గాడితప్పిన ఐసీడీఎస్
ABN , Publish Date - Jul 03 , 2026 | 12:29 AM
మండల ఐసీడీఎస్ ప్రాజెక్టు గాడి తప్పింది. అండన్‌వాడీ కేంద్రాల పనితీరుపై పర్యవేక్షణ కొరవడింది. స్థానిక సీడీపీవో ఏడాది కాలంగా జిల్లా కేంద్రంలో విధులు నిర్వహిస్తున్నారు. తొమ్మిది మంది సూపర్‌వైజర్లకు గాను ముగ్గురే ఉన్నారు. దీంతో ఆదివాసీ చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు అందాల్సిన పోషకాహారం పూర్తి స్థాయిలో అందడం లేదు. సర్వసభ్య సమావేశంలో పలుమార్లు ఈ సమస్యను సభ్యులు అధికారుల దృష్టికి తీసుకొచ్చినప్పటికి ఉన్నతాధికారుల్లో మార్పు రాకపోవడం ఆదివాసీల పాలిట శాపంగా మారింది.
- అంగన్‌వాడీ కేంద్రాలపై కొరవడిన పర్యవేక్షణ
- సీడీపీవో డిప్యూటేషన్‌పై ఏడాది క్రితం జిల్లా కేంద్రానికి బదిలీ
- తొమ్మిది మంది సూపర్‌వైజర్లకు గాను ఉన్నది ముగ్గురే
- చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు పూర్తి స్థాయిలో అందని పోషకాహారం
గూడెంకొత్తవీధి, జూలై 2 (ఆంధ్రజ్యోతి): మండల ఐసీడీఎస్ ప్రాజెక్టు గాడి తప్పింది. అండన్‌వాడీ కేంద్రాల పనితీరుపై పర్యవేక్షణ కొరవడింది. స్థానిక సీడీపీవో ఏడాది కాలంగా జిల్లా కేంద్రంలో విధులు నిర్వహిస్తున్నారు. తొమ్మిది మంది సూపర్‌వైజర్లకు గాను ముగ్గురే ఉన్నారు. దీంతో ఆదివాసీ చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు అందాల్సిన పోషకాహారం పూర్తి స్థాయిలో అందడం లేదు. సర్వసభ్య సమావేశంలో పలుమార్లు ఈ సమస్యను సభ్యులు అధికారుల దృష్టికి తీసుకొచ్చినప్పటికి ఉన్నతాధికారుల్లో మార్పు రాకపోవడం ఆదివాసీల పాలిట శాపంగా మారింది.
గూడెంకొత్తవీధి ప్రాజెక్టు పరిధిలోని తొమ్మిది సెక్టార్లలో 212 మినీ, ప్రధాన అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. కేవలం 87 అంగన్‌వాడీ కేంద్రాలకు మాత్రమే శాశ్వత భవనాలు ఉన్నాయి. 125 అంగన్‌వాడీ కేంద్రాలు అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. మెజారిటీ అంగన్‌వాడీ కేంద్రాలకు సెల్ సంకేతాలు లేవు. దీంతో చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పోషకాహారం ఆఫ్‌లైన్‌లోనే పంపిణీ చేస్తున్నారు.
కేంద్రాలపై కొరవడిన పర్యవేక్షణ
ప్రాజెక్టు పరిధిలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రాలపై ఐసీడీఎస్ అధికారుల పర్యవేక్షణ లేకుండాపోయింది. గతంలో ప్రాజెక్టు పరిధిలో పనిచేసిన సీడీపీవో, సూపర్‌వైజర్లు స్థానికంగా అందుబాటులో ఉండేవారు. దీంతో తరచూ అంగన్‌వాడీ కేంద్రాలపై అధికారుల పర్యవేక్షణ ఉండేది. గత వైసీపీ ప్రభుత్వం ఐసీడీఎస్ ప్రాజెక్టులో ఖాళీలను భర్తీ చేయడంలో విఫలమైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే శ్రీకాకుళం నుంచి సీడీపీవో ఝాన్సీ రామ్ పడాల్‌ను నియమించింది. ఒక వైసీపీ నేత సిఫారసుతో నిబంధనలకు విరుద్ధంగా స్థానిక సీడీపీవోకి జిల్లా కేంద్రంలో ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం జీకే వీధి సీడీపీవో కేవలం పీడీ విధులకు మాత్రమే పరిమితమయ్యారు. జీకే వీధి ప్రాజెక్టుకు గత ఏడాది కాలంలో నాలుగు సార్లు మాత్రమే వచ్చారంటే అతిశయోక్తికాదు. అలాగే తొమ్మిది మంది సూపర్‌వైజర్లు ఉండాల్సి వున్నప్పటికి కేవలం ముగ్గురు మాత్రమే విధుల్లో ఉన్నారు. సాధారణంగా ఒక సూపర్‌వైజర్ సెక్టారు పరిధిలో నెలకు 18-20 అంగన్‌వాడీ కేంద్రాలను తనిఖీ చేయాలి. సీడీపీవో నెలకు 10-15 అంగన్‌వాడీ కేంద్రాలను తనిఖీలు చేయాల్సి వుంది. సీడీపీవో పీడీ విధులు నిర్వహించడం వల్ల జీకే వీధి ప్రాజెక్టు పరిధిలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రాలను తనిఖీ చేసే పరిస్థితి లేదు. అలాగే తొమ్మిది మంది సూపర్‌వైజర్లకు కేవలం ముగ్గురు మాత్రమే ఉండడంతో అంగన్‌వాడీ కేంద్రాలను తరచూ తనిఖీ చేయడం లేదు. దీంతో అంగన్‌వాడీ కేంద్రాలు సక్రమంగా నడవడంలేదని గిరిజన సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు చెబుతున్నారు.
పోషకాహారం పంపిణీలో కోత
ఐసీడీఎస్ అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్ల అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పంపిణీ చేయాల్సిన పోషకాహారంలో భారీగా కోత విధిస్తున్నారని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం గిరిజన ప్రాంత ఆదివాసీల్లో రక్తహీనత, పోషకాహార లోపం నివారించేందుకు ప్రత్యేక కార్యక్రమాలను అంగన్‌వాడీ కేంద్రం ద్వారా అమలు చేస్తోంది. మైదాన ప్రాంతాల్లో సంపూర్ణ పోషణ అందిస్తుండగా, గిరిజన ప్రాంతంలో సంపూర్ణ పోషణ ప్లస్‌ను అందిస్తోంది. ఏడు నెలల నుంచి మూడేళ్ల వయస్సు కలిగిన చిన్నారులకు నెలకు 30 గుడ్లు, ఆరు లీటర్ల పాలు, బాలామృతం ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నది. గర్భిణులు, బాలింతలకు నెలకు 25 గుడ్లు, ఐదు లీటర్ల పాలు, మూడు కిలోల బియ్యంతోపాటు బాల సంజీవని కిట్‌లో ఖర్జూరం, రాగి పిండి, మల్టీగ్రేన్ గోధుమ పిండి, బెల్లం, చెక్కిని టేక్ హోమ్ రేషన్ పద్ధతిలో అందిస్తోంది. ప్రభుత్వం రూ.కోట్ల నిధులు వెచ్చించి పోషకాహారం పంపిణీ చేస్తున్నప్పటికి జీకే వీధి ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో పూర్తి స్థాయిలో అందడం లేదని లబ్ధిదారులు ఆవేదన వ్యక్త చేస్తున్నారు.
పట్టించుకోని అధికారులు
జీకే వీధి ప్రాజెక్టు పరిధిలో గిరిజన బాలింతలు, గర్భిణులు, చిన్నారులకు పోషకాహారం సక్రమంగా అందడం లేదని గిరిజన సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు పలు మార్లు ఫిర్యాదు చేసినప్పటికి జిల్లా అధికారులు కనీసం పట్టించుకున్న దాఖలాలు లేవు. సర్వసభ్య సమావేశంలో గాలికొండ ఎంపీటీసీ సభ్యుడు అంపురంగి బుజ్జిబాబు, ఇతర ఎంపీటీసీ సభ్యులు అధికారులను నిలదీసి, పక్కా ఆధారాలతో అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఉన్నతాధికారులు నేటి వరకు విచారణ చేపట్టిన దాఖలాలు లేవు. ఇప్పటికైనా జీకే వీధి ప్రాజెక్టులో అందుబాటులో ఉండే సీడీపీవోను నియమించడంతో పాటు ఖాళీగా ఉన్న సూపర్‌వైజర్ పోస్టులు భర్తీ చేయాలని, అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పూర్తి స్థాయిలో పోషకాహారం అందించాలని లబ్ధిదారులు కోరుతున్నారు.