Share News

మందకొడిగా హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌

ABN , Publish Date - Apr 11 , 2026 | 01:01 AM

గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ బారిన పడకుండా బాలికలకు రక్షణ కల్పించేందుకు చేపట్టిన హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌ జిల్లాలో మందకొడిగా సాగుతోంది.

మందకొడిగా హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌

నెల రోజుల్లో కేవలం 4,808 మందికి మాత్రమే వ్యాక్సిన్‌

బాలికలు వారి తల్లిదండ్రుల నుంచి స్పందన కరువు

విశాఖపట్నం, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి):

గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ బారిన పడకుండా బాలికలకు రక్షణ కల్పించేందుకు చేపట్టిన హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌ జిల్లాలో మందకొడిగా సాగుతోంది. గత నెల తొమ్మిదో తేదీన ఈ కార్యక్రమం ప్రారంభమైంది. తొలి దశలో 14 ఏళ్ల వయసున్న బాలికలకు మాత్రమే వ్యాక్సిన్‌ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించడంతో ఆ మేరకు అధికారులు వివరాలు సిద్ధం చేశారు. ఆరోగ్య, విద్యా శాఖ అధికారులు సేకరించిన డేటా ప్రకారం జిల్లాలో 14 ఏళ్ల వయసున్నవారు 17,665 మంది ఉన్నారు. వారికి వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు తొలివిడతగా ఆరోగ్య శాఖ జిల్లాకు 8,136 డోసులను పంపింది. ఈ డోసులను జిల్లావ్యాప్తంగా గుర్తించిన 79 ఆరోగ్య కేంద్రాల పరిధిలోని బాలికలకు ఇవ్వాల్సి ఉంది. అయితే, గడిచిన నెల రోజుల నుంచి క్షేత్రస్థాయిలో పనిచేసే ఆరోగ్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి వ్యాక్సిన్‌ తీసుకునేందుకు రావాలని కోరుతున్నా బాలికలు ముందుకురావడం లేదు. తల్లిదండ్రులు కూడా పిల్లలకు వ్యాక్సిన్‌ ఇవ్వడం పట్ల ఆసక్తి చూపించకపోవడంతో ఈ ప్రక్రియ ముందుకుసాగడం లేదు. గడిచిన నెల రోజుల్లో జిల్లాలో 4,808 మంది (27.2 శాతం) మాత్రమే వ్యాక్సిన్‌ తీసుకున్నారు. మరో 72.8 శాతం మంది వ్యాక్సిన్‌ తీసుకోవాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు.

మరో 7,500 డోసులు

జిల్లాకు గతంలో 8,136 డోసులను పంపించిన ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు.. తాజాగా మరో 7,500 డోసులను అందించారు. ఈ డోసులను కూడా అధికారులు వ్యాక్సినేషన్‌ కేంద్రాలకు పంపిణీ చేస్తున్నారు.

సమీపంలోని కేంద్రాలకు వెళ్లి వ్యాక్సిన్‌ తీసుకోవాలి

- డాక్టర్‌ బి లూసీ కార్డీలియో, జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి

ఆరోగ్య శాఖ సిబ్బంది క్షేత్రస్థాయిలో వ్యాక్సినేషన్‌ ప్రాధాన్యం, బాలికలకు కలిగే లాభాలను చెబుతున్నారు. ప్రస్తుతం పిల్లలకు పరీక్షలు జరుగుతుండడంతో చాలా మంది ముందుకు రావడం లేదు. పరీక్షలు పూర్తయిన వెంటనే వ్యాక్సిన్‌ తీసుకుంటామని వారి తల్లిదండ్రులు చెబుతున్నారు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను దేశం నుంచి నిర్మూలించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ వ్యాక్సినేషన్‌ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.


15న జడ్పీ స్థాయీ సమావేశాలు

విశాఖపట్నం, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి):

జిల్లా పరిషత్‌ స్థాయీ సంఘ సమావేశాలు ఈనెల 15వ తేదీ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం వరకు జరుగుతాయని సీఈవో పి.నారాయణమూర్తి తెలిపారు. ఉదయం 11 గంటలకు 2, 3, 6 స్థాయీ సంఘ సమావేశాలు, మధ్యాహ్నం 12 గంటలకు 4, 5, రెండు గంటలకు 1,7 స్థాయీ సంఘ సమావేశాలు జరగనున్నాయన్నారు. చైర్‌పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర అధ్యక్షతన సమావేశాలు జడ్పీ హాలులో, ఇతర సమావేశాలు చైర్‌పర్సన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ హాలులో నిర్వహించనున్నందున జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, అధికారులు హాజరుకావాలన్నారు.


ట్రాఫిక్‌, నార్త్‌ సబ్‌ డివిజన్‌ ఏసీపీల బదిలీ

విశాఖపట్నం, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి):

నగర పోలీస్‌ కమిషనరేట్‌లో పనిచేస్తున్న ట్రాఫిక్‌ ఏసీపీ ఎస్‌.వాసుదేవ్‌, నార్త్‌ సబ్‌ డివిజన్‌ ఏసీపీగా పనిచేస్తున్న ఎస్‌.అప్పలరాజును బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. వాసుదేవ్‌ స్థానంలో ఇంటెలిజెన్స్‌ డీఎస్పీగా పనిచేస్తున్న సీహెచ్‌ రవికాంత్‌ను నియమించింది. బదిలీ జరిగిన ఎస్‌.వాసుదేవ్‌తోపాటు అప్పలరాజుకు ఇంకా ఎక్కడా పోస్టింగ్‌ ఇవ్వలేదు. ఇక కొంతకాలంగా ఖాళీగా ఉన్న స్పెషల్‌బ్రాంచి ఏసీపీ పోస్టులో వెయిటింగ్‌లో ఉన్న జి.శ్రీనివాసరావును నియమించారు.


ఎంటీఎస్‌ ఉద్యోగులకు అందని వేతనాలు

రిటైర్డు ఉద్యోగులకు జమ కాని డీఏ బకాయిలు

విశాఖపట్నం, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి):

జిల్లాలో పలు ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న మినిమం టైమ్‌ స్కేలు (ఎంటీఎస్‌) ఉద్యోగులకు మార్చి నెల జీతాలు ఇంకా అందలేదు. రెగ్యులర్‌ ఉద్యోగులకు ప్రతినెలా ఒకటి లేదా రెండో తేదీన జీతాలు, రిటైర్డు ఉద్యోగులకు పింఛన్లు జమ అవుతాయి. అయితే తాత్కాలిక విధానంలో పనిచేసే ఎంటీఎస్‌ ఉద్యోగులకు జీతాల చెల్లింపు ఒక్కోసారి ఆలస్యం అవుతుంటుంది. జిల్లాలో అన్ని ప్రభుత్వ శాఖల్లో కలిపి సుమారు 500 మంది నుంచి 800 మంది వరకు ఎంటీఎస్‌ ఉద్యోగులు ఉన్నారు. వైద్యులు, జూనియర్‌ కళాశాలల్లో అధ్యాపకులు, మరికొన్ని కేడర్‌లలో పనిచేసిన ఉద్యోగులకు రూ.30 వేల నుంచి రూ.60 వేలు, అటెండర్లు, స్వీపర్లు, ఇతర విధులు నిర్వహించే వారికి నెలకు రూ.20 వేలు ఇస్తున్నారు. ఎక్కువ మందికి వేతనం రూ.20 వేల నుంచి రూ.25 వేల మధ్య ఉంటుంది. వీరంతా పదో తేదీ వచ్చినా మార్చి నెల జీతాలు రాకపోవడంతో ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

రిటైర్డు ఉద్యోగులకు జమకాని బకాయిలు

ఈ ఏడాది సంక్రాంతి పండుగ ముందు ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 2018 నాటి డీఏ బకాయిలు విడుదల చేశారు. ఉద్యోగులు, టీచర్ల ఖాతాలకు డీఏ బకాయిలు జమ అయ్యాయి. అయితే సీతమ్మధార ఉప ఖజానా కార్యాలయం పరిధిలో 14 వేల మంది పింఛన్‌దారులకు ఇంతవరకూ డీఏ ఎరియర్స్‌ జమ కాలేదు. ఈ మొత్తం సుమారు రూ.20 కోట్ల వరకు ఉంటుంది. డీఏ ఎరియర్స్‌ జమ చేయాలని ఉన్నతాధికారులకు కొందరు లేఖలు రాశారు.

Updated Date - Apr 11 , 2026 | 01:18 AM