Share News

భారీగా పెరిగిన విద్యుత్‌ వినియోగం

ABN , Publish Date - Apr 20 , 2026 | 01:20 AM

లు పెరగడంతో వినియోగం అదే స్థాయిలో పెరిగింది. ఉక్కపోత కారణంగా ఏసీలు, ఫ్యాన్లు ఎక్కువగా వినియోగించారు. ఈ నెల 16న ఒక్క రోజులో పెదబొడ్డేపల్లి, బలిఘట్టం, నర్సీపట్నం 33/11 కేవీ సబ్‌ స్టేషన్ల మీద 27.2 మెగావాట్ల విద్యుత్‌ లోడు నమోదైంది.

భారీగా పెరిగిన విద్యుత్‌ వినియోగం
పెదబొడ్డేపల్లిలోని 33/11 కేవీ సబ్‌ స్టేషన్‌

- ఉష్ణోగ్రతలు పెరగడంతో అధిక వాడకం

- 48 రోజుల్లో 510 లక్షల యూనిట్లు ఖర్చు

నర్సీపట్నం, ఏప్రిల్‌ 19 (ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది విద్యుత్‌ వినియోగం భారీగా పెరిగింది. మార్చి నెల నుంచి ఉష్ణోగ్రతలు పెరగడంతో వినియోగం అదే స్థాయిలో పెరిగింది. ఉక్కపోత కారణంగా ఏసీలు, ఫ్యాన్లు ఎక్కువగా వినియోగించారు. ఈ నెల 16న ఒక్క రోజులో పెదబొడ్డేపల్లి, బలిఘట్టం, నర్సీపట్నం 33/11 కేవీ సబ్‌ స్టేషన్ల మీద 27.2 మెగావాట్ల విద్యుత్‌ లోడు నమోదైంది. ట్రాన్స్‌ఫార్మర్ల లోడు సామర్ధ్యానికి మించి విద్యుత్‌ ఖర్చు పెరిగిందని ఈపీడీసీఎల్‌ ఏడీ త్రినాథరావు తెలిపారు. దీని ప్రభావంతో అన్ని ప్రాంతాల్లో లోఓల్టేజీ సమస్య అధికమైంది. నర్సీపట్నం ఏపీఈపీడీసీఎల్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ పరిధిలోని నర్సీపట్నం, చోడవరం, మాడుగుల నియోజకవర్గాలు, పాయకరావుపేట మండలంలోని కోటవురట్ల మండలం కలిపి 13 మండలాల్లో 33/11 కేవీ సామర్థ్యంతో 36 సబ్‌స్టేషన్లు ఉన్నాయి. 8 ఎంవీఏ సామర్ధ్యం గల 54 ట్రాన్స్‌ఫార్మర్ల ద్వారా 3 లక్షల మంది విద్యుత్‌ వినియోగదారులకు నిరంతరం విద్యుత్‌ సరఫరా చేస్తున్నారు. సాధారణంగా గృహ వినియోగం మీటర్లకు దరఖాస్తు చేసుకున్నప్పుడు మూడు ఫ్యాన్లు, ఐదారు లైట్లు, ఒక మిక్సీ వాడతామని లెక్కలు (2 కేవీ) చూపిస్తారు. ఈ మేరకు విద్యుత్‌ అధికారులు ఆయా ప్రాంతాల్లో విద్యుత్‌ వినియోగం అంచనా వేసి ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేస్తారు. తర్వాత ఏసీలు, వాషింగ్‌ మెషీన్లు తదితర ఎలకా్ట్రనిక్‌ సామగ్రి వినియోగం పెరిగిపోతుంది. ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యానికి మించి ఓవర్‌ లోడు పడి ట్రిప్‌ అవ్వడం, లోఓల్టేజీ సమస్య ఉత్పన్నం కావడం జరుగుతుందని ఏపీఈపీడీసీఎల్‌ అధికారులు చెబుతున్నారు. గత ఏడాది కంటే ఈ సంవత్సరం 15 నుంచి 20 శాతం కరెంటు వినియోగం పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. నర్సీపట్నం డివిజనల్‌ పరిధిలో 1,200 ఓవరల్‌ లోడు కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. విద్యుత్‌ వినియోగదారులు రూ.4 కోట్లు ఓవర్‌ లోడ్‌ చార్జీలు చెల్లించాల్సి ఉంది. నర్సీపట్నం, చోడవరం, మాడుగుల నియోజకవర్గాలు, పాయకరావుపేటలోని కోటవురట్ల మండలాల ప్రజలు ఈ ఏడాది మార్చి నుంచి ఏప్రిల్‌ 18 వరకు 48 రోజులకు 510 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను వినియోగించారు. మార్చి ఒక్క నెలలోనే 31 లక్షల యూనిట్లు ఖర్చు చేశారని అధికారులు తెలిపారు.

Updated Date - Apr 20 , 2026 | 01:20 AM