Share News

పద్మావతి అనే నేను..

ABN , Publish Date - Nov 24 , 2026 | 01:40 AM

నర్సీపట్నం మునిసిపల్‌ చైర్‌పర్సన్‌గా చింతకాయల పద్మావతి సోమవారం ఇక్కడ ప్రమాణస్వీకారం చేశారు.

పద్మావతి అనే నేను..

నర్సీపట్నం మునిసిపల్‌ చైర్‌పర్సన్‌గా ప్రమాణస్వీకారం

ఎక్స్‌ అఫీషియో సభ్యునిగా ఎంపీ విజయ్‌

ముఖ్యఅతిథిగా హాజరైన స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు

కౌన్సిలర్ల ప్రమాణస్వీకారం అనంతరం బయటకు వెళ్లిపోయిన టీడీపీ సభ్యులు

కోరం లేకపోవడంతో వైస్‌చైర్మన్‌ ఎన్నిక నేటికి వాయిదా

నర్సీపట్నం, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి):

నర్సీపట్నం మునిసిపల్‌ చైర్‌పర్సన్‌గా చింతకాయల పద్మావతి సోమవారం ఇక్కడ ప్రమాణస్వీకారం చేశారు. మునిసిపల్‌ కార్యాలయం సమావేశ మందిరంలో ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగా, వేడుకగా నిర్వహించారు. తొలుత చైర్‌పర్సన్‌ పద్మావతి, రాజ్యసభ సభ్యుడు విజయ్‌తో కలిసి సమావేశ మందిరంలోకి వచ్చారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌, స్థానిక ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్నపాత్రుడు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ప్రిసైడింగ్‌ అధికారి వీవీరమణ తొలుత చైర్‌పర్సన్‌గా చింతకాయల పద్మావతితో ప్రమాణ స్వీకారం చేయించారు. తరువాత రాజ్యసభ సభ్యుడు చింతకాయల విజయ్‌ ఎక్స్‌ అఫీషియో సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. పిమ్మట కౌన్సిలర్లతో ప్రమాణం స్వీకారం చేయించారు. ఏకైక వైసీపీ కౌన్సిలర్‌ కరణం అమ్మాజీ సమావేశ మందిరం నుంచి బయటకు వెళ్లిపోయారు. కొద్దిసేపటి తరువాత మునిసిపల్‌ వైస్‌చైర్మన్‌ ఎన్నిక ప్రక్రియ మొదలయ్యే సమయానికి టీడీపీ కౌన్సిలర్లతోపాటు ఇద్దరు ఇండిపెండెంట్‌ కౌన్సిలర్లు ఒక్కొక్కరుగా బయటకు వెళ్లిపోయారు. సమావేశ మందిరంలో జనసేన పార్టీ నుంచి గెలిచిన అద్దెపల్లి సౌజన్య, సురకాసుల గోపి, ఆదపురెడ్డి రామకృష్ణ మాత్రమే మిగిలిచారు.

వైస్‌ చైర్మన్‌ ఎన్నిక వాయిదా

కూటమి పొత్తులో భాగంగా నర్సీపట్నం మునిసిపల్‌ వైస్‌చైర్మన్‌ పదవిని జనసేనకు కేటాయించారు. దీంతో ఈ పదవికి ఆ పార్టీకి చెందిన 13వ వార్డు కౌన్సిలర్‌ అద్దేపల్లి సౌజన్య పేరుని పార్టీ అధిష్ఠానం ఆదివారం రాత్రి ప్రకటించింది. ఈ మేరకు అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ కార్యాలయం నుంచి పార్టీ రాష్ట్ర కార్యదర్శి సంతకంతో ఉన్న బీ ఫారం జారీ అయ్యింది. కానీ అనూహ్యంగా వైస్‌చైర్మన్‌ ఎన్నిక ప్రక్రియ మొదలయ్యే సమయానికి టీడీపీతోపాటు ఇండిపెండెంట్‌ కౌన్సిలర్లు సమావేశమందిరం నుంచి బయటకు వెళ్లిపోయారు. తర్వాత ప్రిసైడింగ్‌ అధికారి వీవీ రమణ మీడియాతో మాట్లాడుతూ, వైస్‌ చైర్మన్‌ పదవికి పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల నిబంధనల ప్రకారం సోమవారం ఉదయం 10 గంటలలోపు బీ ఫారం అందజేయాలని, కానీ జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గం స్థానిక ఎన్నికల సమన్వయకర్త అప్పన దొరబాబు మధ్యాహ్నం 12.24 గంటలకు అద్దేపల్లి సౌజన్య పేరుతో బీ ఫారం అందించారని చెప్పారు. అంతేకాక వైస్‌చైర్మన్‌ ఎన్నికల నిర్వహించాలంటే మొత్తం సభ్యుల్లో సగం మంది సమావేశానికి హాజరుకావాలని, కానీ ముగ్గురు మాత్రమే వుండడంతో కోరం చాలక.. వైస్‌చైర్మన్‌ ఎన్నికను మంగళవారానికి వాయిదా వేశామని తెలిపారు.


వరుసగా మూడోసారి పట్టణ ప్రథమ పౌరురాలిగా బాధ్యతలు

అనంతరం టీడీపీ, బీజేపీ, స్వతంత్ర కౌన్సిలర్ల ప్రమాణం

జనసేన, వైసీపీ కౌన్సిలర్లు గైర్హాజరు

కోరం లేకపోవడంతో వైస్‌చైర్మన్‌ ఎన్నిక నేటికి వాయిదా

ఎలమంచిలి, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): ఎలమంచిలి మునిసిపల్‌ చైర్‌పర్సన్‌గా పిల్లా రమాకుమారి సోమవారం ఇక్కడ ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో రమాకుమారి కూటమి మద్దతుతో బీజేపీ తరపున పోటీ చేసి విజయంసాధించిన విషయం తెలిసిందే. వరుసగా మూడోసారి చైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టిన ఆమె హ్యాట్రిక్‌ రికార్డు సాధించారు. అంతకుముందు మునిసిపల్‌ కార్యాలయం సమావేశ మందిరంలో ప్రిసైడింగ్‌ అధికారి అయిన అడ్డురోడ్డు ఆర్డీవో వెంకట రామలక్ష్మి, మునిసిపల్‌ కమిషనర్‌ ప్రసాదరాజు పర్యవేక్షణలో మునిసిపాలిటీ నూతన పాలకవర్గం ప్రమాణస్వీకారం కోసం ఉదయం 11 గంటలకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. చైర్‌పర్సన్‌ రమాకుమారితోపాటు టీడీపీకి చెందిన 12 మంది, బీజేపీకి చెందిన ఇద్దరు, ఇండిపెండెంట్‌ ఒకరు కలిపి మొత్తం 15 మంది కౌన్సిలర్లు హాజరయ్యారు. ప్రొటోకాల్‌ ప్రకారం తొలుత చైర్‌పర్సన్‌ విజేత పిల్లా రమాకుమారి చేత, అనంతరం సమావేశానికి హాజరైన 15 మంది కౌన్సిలర్‌ విజేతలతో ప్రమాణస్వీకారం చేయించారు.

చాలని కోరం.. వైస్‌చైర్మన్‌ ఎన్నిక వాయిదా

ఈ ప్రక్రియ చేపట్టే సమయానికి (మధ్యాహ్నం 12 గంటలకు) సమావేశ మందిరంలో 16 మంది సభ్యులు మాత్రమే వున్నారు. కౌన్సిలర్లు 32 మందితోపాటు ఎక్స్‌అఫీషియో సభ్యులైన చైర్‌పర్సన్‌, ఎమ్మెల్యేను కలుపుకొని మొత్తం 34 మందికి ఓటు హక్కు వుంది. వైస్‌చైర్మన్‌ ఎన్నిక నిర్వహించాలంటే వీరిలో సగం మంది.. 17 మంది హాజరుకావాలి. కానీ చైర్‌పర్సన్‌తో కలుపుకొని 16 మంది మాత్రమే వుండడంతో కోరం చాలలేదంటూ వైస్‌చైర్మన్‌ ఎన్నికను మంగళవారం ఉదయం 11 గంటలకు వాయిదా వేస్తున్నట్టు ప్రిసైడింగ్‌ అధికారి వెంకట రామలక్ష్మి ప్రకటించారు. జనసేన పార్టీకి చెందిన 11 మంది, వైసీపీకి చెందిన ఆరుగురు కౌన్సిలర్లు ఈ సమావేశానికి హాజరుకాలేదు.

Updated Date - Nov 24 , 2026 | 01:40 AM