Share News

హోమ్‌ స్టేకి క్లస్టర్ల గుర్తింపు

ABN , Publish Date - May 09 , 2026 | 10:41 PM

గిరిజనులకు పర్యాటకంగా స్వయం ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ట్రైబల్‌ హోమ్‌ స్టే పథకానికి జిల్లాలో క్లస్టర్లను గుర్తించాలని అధికారులకు జాయింట్‌ కలెక్టర్‌ టి.శ్రీపూజ ఆదేశించారు.

హోమ్‌ స్టేకి క్లస్టర్ల గుర్తింపు
మాట్లాడుతున్న జాయింట్‌ కలెక్టర్‌ శ్రీపూజ

లంబసింగి, అరకులోయ, అనంతగిరి ఎంపిక

13వ తేదీకి కార్యాచరణ ప్రణాళిక

గిరిజనులకు ఆదాయం పెంపే లక్ష్యం

జాయింట్‌ కలెక్టర్‌ శ్రీపూజ

పాడేరు, మే 9 (ఆంధ్రజ్యోతి): గిరిజనులకు పర్యాటకంగా స్వయం ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ట్రైబల్‌ హోమ్‌ స్టే పథకానికి జిల్లాలో క్లస్టర్లను గుర్తించాలని అధికారులకు జాయింట్‌ కలెక్టర్‌ టి.శ్రీపూజ ఆదేశించారు. ట్రైబల్‌ హోమ్‌ స్టేపై కలెక్టరేట్‌లో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. స్థానిక గిరిజనులకు ఆదాయం లభించేందుకు హోమ్‌ స్టే పథకం దోహదపడుతుందన్నారు. జిల్లాలో చింతపల్లి మండలంలో లంబసింగి ఒక క్లస్టర్‌గా, అరకులోయ, డుంబ్రిగుడ, అనంతగిరి ప్రాంతాలను రెండు క్లస్టర్లుగా విభజించి గుర్తించాలన్నారు. ఎంపీడీవోలు, తహశీల్దార్లు మూడు క్లస్టర్ల పరిధిలోని గ్రామాలను ట్రైబల్‌ హోమ్‌ స్టే పథకానికి అనువుగా ఉన్నవి గుర్తించాలన్నారు. అందులో భాగంగా మూడు క్లస్టర్ల పరిధిలో అధికారులు క్షేత్ర పర్యటనలు చేసి మౌలిక సదుపాయాలు, భద్రత, పర్యాటకుల్ని ఆకర్షించే అంశాలను పరిగణనలోకి తీసుకుని ఎంపిక ప్రక్రియను చేపట్టాలన్నారు. ట్రైబల్‌ హోమ్‌ స్టే పథకాన్ని సద్వినియోగం చేసుకునేందుకు యువత, ఔత్సాహిక మహిళలు ముందుకు రావాలన్నారు. హోమ్‌ స్టేకు అవసరమైన నూతన భవనం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.5 లక్షలు మంజూరు చేస్తుందన్నారు. ఇప్పటికే ఇల్లుంటే దానిని మరింతగా మెరుగుపర్చేందుకు రూ.3 లక్షలు మంజూరు చేస్తారన్నారు. అందుకుగానూ ఆసక్తి ఉన్న వ్యక్తులు తమ పరిధిలోని ఎంపీడీవోలను సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, జిల్లా టూరిజం అధికారి జి.దాసు, రెవెన్యూ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 09 , 2026 | 10:41 PM