జడ్పీటీసీ స్థానాలకు భారీ పోటీ
ABN , Publish Date - Oct 24 , 2026 | 12:23 AM
నూతనంగా ఏర్పడిన జిల్లా పరిషత్ పీఠంపై అన్ని రాజకీయ పార్టీలు కన్నేశాయి. పాడేరు కేంద్రంగా 2022లోనే నూతన జిల్లా ఏర్పడినప్పటికీ 2026లో జిల్లాపరిషత్ ఏర్పడింది.
నామినేషన్లు వేసిన ప్రముఖులు
అందరి చూపు జడ్పీ పీఠంపైనే..
పాడేరు, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి):
నూతనంగా ఏర్పడిన జిల్లా పరిషత్ పీఠంపై అన్ని రాజకీయ పార్టీలు కన్నేశాయి. పాడేరు కేంద్రంగా 2022లోనే నూతన జిల్లా ఏర్పడినప్పటికీ 2026లో జిల్లాపరిషత్ ఏర్పడింది. దీంతో ఈ ఎన్నికల్లో అధికంగా జడ్పీటీసీ స్థానాలను సాధించి, చైర్మన్ పీఠాన్ని చేజిక్కించుకోవాలని అధికార, విపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జడ్పీటీసీ స్థానాలను గెలుపొందాలనే లక్ష్యంతో కూటమి, వైసీపీ నేతలు ముమ్మరంగా వ్యూహాలు రచిస్తున్నారు.
జడ్పీటీసీ బరిలో పలువురు ప్రముఖులు
తాజా పరిణామాల నేపథ్యంలో జిల్లాలో జడ్పీటీసీ స్థానాలకు గతానికి భిన్నంగా ఎక్కువగా పోటీ పెరిగింది. దీంతో 11 స్థానాలకు సుమారుగా 120 నామినేషన్లు దాఖలయ్యాయి. వాటిలో ప్రముఖులు, సీనియర్ రాజకీయ నేతలుండడం విశేషం. కొయ్యూరు జడ్పీటీసీ స్థానానికి మాజీ ఎంపీ గొడ్డేటి మాధవీ (వైసీపీ), జీసీసీ మాజీ చైర్మన్ ఎంవీఎస్.ప్రసాద్ సోదరి హిమబిందు(టీడీపీ) నామినేషన్లు దాఖలు చేయగా, పాడేరు స్థానానికి మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి కుమార్తె ప్రీతి మధుమతి(టీడీపీ), జనసేన సీనియర్ నేతలు సీదరి రామ్మూరి, బొంకుల దివ్యలత, బీజేపీ సీనియర్ నేత నందోలు ఉమామహేశ్వరరావు నామినేషన్లు వేశారు. అలాగే బీజేపీ జిల్లా అధ్యక్షురాలు మఠం శాంతకుమారి, ఎస్‌టీ కమిషన్ మాజీ సభ్యురాలు లిల్లీ సురేశ్(వైసీపీ) హుకుంపేటలో నామినేషన్లు దాఖలు చేయగా, ముంచంగిపుట్టు స్థానానికి టీడీపీ సీనియర్ నేత పాంగి పాండురంగస్వామి, జడ్పీ మాజీ చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర(వైసీపీ), చింతపల్లి స్థానానికి తాజా మాజీ ఎంపీపీ కోరాబు అనూషదేవి(వైసీపీ), అరకులోయ జడ్పీటీసీ స్థానానికి తాజా మాజీ సర్పంచ్ పెట్టెలి దాసుబాబు(టీడీపీ), తాజా మాజీ జడ్పీటీసీ సభ్యురాలు శెట్టి రోషిణి భర్త కంబిడి అశోక్ (వైసీపీ) నామినేషన్లు వేశారు.