషన్‌ అధికారులు ఇటీవల ఆర్‌ఎఫ్‌పీని పిలిచారు. స్థలాలను, భవనాలను ఎలా వినియోగించుకుంటే జీవీఎంసీకి అధిక ఆదాయం వస్తుంది?, అందుకోసం తమకు జీవీఎంసీ లేదా స్మార్ట్‌సిటీ ఎంత చెల్లించాలి?...వంటి వివరాలు సమర్పించేందుకు ఈనెల 15 వరకు గడువు ఇచ్చారు. అయితే ఈ పేరిట జీవీఎంసీ ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేసే ప్రయత్నం జరుగుతోందంటూ జనసేన పార్టీకి చెందిన మాజీ కార్పొరేటర్‌ పీతల మూర్తియాదవ్‌ సోమవారం జీవీఎంసీ ప్రత్యేక అధికారి, జిల్లా కలెక్టర్‌ అభిషిక్త్‌ కిషోర్‌కు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. జీవీఎంసీకి రూ.వేల కోట్ల విలువైన షాపింగ్‌ కాంప్లెక్స్‌లు, పార్కులు, భూములు ఉన్నాయని, వాటికి సంబంధించిన రికార్డులను కూడా ఆర్‌ఎఫ్‌పీ దక్కించుకునే సంస్థ/ఏజెన్సీ చేతికి అప్పగించాలని నిబంధన ఉన్నందున అన్యాక్రాంతం అయ్యే ప్రమాదం ఉంటుందని ఆందోళన వ్యక్తంచేశారు. తక్షణం ఆర్‌ఎఫ్‌పీని రద్దు చేయాలని మూర్తియాదవ్‌ తన ఫిర్యాదులో కోరారు.

Updated Date - Apr 14 , 2026 | 01:14 AM