సంతృప్తిగా సేవలు అందించాను
ABN , Publish Date - Sep 23 , 2026 | 12:43 AM
జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా ఐదేళ్లపాటు సంతృప్తికరంగా సేవలు అందించానని, సహచర జడ్పీటీసీ సభ్యులతోపాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారుల సహకారంతో అంకిత భావంతో పనిచేశానని జల్లిపల్లి సుభద్ర అన్నారు.
పదవి లేకపోయినా ప్రజాసేవలో ఉంటా
జడ్పీ చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర
విశాఖపట్నం, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా ఐదేళ్లపాటు సంతృప్తికరంగా సేవలు అందించానని, సహచర జడ్పీటీసీ సభ్యులతోపాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారుల సహకారంతో అంకిత భావంతో పనిచేశానని జల్లిపల్లి సుభద్ర అన్నారు. మంగళవారం జరిగిన జడ్పీ సర్వసభ్య సమావేశానికి అధ్యక్షత వహించిన ఆమె మాట్లాడుతూ, మూడు జిల్లాల కలెక్టర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి అనేక సమస్యలపై చర్చించి వాటి పరిష్కారానికి పాటుపడ్డానన్నారు. ఇక్కడ జడ్పీ సమావేశంలో చర్చించిన కొన్ని అంశాలను చట్టసభల్లో ప్రస్తావించారని గుర్తుచేశారు. పదవిలో లేకున్నా ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి తన వంతు సేవలు అందిస్తానని అన్నారు.
రాజ్యసభ్య సభ్యుడు గొల్ల బాబూరావు మాట్లాడుతూ, ప్రజాజీవితంలో నాయకుల రాజకీయ ప్రస్థానానికి పంచాయతీరాజ్ వ్యవస్థ పునాది అని అభివర్ణించారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో సమర్థంగా అమలు చేయడానికి పంచాయతీరాజ్ వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ, విశాఖ జిల్లా పరిషత్‌తో తమ కుటుంబానికి నాలుగు దశాబ్దా అనుబంధం ఉందని గుర్తుచేశారు. తాను పరవాడ ఎంపీపీగా పనిచేసే సమయంలో ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం వచ్చిందని, తన తండ్రి జిల్లా బోర్డు సభ్యుడిగా పనిచేశారని అన్నారు. పదవీకాలం ముగిసిందని నిరాశ చెందకుండా నిరంతరం ప్రజల్లో ఉంటే భవిష్యత్తులో ఉన్నత పదవులు వరిస్తాయని అన్నారు. విశాఖలోని జడ్పీ ఆస్తులపై మూడు జిల్లాలకు హక్కు ఉంటుందని, ఇక్కడ వున్న అతిఽథిగృహాలను అనకాపల్లి, అల్లూరి జిల్లాల నుంచి వచ్చే ప్రజాప్రతినిధులకు కేటాయించాలని అధికారులను కోరారు. అనంతరం జడ్పీ చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర దంపతులను ఎంపీ బాబూరావు, ఎమ్మెల్యే బండారు, ఇతర సభ్యులు సత్కరించారు. తరువాత జడ్పీటీసీ సభ్యులను సత్కరించి జ్ఞాపికలు అందించారు. సమావేశంలో ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, జడ్పీ వైస్‌చైర్‌పర్సన్ డీవీ సత్యవతి, సీఈవో నారాయణమూర్తి, డిప్యూటీ సీఈవో రాజకుమార్, వెలమ కార్పొరేషన్ చైర్మన్ పీవీజీ కుమార్, పాడేరు ఐటీడీఎ పీవో ఆదిత్య వర్మ, ఇతర అధికారులు పాల్గొన్నారు.