హైబ్రిడ్ మహానాడు
ABN , Publish Date - May 25 , 2026 | 12:19 AM
ఇంధన వనరులను ఆదా చేయాలన్న ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఈసారి మహానాడును హైబ్రిడ్ పద్ధతిలో (వర్చువల్‌గా) నిర్వహిస్తున్నట్టు తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు, హోం మంత్రి వంగలపూడి అనిత చెప్పారు. ఆదివారం ఇక్కడ తన క్యాంపు కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఈ నెల 27, 28 తేదీల్లో క్లస్టర్ స్థాయిల్లో మహానాడు సమావేశాలు జరుగుతాయని చెప్పారు.
ఇంధన ఆదా కోసం పార్టీ అధిష్ఠానం నిర్ణయం
ఆడపిల్లలపై దుష్ప్రచారం వైసీపీ నేతలకు తగదు
టీడీనీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు వంగలపూడి అనిత
నక్కపల్లి, మే 24 (ఆంధ్రజ్యోతి): ఇంధన వనరులను ఆదా చేయాలన్న ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఈసారి మహానాడును హైబ్రిడ్ పద్ధతిలో (వర్చువల్‌గా) నిర్వహిస్తున్నట్టు తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు, హోం మంత్రి వంగలపూడి అనిత చెప్పారు. ఆదివారం ఇక్కడ తన క్యాంపు కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఈ నెల 27, 28 తేదీల్లో క్లస్టర్ స్థాయిల్లో మహానాడు సమావేశాలు జరుగుతాయని చెప్పారు. పుష్కర కాలం క్రితం తెలుగుదేశం పార్టీలో ఒక సాధారణ కార్యకర్తగా చేరిన తనకు పార్టీ అధిష్ఠానం రెండుసార్లు పొలిట్‌బ్యూరో సభ్యురాలిగా అవకాశం కల్పించడం అదృష్టంగా భావిస్తున్నట్టు తెలిపారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేశ్‌కు రుణపడి వుంటానన్నారు. పాయకరావుపేటలో 11 ఏళ్ల దళిత బాలికపై అత్యాచారం జరిగినట్టు వైసీపీ నాయకులు అసత్య ప్రచారం చేశారని, అత్యాచారం ఎక్కడ జరిగింది? పోలీసులుగానీ, వైద్యులుగానీ నిర్ధారించారా? అని ఆమె ప్రశ్నించారు. ఇటువంటి చౌకబారు ప్రచారం చేసే వారు కూడా వారిళ్లల్లో ఆడబిడ్డలు ఉన్నారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. అంతకుముందు పార్టీ నాయకులతో కలిసి మహానాడు పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గం కన్వీనర్ వెంకటేశ్, జిల్లా ప్రధాన కార్యదర్శి లాలం కాశీనాయుడు, ఉపాధ్యక్షుడు కురందాసు నూకరాజు, నాయకులు దేవర సత్యనారాయణ, అమలకంటి అబద్ధం, లింగన్ననాయుడు, గింజాల లక్ష్మణరావు, ప్రదీప్, వినోద్‌రాజు, కొప్పిశెట్టి బుజ్జి, గుర్రం రామకృష్ణ, దార్ల కృష్ణ, తుమ్మపాల నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.