గిరిజనుల భారీ ర్యాలీ
ABN , Publish Date - Jul 09 , 2026 | 12:03 AM
షెడ్యూల్డ్ ప్రాంతంలో అమలులో ఉన్న భూ బదలాయింపు చట్టాన్ని కాపాడుకునేందుకు ఆదివాసీలు కదలిరావాలని అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు మాసాడ ఈశ్వరరావు పిలుపునిచ్చారు.
భూ బదలాయింపు చట్టాన్ని కాపాడుకునేందుకు ఆదివాసీలు కదలిరావాలి
గిరిజన ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఈశ్వరరావు
చింతపల్లి, జూలై 8 (ఆంధ్రజ్యోతి): షెడ్యూల్డ్ ప్రాంతంలో అమలులో ఉన్న భూ బదలాయింపు చట్టాన్ని కాపాడుకునేందుకు ఆదివాసీలు కదలిరావాలని అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు మాసాడ ఈశ్వరరావు పిలుపునిచ్చారు. బుధవారం కొయ్యూరు, జీకేవీధి, చింతపల్లి మండలాల ఆదివాసీలు, వివిధ సంఘాలు, పార్టీల నాయకులు దేశ అత్యున్నత న్యాయస్థానంలో గిరిజనేతరులు భూబదలాయింపు చట్టానికి వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటీషన్‌కి వ్యతిరేకంగా చింతపల్లి గిరిజన ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేశారు. జాతీయ రహదారిపై మానవహారంగా ఏర్పడ్డారు. ఈ సందర్భంగా ఈశ్వరరావు మాట్లాడుతూ భూ బదలాయింపు చట్టం ఉమ్మడి తెలుగు రాష్ట్రాల షెడ్యూల్డ్ ప్రాంతాల్లో అమలులో వుందన్నారు. ఆదివాసీల భూములను కాపాడేందుకు ప్రభుత్వం రూపొందించిన అత్యంత కీలకమైన చట్టమన్నారు. అయితే ఈ చట్టాన్ని రద్దు చేయాలని 1,700 మంది గిరిజనేతరులు దేశ అత్యున్నత న్యాయస్థానంలో పిటీషన్ వేశారన్నారు. దీన్ని ఆదిలోనే అడ్డుకోవాలని, లేదంటే గిరిజనుల భూములకు రక్షణ లేకుండా పోతుందన్నారు. ఆదివాసీ జేఏసీ కన్వీనర్ రామారావుదొర, భారత ఆదివాసీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మొట్టడం రాజబాబు మాట్లాడుతూ ఆదివాసీలు ఆగస్టు 7న పాడేరులో జరిగే ఆదివాసీ ఆత్మగౌరవ సభకు హాజరై మన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు లోచలి రామకృష్ణ, అసోసియేట్ అధ్యక్షుడు గెమ్మెలి మోహన్‌రావు, జిల్లా కార్యదర్శి చింతర్ల సతీశ్‌కుమార్, మండల గౌరవ అధ్యక్షుడు బౌడు గంగరాజు, మండలాధ్యక్షుడు కిట్లంగి ప్రసాద్, ప్రధాన కార్యదర్శి చింతర్ల మధుబాబు, ఎంపీపీ కోరాబు అనూషదేవి, జడ్పీటీసీ సభ్యుడు పోతురాజు బాలయ్య, కాంగ్రెస్, సీపీఎం జిల్లా నాయకులు సతక బుల్లిబాబు, కంకిపాటి వీరన్నపడాల్, రీమల నవభరత్, బోనంగి చిన్నయ్య పడాల్, అధిక సంఖ్యలో ఆదివాసీలు పాల్గొన్నారు.