మచ్చుకైనా కానరాని మానవత్వం
ABN , Publish Date - Jun 11 , 2026 | 01:16 AM
విశాఖపట్నం స్టీల్ ప్లాంటులో మానవ వనరుల (హెచ్‌ఆర్) విభాగం పనితీరు అత్యంత అధ్వానంగా ఉంది. అక్కడి అధికారుల్లో మానవత్వం మచ్చుకైనా కనిపించడం లేదు. కారుణ్య నియామకాల్లోను కాఠిన్యం ప్రదర్శిస్తున్నారు. ఏడాది క్రితం ప్రమాదంలో చనిపోయిన ఉద్యోగికి సంబంధించిన ఫైల్ పోయిందని ఆరు నెలలు తిప్పించుకున్నారని బాధిత కుటుంబం ఇప్పుడు రోడ్డు ఎక్కడంతో ఆ విభాగం పనితీరు చర్చనీయాంశంగా మారింది. ఏడాది నుంచి ఆ కుటుంబాన్ని పట్టించుకోని అధికారులు బుధవారం ఉదయం ఫోన్ చేసి, ఉద్యోగం ఇస్తామని రమ్మని పిలవడం అందరినీ ఆలోచనలో పడేసింది.
కారుణ్య నియామకాల్లోను కాఠిన్యం
రిటైర్డ్ ఉద్యోగులకు ప్లాంటులోకి నో ఎంట్రీ
ఇదీ ఉక్కు మానవ వనరుల విభాగం తీరు
ఉద్యోగులు, కార్మికుల్లో తీవ్ర అసంతృప్తి
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
విశాఖపట్నం స్టీల్ ప్లాంటులో మానవ వనరుల (హెచ్‌ఆర్) విభాగం పనితీరు అత్యంత అధ్వానంగా ఉంది. అక్కడి అధికారుల్లో మానవత్వం మచ్చుకైనా కనిపించడం లేదు. కారుణ్య నియామకాల్లోను కాఠిన్యం ప్రదర్శిస్తున్నారు. ఏడాది క్రితం ప్రమాదంలో చనిపోయిన ఉద్యోగికి సంబంధించిన ఫైల్ పోయిందని ఆరు నెలలు తిప్పించుకున్నారని బాధిత కుటుంబం ఇప్పుడు రోడ్డు ఎక్కడంతో ఆ విభాగం పనితీరు చర్చనీయాంశంగా మారింది. ఏడాది నుంచి ఆ కుటుంబాన్ని పట్టించుకోని అధికారులు బుధవారం ఉదయం ఫోన్ చేసి, ఉద్యోగం ఇస్తామని రమ్మని పిలవడం అందరినీ ఆలోచనలో పడేసింది.
అంతా వారే చేయాలి
స్టీల్ ప్లాంటు ఉద్యోగి ఎవరైనా ప్లాంటులో చనిపోతే వెంటనే హెచ్‌ఆర్ విభాగం సిబ్బంది వారి ఇంటికి వెళ్లి దహన సంస్కారాలకు తగిన సాయం చేసేవారు. అయితే గత ఐదేళ్ల నుంచి ఆ మొత్తం నాయకులతోను, ఇంకెవరితోనో అందిస్తున్నారు. వారు వెళ్లడం లేదు. అన్ని కర్మకాండలు పూర్తయిన తరువాత బాధిత కుటుంబం వద్దకు వెళ్లి సంస్థ తరపున ఏయే ప్రయోజనాలు వస్తాయో వివరించి, వాటికి దరఖాస్తులు తీసుకోవాలి. అవసరమైన పత్రాలు సమర్పించాలని సూచించాలి. గతంలో ఇలా జరిగేది. ఇప్పుడు బాధిత కుటుంబమే కార్యాలయం చుట్టూ తిరగాల్సి వస్తోంది. అప్పుడు కూడా సరిగా స్పందించడం లేదు. కొందరికి ఫైళ్లు పోయాయని, వెదుకుతున్నామని సమాధానాలు చెబుతున్నారు. ఒకవేళ ఫైల్ కనిపించకపోయినా కంప్యూటర్‌లో వెదికితే రెండు మూడు గంటల్లో అన్ని వివరాలు దొరుకుతాయి. కానీ దానికి నెలల తరబడి తిప్పించుకుంటున్నారు. ప్రయోజనాల కోసం డెత్ సర్టిఫికెట్, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్లు అవసరం. అవి రావడం కొంచెం ఆలస్యమైతే...మూడు నెలల సమయం దాటిపోయిందని, ఏ ప్రయోజనాలు రావని కుటుంబ సభ్యులను భయపెడుతున్నారు. ఫైల్ ఆపేస్తున్నారు. తండ్రి చనిపోయినప్పుడు వారి కుటుంబంలో ఎవరైనా 18 ఏళ్లు దాటి, చదువుకున్న వారు ఉంటే ఉద్యోగం ఇస్తారు. ఆ విషయంలోను సహకరించడం లేదు. విధుల్లో చనిపోయినా, తగిన న్యాయం చేయలేదని కార్మిక సంఘాలు కార్మిక శాఖకు, ఫ్యాక్టరీస్ విభాగానికి ఫిర్యాదు చేస్తే కోర్టుల్లో కేసులు వేస్తున్నారే తప్ప వారికి న్యాయం చేయడం లేదు.
వారికి నో ఎంట్రీ
రిటైర్డ్ ఉద్యోగులు ఎవరైనా వారి ప్రయోజనాల కోసం ప్లాంటుకు వెళ్లి మాట్లాడాలని అనుకుంటే వారిని లోపలకు రానివ్వడం లేదు. పే సెక్షన్ నుంచి ఎవరితోనైనా అడ్మిన్ భవనానికి మెయిల్ పెట్టిస్తే అప్పుడు అనుమతిస్తున్నారు. పదేళ్ల క్రితం రిటైరైన వారికి పే సెక్షన్‌లో ఎవరు పనిచేస్తున్నారో తెలియని పరిస్థితి. గతంలో ఐడీ కార్డు చూపిస్తే పంపేవారు. ఇప్పుడు పంపడం లేదు. కనీసం బాధలు చెప్పుకునే అవకాశం కూడా ఇవ్వడం లేదు.
ఈడీఎల్‌ఐలు పదుల సంఖ్యలో పెండింగ్
ఉక్కు ఉద్యోగులకు ప్రావిడెంట్ ఫండ్ నుంచి ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ (ఈడీఎల్‌ఐ) అని ఒక పథకం ఉంది. ఎవరైనా చనిపోతే, వారి వివరాలు ఆ శాఖకు పంపితే రూ.7 లక్షలు వస్తుంది. ఇందులో స్టీల్ ప్లాంటు నుంచి రూపాయి కూడా ఉండదు. కేవలం ఉద్యోగి వివరాలు పంపితే సరిపోతుంది. వాటిని పంపడానికి కూడా హెచ్‌ఆర్ విభాగం ఆసక్తి చూపడం లేదు. నెలల తరబడి జాప్యం చేస్తోంది. పదుల సంఖ్యలో ఇలాంటి దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని విశాఖ ఉక్కు అధికారుల సంఘం ప్రతినిధి ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. వారి శాఖ పేరులో తప్ప మనుషుల్లో ఎక్కడా మానవత్వం లేదని ఉద్యోగ వర్గాలు ఆరోపిస్తున్నాయి. మరణించిన కుటుంబాలకు ‘అంజలి’ ఘటించరని, ఉద్యోగుల పట్ల ఏమాత్రం ‘వినయం’ చూపరని, ఇప్పటికైనా మారాలని ఉద్యోగ వర్గాలు కోరుతున్నాయి.
ఒక మిషన్‌లో ఉత్పత్తి ప్రారంభం
స్టీల్‌ప్లాంటు ఎస్‌ఎంఎస్ విభాగంలోని సీసీడీలో బుధవారం సాయంత్రం ఒక మిషన్ పనిచేయడం ప్రారంభించింది. విభాగంలోని ఆరు మిషన్‌లు ఉంటాయి. అయితే వీటిలో నిత్యం ఐదు పనిచేస్తాయి. సోమవారం ప్రమాద సమయంలో 2, 3, 4 మిషన్‌లు ఉత్పత్తి ప్రక్రియలో ఉన్నాయి. వీటిలో రెండో మిషన్‌లో ప్రమాదం సంభవించింది. దీంతో మిగతా మిషన్‌లలో ఉత్పత్తి నిలిచిపోయింది. యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టిన యాజమాన్యం మిషన్-6లో బుధవారం సాయంత్రం ఉత్పత్తి ప్రారంభించింది.