బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్
ABN , Publish Date - Mar 12 , 2026 | 01:24 AM
ప్రస్తుతం బాలికలుగా వున్న వారికి భవిష్యత్తులో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ బారినపడకుండా వుండేందుకు ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిన హెచ్‌పీవీ (గార్డసిల్) టీకా కార్యక్రమాన్ని శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు బుధవారం ప్రాంతీయ ఆస్పత్రిలో ప్రారంభించారు.
నర్సీపట్నం ఆస్పత్రిలో ప్రారంభించిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు
నర్సీపట్నం, మార్చి 11 (ఆంధ్రజ్యోతి):
ప్రస్తుతం బాలికలుగా వున్న వారికి భవిష్యత్తులో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ బారినపడకుండా వుండేందుకు ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిన హెచ్‌పీవీ (గార్డసిల్) టీకా కార్యక్రమాన్ని శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు బుధవారం ప్రాంతీయ ఆస్పత్రిలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజ్యసభ సభ్యురాలు సుధా నారాయణమూర్తి గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ గురించి పార్లమెంట్‌లో ప్రస్తావించడంతో ప్రధాని మోదీ ఉచిత హెచ్‌పీవీ టీకా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. ఈ వ్యాక్సిన్ ప్రైవేటుగా వేసుకోవాలంటే రూ.6 వేల నుంచి రూ.10 వేల వరకు ఖర్చు అవుతుందని తెలిపారు. 14 ఏళ్లు నిండి 15 ఏళ్లలోపు బాలికలకు మాత్రమే ఈ టీకా వేయాలని అన్నారు. వ్యాక్సిన్ కోసం బాలికలను ఆస్పత్రులకు రప్పించకుండా ఆయా పాఠశాలల్లోనే శిబిరాలు నిర్వహిస్తే బాగుంటుందని అన్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను తాను చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఆస్పత్రిలో ఓపీ రిసెప్షన్ నూతన కౌంటర్‌ని ప్రారంభించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ చింతకాయల పద్మావతి, డాక్టర్ సువర్ణ, ఆర్డీవో వీవీరమణ, ప్రాంతీయ ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సుధాశారద, డీపీఎం డాక్టర్ ప్రశాంతి, మునిసిపల్ కమిషనర్ సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.