Share News

అనర్హులకు హుద్‌హుద్‌ ఇళ్లు!

ABN , Publish Date - Mar 13 , 2026 | 01:15 AM

హుద్‌హుద్‌ బాధితుల కోసం అప్పటి పాలకులు నిర్మించిన ఇళ్ల కేటాయింపులో అనేక అక్రమాలు జరిగాయి.

అనర్హులకు హుద్‌హుద్‌ ఇళ్లు!

వైసీపీ హయాంలో తప్పుడు పట్టాలతో ఇళ్లు కేటాయింపు

వైసీపీ నేతలతో హౌసింగ్‌ అధికారుల కుమ్మక్కు

బక్కన్నపాలెంలో రూ.5 లక్షలు చొప్పున వసూలు

ఫైనాపిల్‌ కాలసీలో తొలుత ఎంపిక చేసిన లబ్ధిదారుల జాబితానే మార్చేశారు

అక్కడ కూడా రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలు కలెక్షన్‌

విచారణలో వెల్లడి

విశాఖపట్నం, మార్చి 11 (ఆంధ్రజ్యోతి):

హుద్‌హుద్‌ బాధితుల కోసం అప్పటి పాలకులు నిర్మించిన ఇళ్ల కేటాయింపులో అనేక అక్రమాలు జరిగాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీకి చెందిన ఒక చోటా నేత, హౌసింగ్‌ అధికారులు కుమ్మక్కై నకిలీ పట్టాలు సృష్టించి వాటి ఆధారంగా ఇళ్లు కేటాయించారు. అలా కేటాయించిన ఒక్కొక్క ఇంటికి రూ.ఐదు లక్షల నుంచి రూ.10 లక్షల వరకు వసూలుచేశారు.

బక్కన్నపాలెంలో నవోదయ విద్యాలయం పక్కన తెలుగు సినీ పరిశ్రమ అసోసియేషన్‌ నిధులతో 320 ఫ్లాట్ల నిర్మాణం చేపట్టారు. అయితే 2019లో ఎన్నికలు వచ్చేసరికి నిర్మాణం పూర్తికాకపోవడంతో అప్పటి ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల నుంచి లబ్ధిదారుల పేర్లు ఇవ్వలేకపోయారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆ పార్టీ నాయకుడొకరి కన్ను బక్కన్నపాలెం కాలనీపై పడింది. చుట్టూ ప్రహరీ, పూర్తిస్థాయి సదుపాయాలతో పోష్‌ లొకాలిటీకి ఆనుకుని ఉన్న కాలనీలో కొన్ని ఇళ్లు నకిలీ పట్టాలతో విక్రయించారు. చోటా నేతకు అప్పటి హౌసింగ్‌ అధికారులు సహకరించారు. ప్రస్తుతం కూటమి ఎమ్మెల్యేలు కొందరు బక్కన్నపాలెం కాలనీలో ఇళ్ల కోసం హౌసింగ్‌ అధికారులను సంప్రతించడంతో అక్కడ తాజా స్థితిపై విచారణ చేపట్టారు. గతంలో పనిచేసిన అధికారులు, వైసీపీ నేత కలిసి నకిలీ పట్టాలు సృష్టించి ఇళ్లు కేటాయించిన విషయం గుర్తించారు. ఒక్కొక్క ఇంటికి రూ.ఐదు లక్షల నుంచి రూ.10 లక్షలు ఇచ్చారని తేలింది. నకిలీ పట్టాలతో ఇళ్లు తీసుకోవడం చట్ట విరుద్ధమని, వారికితెలియజేసి ఇళ్లు ఖాళీ చేయాల్సిందిగా హౌసింగ్‌ అధికారులు స్పష్టంచేశారు.

ఇదిలావుండగా ముడసర్లోవ కాలనీ (పైనాపిల్‌ కాలనీ)లో హుద్‌హుద్‌ బాధితుల కోసం 320 ఇళ్లు నిర్మించారు. తుఫాన్‌కు ఇళ్లు కోల్పోయి అప్పట్లో రూ.ఐదు వేల వంతున తాత్కాలిక పరిహారం తీసుకున్న జాబితా మేరకు విశాఖ తూర్పు నియోజకవర్గంలోని వాసవానిపాలెం, శివగణేష్‌నగర్‌, జాలారి ఎండాడకు చెందిన 242 మందిని లబ్ధిదారులుగా గుర్తించారు. వారికి ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు సిఫారసు మేరకు అప్పటి అధికారులు ఇళ్లు కేటాయించారు. మిగిలిన 78 ఇళ్లను వైసీపీ ప్రభుత్వ హయాంలో వీఎంఆర్‌డీఎ చైర్‌పర్సన్‌ అక్కరమాని విజయనిర్మల సిఫారసుతో కొందరికి కలెక్టర్‌ ఇళ్లు కేటాయించారు. అయితే హౌసింగ్‌ అధికారులు చేతివాటం ప్రదర్శించి అక్కరమాని విజయనిర్మల ఇచ్చిన జాబితాలో కొన్ని పేర్లను మార్చేశారు. అలాగే 2014లో ప్రభుత్వం నుంచి తుఫాన్‌ పరిహారం తీసుకున్న 242 మందిలో సుమారు 100 మందికి బదులు పలు ప్రాంతాలకు చెందిన వ్యక్తులకు ఇళ్లు కేటాయించి ఆ మేరకు జాబితాలను ఉన్నతాధికారుల ఆమోదానికి పంపారు. ఈ వ్యవహారంలో ఒక్కొక్క ఇంటికి రూ.ఐదు లక్షల నుంచి రూ.10 లక్షల వరకూ తీసుకున్నారు. అలా కొనుగోలు చేసిన వారంతా ఆయా ఇళ్లల్లో నివాసం ఉంటున్నారు. ప్రతినెలా విద్యుత్‌ బిల్లులు చెల్లిస్తున్నారు. ఈలోగా కూటమి ప్రభుత్వం రావడంతో 320 ఇళ్లలో ఎవరెవరు ఉంటున్నారనే దానిపై వెలగపూడి రామకృష్ణబాబు సూచన మేరకు హౌసింగ్‌ అధికారులు విచారణ జరిపారు. విశాఖ తూర్పు నియోజకవర్గానికి సంబంధం లేనివారు, అనర్హులు 129 మంది ఉన్నట్టు తేల్చారు. అనర్హులను ఇళ్ల నుంచి ఖాళీ చేయించాలని నిర్ణయించిన అధికారులు, పోలీసుల సహకారం తీసుకున్నారు. అయితే రూ.లక్షలు పోసి కొనుగోలు చేసిన ఇళ్లను ఖాళీ చేయమంటే ఎలాగని కొనుగోలుదారులు వాపోతున్నారు. అనర్హులకు ఇళ్లు కేటాయించిన అప్పటి అధికారులు, వారితో కుమ్మక్కైన వైసీపీ నేతలపైనా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Updated Date - Mar 13 , 2026 | 01:15 AM