ఎంపీగానే కొనసాగుతా
ABN , Publish Date - Jan 01 , 2026 | 01:10 AM
తెలుగుదేశం పార్టీ అంతర్గత రాజకీయాలపై కొద్దికాలంగా సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారానికి ఆ పార్టీ నాయకులు బుధవారం ఫుల్‌స్టాప్ పెట్టారు. విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్ వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేస్తారని, ఆయన ఉత్తర నియోజకవర్గంపై ఆసక్తి చూపుతున్నారని, అందుకే అక్కడ టీడీపీ వార్డు కమిటీల నియామకంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారని, కొద్దికాలం కిందట ప్రచారం జరిగింది. ఆ తరువాత భీమిలి నియోజకవర్గంలో ఆయన విస్తృతంగా పర్యటిస్తున్నారని, అక్కడ నుంచి పోటీ చేయడానికి గ్రౌండ్ సిద్ధం చేసుకుంటున్నారని మరో ప్రచారం మొదలైంది.
ఊహాగానాలకు ఫుల్‌స్టాప్ పెట్టిన ఎం.శ్రీభరత్
వచ్చే ఎన్నికల్లో ఆయన భీమిలి సీటు కోరుకుంటే సంతోషంగా ఇచ్చేసి,
నేను ఎంపీగా పోటీ చేస్తా: ఎమ్మెల్యే గంటా
మా మధ్య ఎటువంటి అంతరాలు లేవని స్పష్టీకరణ
విశాఖపట్నం, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి):
తెలుగుదేశం పార్టీ అంతర్గత రాజకీయాలపై కొద్దికాలంగా సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారానికి ఆ పార్టీ నాయకులు బుధవారం ఫుల్‌స్టాప్ పెట్టారు. విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్ వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేస్తారని, ఆయన ఉత్తర నియోజకవర్గంపై ఆసక్తి చూపుతున్నారని, అందుకే అక్కడ టీడీపీ వార్డు కమిటీల నియామకంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారని, కొద్దికాలం కిందట ప్రచారం జరిగింది. ఆ తరువాత భీమిలి నియోజకవర్గంలో ఆయన విస్తృతంగా పర్యటిస్తున్నారని, అక్కడ నుంచి పోటీ చేయడానికి గ్రౌండ్ సిద్ధం చేసుకుంటున్నారని మరో ప్రచారం మొదలైంది. దీనిని ఆయన తేలిగ్గా తీసి పారేసినా మీడియాలో మాత్రం కథనాలు వస్తూనే ఉన్నాయి. 2025లో కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు వివరించేందుకు ఎంపీ శ్రీభరత్ పాండురంగాపురంలోని తన నివాసంలో పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో కలిసి బుధవారం విలేకరుల సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంలో విలేకరులు దీనిపై ఎంపీ శ్రీభరత్‌ను ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో విశాఖ ఉత్తరమా?, భీమిలి నియోజకవర్గమా? అని అడగ్గా...దానిని ఆయన ఖండించారు. ఎంపీగా తనకు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల అభివృద్ధి అవసరమని, ఆ క్రమంలోనే ఆయా నియోజకవర్గాల్లో పర్యటనలు, ఇతర కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని స్పష్టంచేశారు. పార్లమెంటు వేదికగా చేసుకొని విశాఖపట్నం అభివృద్ధికి కృషి చేయాలనేది తన అజెండా అని, ఎంపీగానే రాజకీయాల్లో కొనసాగుతానని స్పష్టం చేస్తూ ఊహాగానాలకు తెరదించారు. ఆ పక్కనే కూర్చున్న భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ, మీడియా రకరకాల కథనాలు ప్రచారం చేస్తోందని, శ్రీభరత్ వచ్చే ఎన్నికల్లో ఒకవేళ భీమిలి సీటు కోరుకుంటే తాను సంతోషంగా ఆయనకు ఇచ్చేసి, తాను ఎంపీగా పోటీ చేస్తానని వెల్లడించారు. పార్టీలో ఎంపీ, ఎమ్మెల్యేలకు మధ్య సఖ్యత లేదని, సమన్వయం లేదని కూడా కొందరు ప్రచారం చేస్తున్నారని గంటా ప్రస్తావించారు. విశాఖపట్నంలో ఒక ఎంపీ...తన నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలందరితో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించడం, దానికి అంతా హాజరు కావడం బట్టి ఎటువంటి అంతరాలు లేవని స్పష్టమవుతుందని, దీనిని అంతా అర్థం చేసుకోవాలని కోరారు. రాష్ట్రం, జిల్లా ఏ విధంగా అభివృద్ధి చేయాలనే దానిపైనే కూటమి నాయకులంతా ఆలోచిస్తున్నామని, ఈ సమావేశంలో బీజేపీ, జనసేన ఎమ్మెల్యేలు కూడా ఉన్నారని విష్ణుకుమార్‌రాజు, వంశీకృష్ణ శ్రీనివాస్‌లను చూపించారు.