నత్తనడకన హెచ్‌పీవీ వ్యాక్సినేషన్
ABN , Publish Date - Jul 05 , 2026 | 12:50 AM
గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ (సర్వైకల్ క్యాన్సర్) సహా పలురకాల క్యాన్సర్‌లను నియంత్రించే ఉద్దేశంతో కేంద్రం చేపట్టిన ఉచిత హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమం మందకొడిగా సాగుతోంది.
క్యాన్సర్ నియంత్రణకు 14 ఏళ్ల బాలికలకు ఉచితంగా వ్యాక్సిన్
మార్చిలో ప్రారంభం
ఈ నెలాఖరు వరకూ గడువు ఇచ్చిన ప్రభుత్వం
జిల్లాలో ఇప్పటివరకూ 62.83 శాతం మందికి మాత్రమే వ్యాక్సిన్
రకరకాల అపోహలతో దూరంగా ఉంటున్న బాలికలు
విశాఖపట్నం, జూలై 4 (ఆంధ్రజ్యోతి):
గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ (సర్వైకల్ క్యాన్సర్) సహా పలురకాల క్యాన్సర్‌లను నియంత్రించే ఉద్దేశంతో కేంద్రం చేపట్టిన ఉచిత హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమం మందకొడిగా సాగుతోంది. అపోహలతో బాలికలు వ్యాక్సిన్‌కు దూరంగా ఉండడమే అందుకు కారణమని ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది మార్చి నెలలో ఉచిత వ్యాక్సినేషన్‌ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రారంభించాయి. జిల్లాలో 14 ఏళ్ల వయసున్న బాలికలు 14,792 మంది ఉన్నట్టు అధికారులు గుర్తించారు. వారికి వ్యాక్సినేషన్ చేయించేందుకు జిల్లాలో 32 అర్బన్ హెల్త్ సెంటర్స్/ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను కోల్డ్ చైన్ పాయింట్స్ (సీసీపీ)గా ఎంపిక చేశారు. రోజుకు ఒక్కో కేంద్రంలో 50 మంది బాలికలకు వ్యాక్సిన్ ఇచ్చేలా అధికారులు ఆదేశాలు జారీచేశారు. అయితే, గడిచిన నాలుగు నెలల్లో 62.83 శాతం మంది మాత్రమే వ్యాక్సిన్ తీసుకున్నారు. మరో 37.18 శాతం మంది వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉంది. వ్యాక్సిన్ తీసుకునేందుకు ముందుకురాని బాలికల ఇళ్లకు ఆరోగ్య శాఖ సిబ్బంది వెళ్లి తల్లిదండ్రులకు అవగాహన కలిగిస్తున్నారు. వారికి ఉన్న అపోహలను తొలగించేందుకు యత్నిస్తున్నారు.
50 శాతమే పూర్తి కావడంతో..
జిల్లాలో హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ ప్రక్రియ మార్చిలో ప్రారంభమైంది. మే నెలాఖరు నాటికి శతశాతం పూర్తి చేయాలని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు లక్ష్యాన్ని నిర్దేశించారు. అయితే, మే నెలాఖరు నాటికి 50 శాతం కూడా పూర్తి కాకపోవడంతో మరో రెండు నెలలు గడువు ఇచ్చారు. జూలై రెండో తేదీ నాటికి జిల్లాలో 62.83 శాతం మేర వ్యాక్సినేషన్ పూర్తయింది. మిగిలిన 37.17 శాతం లక్ష్యాన్ని ఈ నెలాఖరు నాటికి పూర్తి చేయాల్సి ఉంటుంది. అయితే, గడువులోగా పూర్తిచేసే అవకాశం కనిపించడం లేదు. రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో ఇదే పరిస్థితి ఉందని చెబుతున్నారు. దీనిపై జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ బి.లూసీ కార్డీలియో మాట్లాడుతూ ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందించే లక్ష్యంతో తాము పని చేస్తున్నామన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తమ సిబ్బందికి సహకారాన్ని అందించాలని ఆమె కోరారు.