ఇడ్లీ, టమాటా రైస్... 83.83 లక్షలు
ABN , Publish Date - Oct 03 , 2026 | 01:03 AM
‘అప్పన్న సొమ్ము ఆరగింపు’ శీర్షికతో శుక్రవారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనం దేవదాయ శాఖ వర్గాల్లో కలకలం రేపింది.
గిరి ప్రదక్షిణ రోజు విధుల్లో ఉన్న సిబ్బందికి భోజనం సరఫరా పేరిట దేవస్థానం సొమ్ము కైంకర్యం
పూర్వ పరిచయంతోనే ‘రుచి’కి కాంట్రాక్టు ఇచ్చిన అధికారి
మరోవైపు తమకు ఇడ్లీ, టమాటా రైస్ ప్యాకెట్లు మాత్రమే ఇచ్చారంటున్న ఉద్యోగులు
జాబితాలో పదార్థాలు ఇవ్వనే లేదంటూ ఫిర్యాదు
అధిక శాతం మందికి దాతలే ఆహారం సమకూర్చారంటూ వెల్లడి
ట్రస్టు బోర్డు ఆమోదం లేకుండా బిల్లు ఎలా చెల్లించారంటూ సభ్యుల ఆగ్రహం
విశాఖపట్నం, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి):
‘అప్పన్న సొమ్ము ఆరగింపు’ శీర్షికతో శుక్రవారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనం దేవదాయ శాఖ వర్గాల్లో కలకలం రేపింది. గత జూలైలో గిరి ప్రదక్షిణ సందర్భంగా విధులకు వెళ్లిన తమకు దేవస్థానం అధికారులు భోజనమే పెట్టలేదని పలు శాఖల ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఎక్కువ మంది సిబ్బందికి బయట దాతలే ఆహారం అందజేశారని, దేవస్థానం ఎక్కడ సరఫరా చేసిందని ప్రశ్నిస్తున్నారు. అలాంటప్పుడు రూ.83.83 లక్షల బిల్లు ఎలా ఇస్తారని అడుగుతున్నారు. దీనిపై పూర్తిస్థాయి విచారణ చేయాలని ట్రస్ట్ బోర్డు సభ్యులు సైతం డిమాండ్ చేస్తున్నారు.
గిరి ప్రదక్షిణ విధులకు హాజరైన వారికి మూడు పూటలా భోజనం పెట్టినట్టు లెక్కలు చూపించి రూ.83.83 లక్షల బిల్లు కేటరింగ్ సంస్థ తీసుకుంది. దేవస్థానంలో పనిచేస్తున్న ‘నిద్దాం నాయుడు’ అనే అధికారికి, తమకు కొన్నేళ్లుగా పరిచయం ఉందని, ఆ బంధంతోనే కాంట్రాక్టు ఇచ్చారని కేటరింగ్ సంస్థ నిర్వాహకులు చెబుతున్నారు. ఇందులో కూటమి పార్టీకి చెందిన కొందరు నాయకులు కూడా భాగస్వాములుగా ఉన్నారని సమాచారం.
గిరి ప్రదక్షిణ సమయంలో విధులు నిర్వహించిన పలువురు దేవస్థానం ఉద్యోగులు శుక్రవారం ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధికి ఫోన్ చేసి, తమకు టిఫిక్ కింద ఇడ్లీ, భోజనం కింద టమాటా రైస్ మాత్రమే ఇచ్చారని, అవి కూడా బాగుండకపోవడంతో పక్కన పడేశామని చెప్పారు. దాతలు భక్తులకు రకరకాల ఫలహారాలు పెట్టారని, విధుల్లో ఉన్న తమకు కూడా ఇచ్చారని, వాటినే తిని కడుపు నింపుకున్నామని వివరించారు. కాంట్రాక్టర్ టెండర్‌లో పేర్కొన్నట్టుగా టిఫిన్‌లో ఇడ్లీ తప్ప వడ, ఉప్మాలు లేనేలేవని, టీ/కాఫీలు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. భోజనంలో వెజ్ పలావ్, అన్నం, పప్పు, వెజ్ కర్రీ, వేపుడు కర్రీ, సాంబరు, అన్నం, స్వీటు అంటూ చాలా లిస్ట్ ఉందని, కానీ తమకు టమాటా రైస్ ప్యాకెట్లు మాత్రమే ఇచ్చారని తెలిపారు. ఆ ఆహారానికి రూ.83.83 లక్షల బిల్లు ఇచ్చారంటే అందులో కచ్చితంగా గోల్‌మాల్ జరిగే ఉంటుందని ఘంటాపథంగా చెబుతున్నారు. వాస్తవానికి ప్రతి దేవస్థానంలోను ఉత్సవాలు ఏమైనా జరిగితే దేవదాయ శాఖ సిబ్బందికి అన్నదాన సత్రంలోనే వంటలు చేయించి పెడతారని, ఇలా టిఫిన్లకు రూ.125, భోజనాలకు రూ.195, అధికారులకైతే రూ.390 వంటి రేట్లు వేయడం గతంలో ఎన్నడూ చూడలేదని విస్మయం వ్యక్తంచేశారు.
టీఏ, డీఏ బిల్లులు కూడా ఇవ్వలేదు
ఆలయాల్లో ఉత్సవాలకు ఇతర ప్రాంతాల నుంచి దేవదాయ శాఖ సిబ్బంది డిప్యూటేషన్‌పై వస్తే వారికి రవాణా భత్యం (టీఏ), కరవు భత్యం (డీఏ) ఇస్తారు. ఆయా ఉద్యోగులు వివరాలు సమర్పిస్తే, వాటిని సీఎఫ్‌ఎంఎస్‌లో లోడ్ చేసి మూడు రోజుల్లో వారి ఖాతాలకు జమ చేస్తారు. అయితే ఈసారి రెండు నెలలు పూర్తయినా చాలామందికి టీఏ, డీఏలు ఇవ్వలేదని పలువురు దేవదాయ శాఖ సిబ్బంది ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు.
ట్రస్టుబోర్డు ఆమోదం లేదు
రెండు రోజుల క్రితం దేవస్థానం ట్రస్ట్‌బోర్డు సమావేశం జరిగింది. అందులో దాదాపు 63 అంశాలు ప్రతిపాదించి కోట్లాది రూపాయల పనులకు అధికారులు ఏకగ్రీవ ఆమోదం పొందారు. అయితే ఆ జాబితాలో ఎక్కడా గిరి ప్రదక్షిణ భోజనాలకు సంబంధించిన బిల్లు విషయం ప్రస్తావించలేదని కొందరు సభ్యులు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. బోర్డు ఆమోదం లేకుండా బిల్లు ఎలా ఇచ్చారని వారు ప్రశ్నిస్తున్నారు. దీనిపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని తాము డిమాండ్ చేస్తామన్నారు.