బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్
ABN , Publish Date - Feb 27 , 2026 | 12:48 AM
దేశంలో గర్భాశయ ముఖద్వార (సర్వైకల్) క్యాన్సర్‌ను నియంత్రించేందుకు కేంద్రం నడుం బిగించింది.
జిల్లాలో 14 ఏళ్ల వయసు కలిగిన వారిని గుర్తించేందుకు సచివాలయాల పరిధిలో ఏఎన్‌ఎం, ఆశ వర్కర్ సర్వే
మరోవైపు విద్యా శాఖ నుంచి కూడా సమాచారం సేకరణ
9,634 మంది బాలికలు ఉన్నట్టు గుర్తింపు
తల్లి లేదా తండ్రి అనుమతి తప్పనిసరి?
విశాఖపట్నం, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి):
దేశంలో గర్భాశయ ముఖద్వార (సర్వైకల్) క్యాన్సర్‌ను నియంత్రించేందుకు కేంద్రం నడుం బిగించింది. ఇందులో భాగంంగానే హ్యూమన్ పాపిలోమా వైరస్ (హెచ్‌పీవీ) వ్యాక్సిన్‌ను ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రధాని నరేంద్రమోదీ శుక్రవారం ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో శనివారం సీఎం చంద్రబాబు నాయుడు ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించనున్నారు. తొలుత ఈ వ్యాక్సిన్‌ను 14 ఏళ్లు కలిగిన బాలికలకు అందించాలని కేంద్రం సూచించడంతో ఆ వివరాలు సేకరించే పనిలో ఆరోగ్య శాఖ నిమగ్నమైంది. గ్రామ/వార్డు సచివాలయాల పరిధిలో 14 ఏళ్ల వయసు కలిగిన బాలికలను గుర్తించేందుకు ఏఎన్‌ఎం, ఆశ వర్కర్ ఇప్పటికే సర్వేను ప్రారంభించారు. శుక్రవారంతో సర్వే పూర్తి కానుంది. మరోవైపు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల నుంచి కూడా సమాచారాన్ని సేకరించారు. విద్యాశాఖ అధికారులు ఇచ్చిన డేటా ప్రకారం జిల్లాలో 14 ఏళ్ల వయసున్న బాలికలు 9,634 మంది ఉన్నారు. వ్యాక్సినేషన్‌కు సంబంధించి పూర్తిస్థాయి ఆదేశాలు రావాల్సి ఉందని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ లూసీ తెలిపారు.
ఒకరి సమ్మతి తప్పనిసరి..
తొలుత 14 ఏళ్ల అమ్మాయిలకు మాత్రమే వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించారు. తరువాత దశలో మిగిలిన కేటగిరీలకు చెందిన అమ్మాయిలకు వ్యాక్సిన్ ఇవ్వనున్నట్టు ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. వ్యాక్సిన్ ఇచ్చేందుకు అనుగుణంగా సిబ్బందికి ఇప్పటికే శిక్షణ కూడా పూర్తిచేశారు. 0.5 ఎంఎల్ వ్యాక్సిన్‌ను ఇంజెక్షన్ రూపంలో ఇస్తారు. మూడు నెలలపాటు దేశంలో ఈ ప్రక్రియ కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రానికి సుమారు రెండు లక్షల డోసుల వ్యాక్సిన్ చేరింది. రాష్ట్ర స్థాయి నుంచి జిల్లాలకు ఇంకా సరఫరా కావాల్సి ఉంది. ఒకటి, రెండు రోజుల్లో జిల్లాకు వ్యాక్సిన్ చేరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదిలావుంటే వ్యాక్సిన్ తీసుకునే విషయంలో తల్లిదండ్రుల్లో ఒకరి సమ్మతి తప్పనిసరిగా ఉండాలన్న నిబంధనను కేంద్రం పెట్టినట్టు చెబుతున్నారు. వ్యాక్సినేషన్‌కు సంబంధించిన వివరాలను యూవిన్ డిజిటల్ పోర్టల్‌లో నమోదు చేయనున్నారు.