విమ్స్‌ను అభివృద్ధి దిశగా నడిపిస్తా
ABN , Publish Date - Jun 02 , 2026 | 01:22 AM
విమ్స్‌ను సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా అభివృద్ధి చేసేందుకు శక్తివంచన లేకుండా కృషిచేస్తానని నూతన డైరెక్టర్ డాక్టర్ వి.మన్మథరావు పేర్కొన్నారు.
సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా మార్చేందుకు కృషిచేస్తా
వైద్యులు, సిబ్బంది నిబద్ధతతో
పనిచేయడం ద్వారా ఆస్పత్రి అభివృద్ధి
నూతన డైరెక్టర్ డాక్టర్ వి.మన్మథరావు
విశాఖపట్నం, జూన్ 1 (ఆంధ్రజ్యోతి):
విమ్స్‌ను సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా అభివృద్ధి చేసేందుకు శక్తివంచన లేకుండా కృషిచేస్తానని నూతన డైరెక్టర్ డాక్టర్ వి.మన్మథరావు పేర్కొన్నారు. సోమవారం ఉదయం విమ్స్ డైరెక్టర్‌గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆస్పత్రిలో పీజీ కళాశాల, క్యాథలాబ్ ఏర్పాటు సహా గత డైరెక్టర్ కె.రాంబాబు పలు ప్రతిపాదనలు పెట్టారని, వాటిని ముందుకు తీసుకువెళ్లడం ద్వారా రోగులకు నాణ్యమైన సేవలను అందించేందుకు కృషి చేయనున్నట్టు చెప్పారు. ఆస్పత్రికి నెఫ్రాలజీ, యూరాలజీ విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఫార్మసిస్టులు వంటి పోస్టుల మంజూరు కోసం యత్నిస్తానన్నారు. విమ్స్ అభివృద్ధి చెందుతున్న దశలో ఉందని, కీలక ప్రతిపాదనలు కార్యరూపం దాల్చేలా కృషిచేస్తానన్నారు. ఇందుకు ప్రజలు, ప్రజా ప్రతినిధులతోపాటు అందరి సహకారం కావాలన్నారు. వైద్యులు, సిబ్బంది నిబద్ధతతో పనిచేయడం వల్ల ఆస్పత్రి మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. హైదరాబాద్‌లో ఉన్న నిమ్స్ తరహాలో సేవలు అందించే ఉద్దేశంతో విమ్స్‌ను ఏర్పాటు చేశారని, ఆ దిశగా ముందుకు తీసుకువెళతామన్నారు. తనకు డైరెక్టర్‌గా అవకాశం కల్పించిన ప్రభుత్వానికి, ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్‌కు, వైద్య, ఆరోగ్యశాఖ ప్రధాన కార్యదర్శి సౌరబ్ గౌర్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. అందరికీ అందుబాటులో ఉంటూ విమ్స్‌ను అభివృద్ధి దిశగా నడిపించేందుకు కృషిచేస్తానని మన్మథరావు స్పష్టం చేశారు. సమావేశంలో ఆస్పత్రి డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస కుమార్, ఆస్పత్రి అడ్మినిస్ర్టేటర్ డాక్టర్ మనోజ్, ఆర్‌ఎంవో డాక్టర్ శిరీష పాల్గొన్నారు. అంతకుముందు తన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన మన్మథరావును పలువురు సీనియర్ వైద్యులు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. వీరిలో మానసిక వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ రామిరెడ్డి, కేజీహెచ్ జనరల్ మెడిసిన్ విభాగ ప్రొఫెసర్ డాక్టర్ వాసవీ లత, జనరల్ సర్జరీ విభాగ ప్రొఫెసర్ డాక్టర్ వి,రాజ్‌కమల్‌తోపాటు పలువురు వైద్యులు, నర్సింగ్, ఇతర సిబ్బంది ఉన్నారు.